Electoral bonds : ‘అధికారంలోకి వస్తే.. ఎలక్టోరల్ బాండ్స్‌ని మళ్లీ తీసుకొస్తాము’
అధికారంలోకి వస్తే.. ఎలక్టోరల్ బాండ్స్‌ని బీజేపీ మళ్లీ తీసుకొస్తుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇదే విషయంపై పలు కీలక వ్యాఖ్యాలు చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.
Nirmala Sitharaman on Electoral bonds : రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చేసిన ఎలక్టోరల్ బాండ్స్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. బీజేపీ అధికారంలోకి వస్తే.. ఎలక్టోరల్ బాండ్స్‌ని మళ్లీ తీసుకొస్తామని సంకేతాలిచ్చారు.
"స్టేక్‌హోల్డర్స్‌తో ఇంకా చాలా సంప్రదింపులు, చర్చలు జరపాలి. అందరికి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఒక ఫ్రేమ్‌వర్క్‌ని ఎలా రూపొందించాలో ఆలోచించాలి. ఈ మార్గంలో వస్తున్న నల్ల ధనాన్ని అరికట్టడమే లక్ష్యం. పారదర్శకంగా ఉండేడట్టు కూడా చూసుకోవాలి," అని హిందుస్థాన్ టైమ్స్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో అన్నారు నిర్మలా సీతారామన్. ఎలక్టోరల్ బాండ్స్‌తో పాదర్శకత పెరిగిందని పేర్కొన్నారు నిర్మలా సీతారమన్.
అసలేంటి ఈ ఎలక్టోరల్ బాండ్స్..?
రాజకీయ పార్టీలకు విరాళాలు అందిచేదే ఈ ఎలక్టోరల్ బాండ్స్. 2018లో చట్టం రూపంలో దీనిని ప్రవేశపెట్టింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం. పార్టీలకు విరాళాలు ఇవ్వాలనుకునే వారు.. ఎస్బీఐలో ఈ బాండ్స్‌ని కొనుగోలు చేయాల్సి వచ్చేది. నిర్దేశిత సమయంలోపు వాటిని ఆయా పార్టీలు రిడీమ్ చేసుకోవాల్సి వచ్చేది. అయితే.. ఈ ప్రక్రియ ద్వారా.. ఎవరు, ఎవరికి, ఎంత ఇస్తున్నారు? అనేది తెలుసుకోవడానికి కుదిరేది కాదు.
Electoral bonds latest news : ఈ వ్యవహారంపై సుదీర్ఘకాలం పాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఎలక్టోరల్ బాండ్స్ అనేవి రాజ్యాంగ విరుద్ధమని తేల్చేసింది. ఈ వ్యవస్థను రద్దు చేసింది. సంబంధిత డోనర్ల వివరాలను బయటపెట్టాలని ఎస్బీఐ, ఎన్నికల సంఘానికి ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుపై బీజేపీ అగ్రస్థానం అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. ఇంకా రివ్యూ చేయలేదు.
'ఎలక్టోరల్ బాండ్స్‌ని మళ్లీ తీసుకొస్తాము..'
ఎలక్టోరల్ బాండ్స్‌ని తొలగించడంతో పార్టీలకు డబ్బులు అందే విషయంలో పారదర్శకత లోపిస్తుందని వ్యాఖ్యానించారు నిర్మలా సీతారామన్.
"ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌లో కొన్ని మార్పులు చేయాలన్న మాట నిజమే. ఇక బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. సరైన కన్సల్టేషన్ జరిపి, ఎలక్టోరల్ బాండ్స్‌ని తీసుకొచ్చే అవకాశం ఉంది," అని నిర్మలా సీతారామన్ అన్నారు.
2024 Lok Sabha elections : ఎలక్టోరల్ బాండ్స్‌ని నిర్మలా సీతారామన్ మద్దతివ్వడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ స్కీమ్‌కు సానుకూలంగా మాట్లాడారు. ఎలక్టోరల్ ఫైనాన్సింగ్‌ని క్లీన్‌గా ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుందని గతంలో వ్యాఖ్యానించారు.
ఏది ఏమైన.. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఎలక్టోరల్ బాండ్స్ వ్యవహారం సర్వత్రా చర్చకు దారితీసింది. విపక్షాలు.. బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. చందాలు తీసుకుని దందాలు చేస్తున్నారంటూ మండిపడ్డాయి.
సంబంధిత కథనం