తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Weather Update | నైరుతి రుతుపవనాలు రాక.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండనుందంటే?

Weather Update | నైరుతి రుతుపవనాలు రాక.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండనుందంటే?

HT Telugu Desk HT Telugu

30 May 2022, 6:23 IST

google News
    • నైరుతి రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే కేరళను తాకాయి. సాధారణంగా జూన్​ 1న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. కానీ ఈసారి మూడు రోజుల ముందుగానే వచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాల పైనా పడనుంది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ వైపు.. దేశంలో భానుడి భగభగలు కొనసాగుతుంటే.. ఐఎండీ తాజాగా చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు పేర్కొంది. సాధారణం కంటే మూడు రోజుల ముందుగానే కేరళను రుతుపవనాలు పలకరించాయి. దీంతో ఏపీ తెలంగాణలోనూ దీని ప్రభావం ఉండనుంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ముందుగానే నైరుతి రుతుపవనాల రాకతో తెలంగాణలో రానున్న మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదు కానుంది. రాగల మూడురోజులు ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్ లో గరిష్ట ఉష్ణోగ్రతలు.. సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర కోస్తా, యానాంలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల పడే ఛాన్స్ ఉంది. రాయలసీమలో ఇవాళ ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల పడొచ్చు.

ఈ మధ్యనే బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను కారణంగా గత నెల నుంచి రుతుపవనాల్లో వేగం పెరిగిందని ఐఎండీ పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని చెప్పింది. నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. ఈసారి మాత్రం ముందుగానే వచ్చాయి. మూడు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకి, లక్ష ద్వీపాల్లోకి ముందుగానే ప్రవేశించాయి. రాగల రెండు, మూడు రోజుల్లో కేరళలోని మిగిలిన ప్రాంతాలు, తమిళనాడు, కర్ణాటక, దక్షిణ మధ్య బంగాళాఖాతం ఈశాన్య రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.

తదుపరి వ్యాసం