ట్రంప్‌పై కాల్పులు గేమ్ ఛేంజర్ అవుతుందా? అధ్యక్ష ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
Attack On Donald Trump : డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల ఘటన ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. అందరికీ సహజంగానే ఆసక్తిగా అనిపించే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ ఘటన జరగడటంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఈ ఘటన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ అవుతుందా?
డొనాల్డ్ ట్రంప్ ముఖం, చెవులపై రక్తం, గాలిలో పిడికిలితో ఉన్న చిత్రం అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ట్రెండ్ అవుతోంది. అమెరికాకు అవసరమైన ఫైటర్ అంటూ క్యాప్షన్‌తో కొందరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ ఘటనతో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఉంటుందోనని సహజంగానే చర్య మెుదలైంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ సిటీలో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా ఆయనపై కాల్పులు జరిగాయి. అతని కుడి చెవికి బుల్లెట్ తగిలింది. కానీ వెంటనె తేరుకున్న ట్రంప్ కిందకు వంగాడు. ట్రంప్ వేదికపైకి వచ్చి మాట్లాడటం ప్రారంభించగానే కాల్పులు జరిగడంతో ఒక్కసారిగా అమెరికా ఉలిక్కిపడింది. 20 ఏళ్ల యువకుడు ఈ ఘటనకు పాల్పడ్డాడు. అయితే అతడిపైకి వెంటనే కాల్పులు జరపగా అక్కడే మృతి చెందాడు.
నిజానికి USలో 2024 అధ్యక్ష ఎన్నికలు కొన్ని కారణాలతో ప్రపంచ దృష్టిని ఆకర్శించాయి. మొదట అధ్యక్షుడు జో బైడెన్ 81 ఏళ్ల వయసులో తిరిగి ఎన్నిక కోసం ప్రయత్నిస్తున్నారు. అతని ఆరోగ్యం క్షీణించడం గురించి వార్తల్లో నిలుస్తున్నారు. మీటింగ్‌ల్లోనూ మాటల్లో తడబడటం గురించి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు ట్రంప్‌పై కాల్పుల సంఘటనతో అందరి మనసులో USలో ఏం జరుగుతుందోనని ఆలోచన కలిగిస్తుంది.
అన్ని రంగాలలో ప్రపంచంలోనే టాప్‌లో ఉండాలనుకునే అమెరికాలో ఇలాంటి ఘటనలు జరగడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు సరైన అభ్యర్థులు దొరకడం లేదనేది ఒక విడ్డూరం. ఇవన్నీ అమెరికా రాజకీయాల గురించి చాలా మాట్లాడేలా చేస్తున్నాయి. డెమోక్రాట్‌లు, రిపబ్లికన్లు అభ్యర్థుల ఎంపిక పట్ల ప్రజలు సంతృప్తిగా లేరని అనేక సర్వేలు చెబుతున్నాయి.
బైడెన్ రేసు నుండి వైదొలగడానికి నిరాకరించారు. డెమొక్రాట్లు రిపబ్లికన్‌ల చేతిలో ఓడిపోతున్నట్లు కనిపిస్తోంది. ప్యూ రీసెర్చ్ ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం, జూన్ 27 చర్చలో అధ్యక్షుడు జో బైడెన్ మాటల్లో స్పష్టత లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. బైడెన్ కంటే 4 శాతం ఆధిక్యంలో ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. 44 శాతం మంది ఈరోజు ఎన్నికలు జరిగితే.. తాము ట్రంప్‌కు ఓటు వేస్తామని చెబుతున్నారు. 40 శాతం మంది బైడెన్‌కు ఓటు వేస్తామని అంటున్నారు. అయితే 15 శాతం మంది మరో పార్టీ అభ్యర్థి అయిన రాబర్ట్ ఎఫ్. కెన్నెడీ జూనియర్‌కు మద్దతు ఇస్తున్నారు.
డెమొక్రాట్లు బైడెన్‌కు ప్రత్యామ్నాయం కోసం చూశారని కూడా కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఇందుకోసం పబ్లిక్ ఒపీనియన్ స్ట్రాటజీస్, అమెరికన్ పల్స్ రీసెర్చ్ అండ్ పోలింగ్ ఏజెన్సీల ద్వారా డెమోక్రాట్ నేతల పాపులారిటీపై సర్వే నిర్వహించారు.
చర్చలో బలహీనమైన ప్రదర్శన కారణంగా బైడెన్ ఆరోగ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతకుముందు కొంతమంది డెమొక్రాట్ నాయకులు బైడెన్ అధ్యక్ష రేసు నుండి వైదొలగాలని డిమాండ్ చేశారు కూడా. ఇంతలో బైడెన్ అధ్యక్ష రేసు నుండి వైదొలగాలని ప్రతి 10 మంది అమెరికన్ పౌరులలో 8 మంది విశ్వసించడంతో అతని పాపులారిటీ రేటింగ్ క్షీణించింది.
అనేక సర్వేల ప్రకారం ఎన్నికల సమయంలో ట్రంప్‌కు 50 శాతం మంది అనుకూలంగా ఉంటారని, 47 శాతం మంది బైడెన్‌కు మద్దతు ఇస్తారని కొందరు లెక్కలు వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, అధ్యక్ష అభ్యర్థులపై హత్యాయత్నాలు అమెరికా చరిత్రలో కొత్త విషయం కాదు. కానీ ట్రంప్‌పై శనివారం నాటి ప్రయత్నం ఎన్నికలను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి అన్ని కలిసి వచ్చినట్టైంది. అతని రక్తంతో తడిసిన ముఖం, పిడికిలితో ఉన్న ఫోటో అమెరికా చరిత్రలో కచ్చితంగా ఉంటుంది. అమెరికన్ ఓటర్లను కచ్చితంగా ప్రభావితం చేస్తాయి. అమెరికా ఎన్నికల గమనాన్ని మార్చే శక్తి ఈ ఫోటోకు ఉందని అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
అయితే భారత్‌లాంటి దేశంలో మాత్రం సానుభూతి రాజకీయాలకు పెద్దపీట ఉంటుంది. ట్రంప్ మీద కాల్పులు తనపై సానుకూలంగా మారుతుందా అనేది వేచి చూడాలి. చాలా మంది మాత్రం ఇది ట్రంప్‌కు కలిసి వచ్చే అంశమే అంటున్నారు. ఇప్పటికే డిబేట్లలో బైడెన్ వెనక్కుపోయాడనేది సత్యం. ఇప్పుడు ఈ ఘటనతో ట్రంప్‌కు మద్దతు పెరుగుతుందని చెప్పేవారే చాలామంది.