Southwest Monsoon 2022: రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి రుతుపవనాలు..
10 June 2022, 18:36 IST
- రేపు లేదా ఎల్లుండి లోపు ఏపీలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. 2 రోజుల్లో పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలో వాతావరణం
మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించనున్నాయి. శనివారం మధ్యాహ్నంలోగా దక్షిణ ఏపీని రుతుపవనాలు తాకే అవకాశం ఉంది. రాబోయే 2 రోజుల్లో పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
రుతుపవనాల ప్రభావంతో గోవా, కేరళతో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు శుక్ర, శని వారాల్లో కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రాతో పాటు యానాం పరిసరాల్లో పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. 30-40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయనున్నట్లు వెల్లడించింది. ఇక ఇవాళ ఏపీలోని పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటగా.. మరికొన్ని చోట్ల 34 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి.
తెలంగాణలో ఇలా.....
ఇక హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. అకాశం మేఘావృత్తమై ఉంటుందని తెలిపింది. పశ్చిమ దిశ ఉపరితల గాలుల వేగం గంటకు 10-15 కి.మీగా వీచే అవకాశం ఉంటుందని వెల్లడించింది.
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చూస్తే ఆదిలాబాద్, భద్రాచలం, హన్మకొండ, ఖమ్మం, నల్గొండ, రామగుండం ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా నమోదైంది. రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది