Bank Holiday-Dormant Accounts: వృద్ధుల ఖాతాల్లో పెన్షన్ సొమ్ములు పడతాయా..ఏపీలో Dormant ఖాతాలెన్నో లెక్కుందా!
30 April 2024, 9:10 IST
- Bank Holiday-Dormant Accounts: ఏపీలో ఇంటింటి పింఛన్ల పంపిణీకి ఈ నెల కూడా చిక్కులు తప్పేట్టు లేవు. మే1న రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాలకు పెన్షన్ల పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా వినియోగంలో లేని ఖాతాల సంగతేమిటో స్పష్టత రాలేదు.
కనీస బ్యాంక్ బ్యాలెన్స్ లేని ఖాతాల పరిస్థితి ఏమిటి?
Bank Holiday-Dormant Accounts: ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాల్లో Welfare Schemes భాగంగా ప్రభుత్వం నుంచి వివిధ రకాల పెన్షన్లు అందుకుంటున్న లబ్దిదారులకు ఈ నెల కూడా ఇబ్బందులు తప్పేట్టు లేవు. EC ఈసీ ఆదేశాలతో లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో Bank Accounts ప్రభుత్వ పెన్షన్ల Pension సొమ్ము జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్త సందేహాలు తలెత్తతున్నాయి. కనీస నిల్వ లేని ఖాతాలు Minimum Balance, నిద్రాణమై ఉన్న ఖాతాల సంగతేమిటనే విషయంలో స్పష్టత లేదు. పెన్షన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎస్‌ఎల్‌బిసికి ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు జీరో బ్యాలెన్స్ ఖాతాలను గత కొన్నేళ్లుగా వదిలించుకుంటున్నారు. 60ఏళ్లకు పైబడిన వారి బ్యాంకు ఖాతాలను కస్టమర్ కోరితే మాత్రమే వాటిని జీరో బ్యాలెన్స్ అకౌంట్లు మారుస్తున్నారు. లేకపోతు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వ లేకపోతే ఛార్జీలు పడుతుంటాయి.
ప్రస్తుతం ప్రతి ప్రభుత్వ బ్యాంకులో కనీస నిల్వ రూ.1000 ఉండాల్సిందే. బ్యాంకును బట్టి ఈ కనీస నిల్వ మారుతుంటుంది. ఖాతాలో కనీస నిల్వను ఉంచకపోతే వారికి ప్రతినెల జరిమానా పడుతుంది. బ్యాంకును బట్టి ఈ మొత్తం రూ.50 ప్లస్ జిఎస్టీతో మొదలవుతుంది. బ్యాంకు ఖాతాలను నెలల తరబడి వాడకపోయినా ఈ పెనాల్టీ మాత్రం ప్రతి నెల జమ అవుతూనే ఉంటుంది. ఏదైనా సందర్భంలో బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అయిన వెంటనే ఆ డబ్బును బ్యాంకులు ఆటోమెటిక్‌గా తమ ఖాతాలకు మళ్లించేసుకుంటున్నాయి.
పెన్షన్ల డబ్బులకు రెక్కలొస్తాయ్…
ఏపీలో ప్రభుత్వ పెన్షన్లను వాలంటీర్లతో పంపిణీ చేయడంపై రాజకీయ పార్టీల అభ్యంతరాలతో ఈసీ అడ్డుకట్ట వేయడంతో బ్యాంకు ఖాతాలు ఉన్నా వారికి నేరుగా జమ చేయాలని, వృద్ధులు, వికలాంగులు, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి ఇతర ఉద్యోగులతో పంపిణీ చేయాలని సూచించింది.
ఏపీలో ప్రతి నెల 68లక్షల మందికి ప్రభుత్వం పెన్షన్లు చెల్లిస్తోంది. ఏప్రిల్ నెలలో పెన్షన్ల పంపిణీలో సమస్యలు తలెత్తడంతో వృద్ధులు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. ఈసీ ఆదేశాలతో ఏప్రిల్ మొదటి వారం వరకు పెన్షన్లను సచివాలయాల్లో పంపిణీ చేశారు.
మే 1 నుంచి పంపిణీ చేయాల్సిన పెన్షన్లకు కొత్త సమస్యలు తప్పకపోవచ్చు. దాదాపు 41లక్షల పెన్షన్లను నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. వీటిలో ఎన్ని ఖాతాలు వినియోగంలో ఉన్నాయనే దానిపై స్పష్టత లేదు. బ్యాంకు ఖాతాలు వినియోగంలో లేకపోతే అయా బ్యాంకుల నిబంధనల మేరకు ఖాతాల్లో పడిన డబ్బుల్లో తమకు రావాల్సిన డబ్బును జమ చేసేసుకుంటాయి.
పెన్షన్ల డబ్బులో బ్యాంకు ఫీజుల్ని మినహాయించుకోవడంపై ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయలేదు. గతంలో ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల్లో భాగంగా లబ్దిదారులకు ప్రభుత్వం చెల్లించిన నగదులో కూడా చాలా బ్యాంకులు తమ ఖాతాల్లో జమ చేసుకున్నాయి. ఇప్పుడు పెద్ద మొత్తంలో నగదు బ్యాంకు ఖాతాలకు జమ అవుతుండటంతో డిబిటి సొమ్ము బ్యాంకుల పాలయ్యే ప్రమాదం ఉంది.
పెన్షన్ల సొమ్మును లబ్దిదారుల ఖాతాలకు చెల్లించాలని ఆదేశించిన ప్రభుత్వం రాష్ట్ర స్థాయి బ్యాంకర్లకు ప్రత్యేకంగా సూచనలు చేయలేదు. బ్యాంకు ఖాతాలున్న వారందరికి నేరుగా నగదు బదిలీ చేస్తామని ప్రకటించారు. ఈ బ్యాంకు ఖాతాలు ఎక్కడ ఉన్నాయో, వాటిని బ్యాంకుల నుంచి తెచ్చుకోవడం కూడా ప్రహసనంగా మారనుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం 41లక్షల బ్యాంకు ఖాతాల్లో దాదాపు 28లక్షల ఖాతాలు Minimum Account Balance లేదనే అంచనాలు ఉన్నాయి.
బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం పెన్షన్లుగా చెల్లించే రూ.3వేలల్లో తమకు రావాల్సిన సొమ్మును మినహాయించుకుంటే లబ్దిదారుల భారీగా చిల్లు పడుతుంది. చాలా ఖాతాలకు ఏటిఎం సదుపాయం కూడా ఉండదు. దీంతో బ్యాంకుల్లో రద్దీ ఏర్పడే ప్రమాదం ఉంది. మే1న ప్రభుత్వ బ్యాంకులకు సెలవు కావడంతో మే2 నుంచి బ్యాంకుల్లో పెన్షన్ మొత్తం జమ అయితే లబ్దిదారులకు అందే అవకాశం ఉంటుంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ చెల్లింపులతో ప్రతి నెల మొదటి వారంలో బ్యాంకుల్లో ఉండే రద్దీకి సంక్షేమ పథకాల పెన్షన్లు కూడా జత కానున్నాయి.
బ్యాంకు ఛార్జీల విషయంలో ఉన్నత స్థాయిలో స్పష్టమై ఆదేశాలు రాకుండా ఖాతాలకు ఛార్జీల మినహాయింపు సాధ్యం కాదని ప్రభుత్వ బ్యాంకు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.