Vizag Steel Plant : స్టీల్‌ప్లాంట్ నష్టాలను భరించడం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాదు - కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ
29 September 2024, 13:18 IST
- Vizag Steel Plant : వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలను భరించడం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ అన్నారు. నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ను సెయిల్ విలీనం చేసేందుకు సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు.
స్టీల్‌ప్లాంట్ నష్టాలను భరించడం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాదు - కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ
Vizag Steel Plant : వైజాగ్ స్టీల్‌ప్లాంట్ నష్టాలను భరించడం కేంద్ర ప్రభుత్వానికి సాధ్యం కాదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. ఇది ప్రజా ధనమని, నష్టాల్లో ఉన్న పరిశ్రమ కోసం నిధులు ఖర్చు చేసే పరిస్థితి లేదని అన్నారు. నష్టాల్లో ఉన్న పరిశ్రమను విలీనం చేసే సమయంలో సాంకేతిక సమస్యలు ఉంటాయని, వాటిని అధిగమించాలనే అంశంపై సెయిల్ అధికారులతో చర్చ జరిపామని అన్నారు.
కార్మికులు ఆందోళన చెందడం సహజమని, సాధ్యాసాధ్యాలను అర్ధం చేసుకోవాలని కోరారు. విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో ప్రజల సెంటిమెట్లను నిలబెట్టేలా ప్రయత్నిస్తున్నామని అన్నారు. స్టీల్‌ప్లాంట్ విషయంలో కొత్త ప్రక్రియ ఏమి లేదని, 2014కు ముందు ఉన్న ప్రభుత్వం నిర్ణయాలపైనే ప్రస్తుతం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యోగుల భద్రత,సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రత్యామ్నాయల గురించి ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
వాస్తవ పరిస్థితులు పరిశీలన చేసి శాశ్వత పరిష్కారం కోసం పని చేస్తున్నామని పేర్కొన్నారు. ప్యాకేజీలతో తత్కాలిక ఉపశమనం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం ఆలోచిస్తోన్నామని అన్నారు. ఆర్థిక మంత్రి నుంచి ప్రధాని మోదీ దృష్టి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తీసుకెళ్లాలని, ఉద్యోగులకు నష్టం కలగకుండా చూడాలని ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉన్న పరిశ్రమలు లాభాల్లో ఉన్నాయని, అవసరం లేకపోయినా విస్తృతపరచడం, గత పాలకుల నిర్ణయాలు, రాయబరేలిలో పరిశ్రమలు పెట్టడం, వేల కోట్లు పెట్టుబడులు పెట్టడం వల్ల స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళ్లిందని విమర్శించారు. కేంద్రం సాయం చేస్తూ పరిశ్రమను లాభాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు స్టీల్‌ప్లాంట్‌పై అవగాహన ఉందన్నారు. సెయిల్, ఎన్ఎండీసీ అధికారులతో సమావేశం అయ్యానని, కొన్ని అంశాలపై చర్చించామని తెలిపారు. నష్టాల్లో ఉన్న పరిశ్రమను విలీనం చేసే సమయంలో సాంకేతిక సమస్యలు ఉంటాయని, వాటిని అధిగమించాలనే అంశంపై సెయిల్ అధికారులతో చర్చ జరిపామని అన్నారు. ఆర్ఐఎన్ఎల్ దగ్గర అదనంగా ఉన్న 1,500 ఎకరాల భూమిని ఎన్ఎండీసీకి ఇచ్చి ఆర్థిక సహకారం, పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఎన్ఎండీసీతో చర్చించామని తెలిపారు.
ఉద్యోగులు, కార్మికులను తప్పు పట్టడం లేదని, ఉత్పత్తి ఎంత కార్మికులు ఎంత అన్న సమాచారం తీసుకున్నానని తెలిపారు. మిగతా సంస్థలతో పోలిస్తే విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికులు ఎక్కువ ఉన్నారని, ఉత్పత్తి తక్కువగా ఉందని అన్నారు. కార్మికులను బాధ్యులను చేయలేమని, సమర్ధవంతమైన అధికారులను నియమించామని అన్నారు. పనిలేనప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించక తప్పదని, నష్టాలు భరించే పరిస్థితి ప్రభుత్వానికి లేదని అన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుపతి ప్రతిష్ఠ దిగజారింది
కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ టీటీడీ లడ్డు వివాదంపై స్పందించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుపతి ప్రతిష్ఠ దిగజారిందని అన్నారు. గతంలో దేవలయాలపై దాడులు జరిగితే ఒక్కరిపైన చర్యలు తీసుకోలేదని, రామతీర్ధంలో రాముడి తల తీశారని, అంతర్వేదిలో రథం దగ్ధం చేశారని అన్నారు. కొవ్వు పదార్ధాలు కలిసిన నెయ్యిని దిగుమతి చేసుకున్నారన్నది వాస్తవమని, ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయని పేర్కొన్నారు.
గతంలో ఏడు కొండలను రెండు కొండలు చేద్దామనుకున్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని, హిందు ధర్మం ప్రకారం దంపతులు పట్టు వస్త్రాలు ఇచ్చేవారని, కానీ ఆయన ఒక్కరే ధర్మానికి విరుద్దంగా పట్టు వస్త్రాలు ఇచ్చారని విమర్శించారు. డిక్లరేషన్ ఇవ్వాలన్నది చాలా సంవత్సరాలుగా ఉన్న నిబంధన అని, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుపతి వెళ్లారని అన్నారు. లడ్డు విషయ లో 9 మందితో సిట్ ఏర్పాటు చేశారని, లడ్డూ విషయంలో అవకతవకలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.
తిరుమల అవకతవకలపై సిట్ దర్యాప్తు చేసి నివేదికను ప్రభుత్వం ముందు ఉంచుతుందని, వైసీపీ హయాంలో టీటీడీని తన కుటుంబ సభ్యుల ఆధీనంలో పెట్టుకున్నారని విమర్శించారు. తిరుపతిని జగన్ కుటుంబ సభ్యుల చేతుల్లో పెట్టింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అవసరమైతే కేంద్రం తన వంతు పాత్ర పోషిస్తుందని, టీటీడీ లడ్డు వివాదంపై ఇప్పటికే కావాల్సిన వివరాలను కేంద్రం అడిగిందని తెలిపారు. లడ్డు విషయంలో కేంద్రం కూడా సీరియస్‌గా ఉంది. అవసరమైతే విచారణలో కేంద్రం కూడా తన వంతు పాత్ర పోషిస్తుందని తెలిపారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు