Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై ‘బలవంతపు వసూళ్ల’ ఆరోపణలు; కేసు నమోదు చేయాలన్న కోర్టు
Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పై కేసు నమోదు చేయాలని బెంగళూరు కోర్టు ఆదేశించింది.ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వ్యక్తులు, కార్పొరేట్ సంస్థల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై నిర్మలా సీతారామన్ తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరు కోర్టు ఆదేశించింది.
Nirmala Sitharaman: ఎలక్టోరల్ బాండ్ల ద్వారా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరు కోర్టు ఆదేశించింది. చట్ట సభల సభ్యులపై విచారణ జరిపే ప్రత్యేక కోర్టులో జనాధికార్ సంఘర్ష్ పరిషత్ కు చెందిన ఆదర్శ్ అయ్యర్ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఇతర నేతలపై కూడా..
ఆదర్శ్ అయ్యర్ పిటిషన్ దాఖలు చేసిన పిటిషన్ లో కేంద్ర మంత్రి జేపీ నడ్డా, ఇద్దరు సీనియర్ కర్ణాటక బీజేపీ నాయకులు నలీన్ కుమార్ కటీల్, బివై విజయేంద్ర పేర్లు కూడా ఉన్నాయి. అయితే, ఎలక్టోరల్ బాండ్లు విధానపరమైన అంశమని, ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమని బీజేపీ వాదిస్తోంది. నిర్మల సీతారామన్ కు మద్దతుగా బీజేపీ (bjp) నేతలు వాదిస్తున్నారు. ఎలక్టోరల్ బాండ్ పథకం ద్వారా వ్యక్తులు, కార్పొరేట్ సంస్థల నుంచి బలవంతంగా కోట్లాది రూపాయలు వసూలు చేశారని నిర్మల సీతారామన్, తదితరులపై ఈ ఫిర్యాదులో ఆరోపణలు చేశారు. ఇందుకు గానూ, ఈడీ దాడులను వాడుకున్నారని ఆరోపించారు.
ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కోట్ల రూపాయల వసూలు
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) దాడులను బీజేపీ నేతలు 'ప్రెజర్ స్ట్రాటజీ'గా వాడుకుని, కార్పొరేట్ సంస్థల నుంచి ఎలక్టోరల్ బాండ్ల (electoral bonds) రూపంలో వేల కోట్ల రూపాయలను వసూలు చేశారని ఆరోపించారు. ఈ ఎలక్టోరల్ బాండ్లను రాష్ట్ర, జాతీయ స్థాయిలోని బీజేపీ నేతలు క్యాష్ చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ అనంతరం, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దోపిడీ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరులోని తిలక్ నగర్ పోలీస్ స్టేషన్ ను కోర్టు ఆదేశించింది.