TGNPDCL CMD: ప్రతి కరెంట్‌ పోల్‌కు ప్రత్యేక సంఖ్య,విద్యుత్ సమస్యలపై టిజి ఎన్పీడిసిఎల్‌ సిఎండి ఫోకస్-separate number for each current pole tgnpdcl cmd focus on power issues ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgnpdcl Cmd: ప్రతి కరెంట్‌ పోల్‌కు ప్రత్యేక సంఖ్య,విద్యుత్ సమస్యలపై టిజి ఎన్పీడిసిఎల్‌ సిఎండి ఫోకస్

TGNPDCL CMD: ప్రతి కరెంట్‌ పోల్‌కు ప్రత్యేక సంఖ్య,విద్యుత్ సమస్యలపై టిజి ఎన్పీడిసిఎల్‌ సిఎండి ఫోకస్

HT Telugu Desk HT Telugu
Jul 15, 2024 09:36 AM IST

TGSPDCL CMD: తెలంగాణ నార్నర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీ ఎన్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) కర్నాటి వరుణ్ రెడ్డి విద్యుత్తు సంబంధ సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

విద్యుత్ సమస్యల పరిష్కారంపై సిఎండి ఫోకస్
విద్యుత్ సమస్యల పరిష్కారంపై సిఎండి ఫోకస్

TGSPDCL CMD: తెలంగాణ నార్నర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీ ఎన్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) కర్నాటి వరుణ్ రెడ్డి విద్యుత్తు సంబంధ సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.

విద్యుత్తు అంతరాయాలను తగ్గించడంతో పాటు అందుబాటులో ఉన్న సాంకేతికను అందిపుచ్చుకునేందుకు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో అస్సెట్ మ్యాపింగ్ ట్రాకింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. సంస్థ పరిధిలోని అన్ని 33 కేవీ, 11 కేవీ స్తంభాలకు యూనిక్ పోల్ నెంబర్ పెయింటింగ్ ప్రక్రియను ప్రారంభించారు.

ఈ పద్ధతితో విద్యుత్తు సంబంధ సమస్యలు తొందరగా పరిష్కరించేందుకు అవకాశం ఉండటంతో పాటు అంతరాయాలను అరికట్టే వీలుంటుందని సీఎండీ కర్నాటి వరుణ్ తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే ఎన్ పీడీసీఎల్ ఆఫీసర్లు, సిబ్బందికి అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

లొకేషన్ మ్యాపింగ్ తో సేవలు

టీజీ ఎన్పీడీసీఎల్ లో అస్సెట్ మ్యాపింగ్ వల్ల స్తంభాల వారీగా పెట్రోలింగ్ సులభంగా చేపట్టే అవకాశం ఉంటుందని సీఎండీ వరుణ్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేగాకుండా మెయింటెనెన్స్ ను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే వీలు ఉంటుందని తెలిపారు. అంతరాయాలు, ట్రాన్స్ ఫార్మర్ల వైఫల్యాలు కూడా ట్రాక్ చేసుకునే సౌల్యభ్యం ఉంటుందని పేర్కొన్నారు.

ఎక్కడైనా సమస్య ఉత్పన్నమైతే వెంటనే ఆ పోల్ నెంబర్ ద్వారా అక్కడి లొకేషన్ మ్యాపింగ్ తెలుసుకునే ఆస్కారం ఉంటుందని, వెంటనే అక్కడికి వెళ్లి సమస్యను త్వరితగతిన పరిష్కరించవచ్చని వెల్లడించారు. దీని ద్వారా అంతరాయాల సమయాన్ని గణనీయంగా తగ్గించవచ్చని, ముందస్తు సమాచారం తెలుసుకోవడానికి, సమస్యలు ఏర్పడక ముందే గుర్తించడానికి ఎంతో దోహద పడుతుందని సీఎండీ వివరించారు.

ప్రీ మాన్సూన్ ఇన్ స్పెక్షన్ కు ప్రణాళిక

కరెంట్ పోల్స్ కు యూనిట్ నెంబర్ కేటాయింపు ప్రక్రియ వేగంగా సాగుతోందని, ఇప్పటివరకు సుమారుగా 1,862 ఫీడర్లకు నెంబరింగ్ ప్రక్రియ పూర్తయ్యిందని సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. వాటి డిజిటలైజేషన్ తో పాటు ప్రీ మాన్సూన్ ఇన్ స్పెక్షన్ కూడా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మిగతా ఫీడర్లను రాబోయే రెండు నెలల సమయంలో పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని సీఎండీ వివరించారు.

కాగా ప్రీ మాన్సూన్ ఇన్ స్పెక్షన్ (పీఎంఐ) లో భాగంగా ముందస్తు విద్యుత్ లైన్ల నిర్వహణ కార్యక్రమం చేపట్టి, ఎప్పటికప్పుడు పీఎంఐ ఆప్ లో వివరాలు అప్ లోడ్ చేస్తున్నట్లు తెలిపారు. పోల్ నెంబర్ పెయింటింగ్ ద్వారా అస్సెట్ మ్యాపింగ్ చేసిన అన్ని రకాల విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లను సమయానుసారంగ నిర్వహణ చేపట్టడంతో పాటు అప్ గ్రేడ్ చేసేందుకు కూడా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఈ ప్రక్రియ తద్వారా సమస్యలను పరిష్కరించడం, అంతరాయాల సమయాన్ని తగ్గించడంతో పాటు వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సరఫరా అందించేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరింత సాకేంతికతకు అందుబాటులోకి తీసుకు వచ్చి విద్యుత్తు సంబంధ సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్లు సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి వివరించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner