Alampur Tragedy: అలంపూర్‌లో విషాదం.. విరిగిపడిన కరెంట్ స్తంభం.. బాలుడు మృతి
Alampur Tragedy: జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. కరెంట్ స్తంభం విరిగిపడి ఓ బాలుడు మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమారుడు తనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ పట్టణం సంగమేశ్వర కాలనీలో విషాదం జరిగింది. విద్యుత్ స్తంభం విరిగిపడి బాలుడు చనిపోయాడు. కరెంట్ తీగలపై చెట్టు కొమ్మలు పడుతుండడంతో.. విద్యుత్ శాఖ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. అయితే.. ఆదివారం పవర్ సప్లై నిలిపి వేసి.. చెట్టు కొమ్మలు కొడుతున్నారు. ఈ క్రమంలో కొమ్మ విరిగి కరెంట్ తీగలపై పడింది. కరెంట్ పోల్ పాతది కావడంతో.. అది విరిగి ఇంటి ముందు ఆడుకుంటున్న మహేశ్(4)పై పడింది.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే..
వెంటనే స్పందించిన స్థానికులు.. బాలుడు మహేశ్‌ను ఆసుపత్రికి తరలించారు. బాలుడిని డాక్టర్లు పరీక్షించి.. అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. దీంతో బాలుడి కుటుబంలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే తమ కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. బాలుడి కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు విద్యుత్ ఏఈఈ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. చెట్టు కొమ్మలు కొట్టేటప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు.
కడపలోనూ ఇలాంటి ఘటనే..
కడప నగరంలోని బెల్లంమండి వీధి బళ్లారి రోడ్డులో ఇటీవల ఇలాంటి ఘటనే జరిగింది. వీధిలో విద్యుత్ తీగలు తగిలి ఓ విద్యార్థి మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్ర గాయాలయ్యాయి. తన్వీర్ (11) అద్నాన్.. ఇద్దరు చిన్నారులు ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు. ఉదయాన్నే స్కూల్‌కి వెళ్లారు. ఆ తర్వాత లంచ్ బ్రేక్‌కి ఇంటికి వెళ్లారు. అప్పటివరకూ ఆడుతూ పాడుతూ ఉన్న ఇద్దరు పిల్లలు లంచ్ చేసి సైకిల్ పై స్కూల్‌కి వెళ్తున్నారు.
సరిగ్గా వీధి టర్నింగ్‌లో ఉన్న ట్రాన్స్‌ఫార్మార్ నుంచి కరెంట్ వైర్లు రోడ్డుపైకి వేలాడాయి. ఆ కరెంట్ వైర్లు సైకిల్‌పై వెళ్తున్న చిన్నారులను తాకాయి. దీంతో వారు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. తన్వీర్ ఘటనా స్థలంలోనే మరణించగా.. మరొకరు.. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. స్థానికులు స్పందించి ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే బాబు ప్రాణాలు తీసిందని స్థానికులు ఆందోళనకు దిగారు.