పీఎం కిసాన్ నిధితో పాటు అదనంగా రూ. 5వేలు- ఆ రాష్ట్ర రైతులకు బీజేపీ హామీ!-jharkhand farmers to get additional 5000 to pm kisan nidhi if elected to power says bjp ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  పీఎం కిసాన్ నిధితో పాటు అదనంగా రూ. 5వేలు- ఆ రాష్ట్ర రైతులకు బీజేపీ హామీ!

పీఎం కిసాన్ నిధితో పాటు అదనంగా రూ. 5వేలు- ఆ రాష్ట్ర రైతులకు బీజేపీ హామీ!

Sharath Chitturi HT Telugu
Sep 28, 2024 07:13 AM IST

Jharkhand BJP news : ఝార్ఖండ్​ రైతులకు బీజేపీ భారీ హామీ ఇచ్చింది! రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే పీఎం కిసాన్​ నిధితో వచ్చే రూ. 6వేలతో పాటు అదనంగా రూ. 5వేలు ఇస్తామని వెల్లడించింది.

రైతులకు అదనంగా రూ. 5వేలు!
రైతులకు అదనంగా రూ. 5వేలు!

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా రూ.6000 ఇస్తోంది. ఇప్పుడు ఝార్ఖండ్ రైతులకు బీజేపీ కీలక హామీనిచ్చింది. ఝార్ఖండ్​లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వస్తే రైతులకు (ఐదెకరాల వరకు) ఎకరాకు ఏటా రూ.5,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్వయంగా ప్రకటించారు. ఈ మొత్తం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రూ.6 వేలకు అదనం అని స్పష్టం చేశారు. అంటే బీజేపీ అధికారంలోకి వస్తే ఝార్ఖండ్ రైతులకు ఏడాదికి రూ.11,000 లభిస్తాయి!

రైతులకు భారీ హామీ..!

ఝార్ఖండ్​లో గత బీజేపీ ప్రభుత్వం రైతులకు ఐదెకరాల వరకు ఎకరాకు ఏటా రూ.5,000 ఇచ్చేదని, కానీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం దానిని నిలిపివేసిందని కేంద్ర మంత్రి అన్నారు. రాష్ట్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని పునరుద్ధరిస్తామని, కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలకు అదనంగా రైతులకు ఎకరాకు రూ.5 వేలు ఇస్తామని చౌహాన్ తెలిపారు. అంతేకాదు, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల నుంచి క్వింటాలుకు రూ.3,100 చొప్పున ధాన్యం కొనుగోలు చేస్తామని కూడా కేంద్ర మంత్రి తెలిపారు.

ఝార్ఖండ్​లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో విజయం సాధించాలని బీజేపీ పక్కా ప్రణాళిక రచిస్తోంది. ఇందులో భాగంగానే రైతులను ఆకట్టుకునే విధంగా హామీలు ఇస్తోంది. మరి ఝార్ఖండ్​లో బీజేపీ మేనిఫెస్టో ఏ విధంగా ఉండబోతోందో చూడాలి.

పీఎం కిసాన్​ నిధి నగదు ఎప్పుడు పడుతుంది?

మరోవైపు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత కోసం ఎదురుచూస్తున్న దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల బ్యాంకు ఖాతాలకు త్వరలోనే నగదు బదిలీ కానుంది. అక్టోబర్ 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ.. లబ్ధిదారులైన రైతులకు నగదు బదిలీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 17 విడతల్లో 11 కోట్లకు పైగా రైతులకు రూ.3.24 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేసింది.

పీఎం కిసాన్​ సమ్మాన్​ అనేది కేంద్ర పథకం. భూమిని కలిగి ఉన్న రైతుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి ఫిబ్రవరి 2019లో బీజేపీ ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద ఏడాదికి మూడు విడతల్లో మొత్తం మీద రూ.6,000 ఇస్తారు.

సంబంధిత కథనం