Visakhapatnam : విశాఖలో విషాదం.. బస్సు కింద పడి నర్సరీ విద్యార్థి మృతి
Visakhapatnam : విశాఖపట్నం జిల్లాలో విషాదం జరిగింది. రోజూ బడికెళ్లే బస్సే అభం శుభం తెలియని బాలుడి ప్రాణం తీసింది. స్కూల్ బస్సు కింద పడి నర్సరీ చదువుతున్న ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.
భీమిలి మండలం నారాయణరాజుపేటలో బుధవారం విషాద ఘటన జరిగింది. నారాయణరాజుపేటకు చెందిన బాందేపురపు రమణ, ఆదిలక్ష్మీ దంపతులకు వేణుతేజ, అన్విక్ ఇద్దరు పిల్లలున్నారు. అందులో పెద్ద కుమారుడు వేణుతేజ (5) సుమారు ఐదు కిలో మీటర్ల దూరంలోని పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌లో నర్సరీ చదువుతున్నాడు. ఎప్పటిలాగే సాయంత్రం 4 గంటలకు తాను చదువుతున్న పాఠశాల బస్సులో స్వగ్రామం నారాయణరాజుపేట చేరుకుని తోటి విద్యార్థులతో కలిసి బస్సు దిగాడు.
పిల్లలు దిగిన తరువాత డ్రైవర్ బస్సును తిప్పాడు. ఈ సమయంలో వాహనాన్ని టర్న్ చేస్తుండగా.. బస్సు ఈ చిన్నారిని ఢీకొట్టింది. కింద పడిన బాలుడు పైనుంచి బస్సు చక్రాలు వెళ్లడంతో తలభాగం ఛిద్రమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోస్టుమార్టం కోసం బాలుడి మృతదేహాన్ని భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాఠశాల యాజమాన్యాన్ని, డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. మృతి చెందిన బాలుడి తండ్రి ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్ వైజర్‌గా పని చేస్తున్నారు. తల్లి గృహిణి. తన కుమారుడిని మంచిగా చదివించాలని అనుకున్న ఆ తల్లిదండ్రులు కోరికి మధ్యలోనే ఆవిరి అయిపోయింది.
తమ కొడుకును ఈ ఏడాదే పాఠశాలలో చేర్పించామని, ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భీమిలి సీఐ బీ.సుధాకర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బీ.సుధాకర్ వివరించారు.
సరిగ్గా నెల రోజుల కిందట కూడా ఇదే మండలంలో మజ్జిపేటలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. పద్మనాభం మండల పరిధిలోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్న విద్యార్థి రోజులానే స్కూల్ బస్సులో వెళ్లి, తిరిగి సాయంత్రం బస్సులో గ్రామానికి చేరుకున్నాడు. బస్సు దిగి రోడ్డు అవతల ఉన్న తండ్రి వద్దకు వెళ్తున్న సమయంలో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా ముందుకు పోనిచ్చాడు. ఆ బాలుడు ఆ బస్సు కింద పడి అక్కడికక్కడే మరణించాడు. తండ్రి కళ్లఎదుటే ఆ బాలుడు బస్సు టైర్ల కింద పడి నుజ్జునుజ్జయ్యాడు.
ఈ ఘటన మరవకముందే ఇప్పుడు తాజాగా నారాయణ రాజుపేటలో ఈ ఘటన జరిగింది. దీంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. పాఠశాల యాజమాన్యాలు బస్సుల్లో క్లీనర్లను ఏర్పాటు చేయకపోవడంతో తరచు ఇలాంటి ఘటనలో జరుగుతున్నాయని పిల్లల తల్లిదండ్రులు అంటున్నారు. పిల్లలు సురక్షితంగా రోడ్డు దాటుతున్నారా? లేదా ? అనేది చూసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు )