YS Jagan : ‘ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది’ - లడ్డూ వివాదంపై బీజేపీకి వైఎస్ జగన్ సూటి ప్రశ్నలు
ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. దేవుడు దర్శనానికి వెళ్తామని అనుకుంటే అడ్డుకునే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. దేశంలో ఎక్కడా చూడని పరిస్థితులు ఏపీలో చూస్తున్నామని చెప్పారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన జగన్.. బీజేపీకి కూడా సూటి ప్రశ్నలు సంధించారు.
తనను తిరుమలకు వెళ్లకుండా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఇవాళ తాడేపల్లిలో మీడిాయాతో మాట్లాడిన ఆయన…ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవుడి దర్శనానికి వెళ్తే అనుమతి లేదని అంటున్నారని చెప్పారు. ఆ కార్యక్రమంలో పాల్గొంటే అరెస్ట్ చేస్తామని వైసీపీ నేతలకు నోటీసులు ఇస్తున్నారని తెలిపారు.
లడ్డూ విషయంలో లేనిపోని విషయాలతో అడ్డగోలుగా చంద్రబాబు ఆలయ పవిత్రతను దెబ్బతీశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు డిక్లరేషన్ పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని అన్నారు. తిరుమల విశిష్టతను, ప్రసాదం పవిత్రతను రాజకీయ దురుద్దేశంతో దెబ్బతీస్తున్నారన్న జగన్… జరగని విషయాన్ని జరిగినట్టుగా కల్తీ నెయ్యి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఓ ముఖ్యమంత్రే సాక్షాత్తూ తిరుమలను దగ్గరుండి అపవిత్రం చేస్తున్నారని అన్నారు.
ఎందుకు మందలించటం లేదు..? బీజేపీకి ప్రశ్నలు
వంద రోజుల పాలనను డైవర్ట్ చేయడానికే లడ్డూ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని జగన్ విమర్శించారు. ఈ సందర్భంగా కూటమిలో ఉన్న బీజేపీకి కూడా జగన్ పలు ప్రశ్నలను సంధించారు.
“శ్రీవారి విశిష్టతను దెబ్బతీసెలా మీ కూటమిలో ఉన్న చంద్రబాబు విష ప్రచారం చేశారు. లడ్డూలో జంతు కొవ్వు ఉందని విష ప్రచారానికి తెరలేపారు. తిరుమల విశిష్టతను దెబ్బతీస్తున్న చంద్రబాబును బీజేపీ ఎందుకు మందలించలేకపోతుంది..? ఎందుకు వెనకేసుకువస్తున్నారు…? హిందూయిజానికి టార్చ్ బెరర్స్ అని చెప్పుకునే బీజేపీ వాళ్లు… చంద్రబాబు తప్పుడు ప్రచారంపై ఎందుకు మాట్లాడటం లేదు..? చంద్రబాబు లాంటి వాళ్లు ఏం చేసినా పర్వాలేదా..?హిందూయిజం అంటే మానవత్వం చూపేది. నా మతం మానవత్వం అని చెబుతున్నాను” అంటూ జగన్ కామెంట్స్ చేశారు.
జులై 23న రిజెక్ట్ అయిన ట్యాంకర్లలోని నెయ్యి వాడలేదని ఈవో క్లియర్‌కట్‌గా చెప్పారని జగన్ గుర్తు చేశారు. సెప్టెంబర్ 18న చంద్రబాబు నెయ్యిలో యూనిమల్ ఫ్యాట్‌ను కలపారని ఆరోపించారని చెప్పారు. “సెప్టెంబర్ 19న టీడీపీ ఆఫీస్ నుంచి NDDB రిపోర్ట్‌ను విడుదల చేశారు. సెప్టెంబర్ 20న ఈవో మీడియాతో మాట్లాడుతూ రిజెక్ట్ అయిన ట్యాంకర్లలోని నెయ్యిని వాడలేదని ధృవీకరించారు. ఈవో క్లియర్‌గా రిపోర్ట్ ఇచ్చాక కూడా చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి ఆ ట్యాంకర్ల నెయ్యి వాడేశారని ఆరోపించారు. స్వామివారి ప్రసాదం విశిష్టతను, తిరుమల ప్రతిష్టను అబద్ధాలతో తగ్గిస్తున్నారు. ఇదంతా అపవిత్రత కాదా….?” అని జగన్ ప్రశ్నించారు.
మరోవైపు జగన్ తిరుమల పర్యటన రద్దయ్యింది. తిరుమల లడ్డూ వివాదంలో తిరుపతి జిల్లాలో పలు హిందూ సంఘాలతో పాటు ఎన్డీఏ కూటమిలోని రాజకీయపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో తిరుమలను అపవిపత్రం చేశారని ఆరోపిస్తున్నాయి. మరోవైపు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు.. తిరుమలను వాడుకుంటున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తిరుమల ప్రతిష్టను అపవిత్రం చేసేలా చంద్రబాబు వ్యవహారించారని జగన్ కూడా ఆరోపించారు. ఇందులో భాగంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పాప ప్రక్షాళన పూజలు చేయాలని పిలుపునిచ్చారు.
పూజల కార్యక్రమంలో భాగంగా జగన్ తిరుమల పర్యటన ఖరారైంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ తిరుమలకు చేరుకోవాలి. రేపు శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంది. కానీ జిల్లాలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో…. పలువురు వైసీపీ నేతలకు ముందస్తు నోటీసులు జారీ అయ్యాయి. మరికొందరిని హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు జగన్ ను అడ్డుకుంటామని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. వీటన్నింటి నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే జగన్ మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.