Pedda Amberpet Police Firing: హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో గత కొద్దిరోజులుగా పార్థి గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతోంది. వీరిపై నిఘా ఉంచిన పోలీసులు ఎలాగైనా పట్టుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి ముఠాను గుర్తించిన పోలీసులు పట్టుకునేందుకు యత్నించారు. అప్రమత్తమైన పార్థి గ్యాంగ్ పారిపోయేందుకు ప్రయత్నించగా… కాల్పులు జరిపారు. వీరి గ్యాంగ్ కు సంబంధించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన హైదరాబాద్ శివార్లలోని పెద్ద అంబర్‌పేట సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద జరిగింది. ఇటీవలే కాలంలో విజయవాడ జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలను టార్గెట్ చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూశాయి. వీటిని సీరియస్ గా తీసుకున్న నల్గొండ జిల్లా పోలీసులు నిఘా పెట్టారు. ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపారు.
ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున పార్థి గ్యాంగ్ ముఠా సభ్యులు… పెట్రోలింగ్ పోలీసుల కంటపడ్డారు. వెంటనే వారిని పట్టుకునేందుకు యత్నించారు. అప్రమత్తమైన దొంగల ముఠా.. తప్పించుకునే ప్రయత్నం చేసింది. జిల్లా పరిధి దాటి రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి ఎంట్రీ అయ్యారు. వెంటనే నల్గొండ జిల్లా పోలీసులు కమిషనరేట్ పోలీసులకు సమాచారం అందించారు.
నల్గొండ సీసీఎస్, రాచకొండ కమిషనరేట్ పోలీసులు రంగంలోకి దిగటంతో పార్థి గ్యాంగ్ ను చుట్టుముట్టే ప్రయత్నం జరిగింది. ఓ దశలో పోలీసులపై దొంగలు కత్తులతో ఎదురుదాడికి దిగారు. దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో నలుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వీరు తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పలు దొంగతనాలు చేసినట్లు తెలుస్తోంది. వీరి కూపీని లాగే పనిలో పడ్డారు పోలీసులు. కాల్పుల ఘటన శివారు ప్రాంతంలో సంచలనంగా మారింది.