GST on health insurance: హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై జీఎస్టీ; క్లారిటీ ఇచ్చిన నిర్మల సీతారామన్
ఆరోగ్య బీమాపై జీఎస్టీకి విధించడానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బుధవారం స్పష్టమైన వివరణ ఇచ్చారు. జీఎస్టీ అమల్లోకి రాకముందు నుంచే హెల్త్ ఇన్సూరెన్స్ పై పన్ను విధిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఆరోగ్య బీమాపై జీఎస్టీని తొలగించే సవరణను పార్లమెంటులో ప్రవేశపెట్టలేమని స్పష్టం చేశారు.
GST on health insurance: లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం స్పందించారు. జీఎస్టీ అమల్లోకి రాకముందు నుంచే హెల్త్ ఇన్సూరెన్స్ పై పన్ను విధిస్తున్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఆరోగ్య బీమాపై జీఎస్టీని తొలగించే సవరణను పార్లమెంటులో ప్రవేశపెట్టలేదన్నారు.
గతంలో కూడా ఆ పన్ను ఉంది
‘‘నేను రెండు ముఖ్యమైన అంశాలను లేవనెత్తాలనుకుంటున్నాను. జీఎస్టీ (GST) ప్రవేశపెట్టడానికి ముందే లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై పన్ను ఉంది. జీఎస్టీ అమల్లోకి రాకముందు మెడికల్ ఇన్సూరెన్స్ పై పన్ను ఉండేది. ఇది కొత్త విషయం కాదు. ఇది ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఇక్కడ నిరసన తెలుపుతున్న వారు... తమ రాష్ట్రాల్లో ఈ పన్ను తొలగింపు గురించి చర్చించారా?’’ అని సీతారామన్ ప్రశ్నించారు.
ఆరోగ్య బీమాపై జీఎస్టీ రూ.24,529 కోట్లు
లైఫ్, హెల్త్ బీమా ప్రీమియంల పేరుతో కేంద్రం రూ.24,529 కోట్లు వసూలు చేసిందని వచ్చిన ఓ వార్తాకథనం ఆధారంగా ఇప్పుడు నిరసనలు చేస్తున్నారని, ఆ వార్తాకథనం పూర్తిగా తప్పు అని ఆమె స్పష్టం చేశారు. ‘‘ఇది తప్పు. చాలా తప్పుదోవ పట్టించేది. హెల్త్ ఇన్సూరెన్స్ పై వసూలు చేసే 18 శాతం జీఎస్టీ రేటులో 9 శాతం సీజీఎస్టీ, 9 శాతం ఎస్జీఎస్టీ ఉంటుంది. గత మూడేళ్లలో ఆరోగ్య బీమా ద్వారా వచ్చిన మొత్తం రూ.24,529 కోట్లలో సగం అంటే రూ.12,264 కోట్లు నేరుగా ఎస్జీఎస్టీ రూపంలో రాష్ట్రాలకు వెళ్లాయి. అవి కేంద్రానికి రావు. అంతేకాదు, ఆర్థిక సంఘం ఫార్ములా ప్రకారం పన్ను వికేంద్రీకరణలో భాగంగా ఆరోగ్య బీమాపై జీఎస్టీ వసూళ్లలో కేంద్రం వాటాలో తిరిగి 41 శాతాన్ని రాష్ట్రాలకు తిరిగి కేటాయిస్తున్నాము’’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల వివరించారు.
విపక్షాల నిరసన
పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో నిర్మలా సీతారామన్ విలేకరులతో మాట్లాడారు. జీఎస్టీ సంబంధిత సమస్యలను పరిష్కరించే అధికారం రాజ్యాంగ సంస్థ అయిన జీఎస్టీ కౌన్సిల్ కు ఉందని నిర్మల సీతారామన్ అన్నారు. ప్రతిపక్షాలు కోరినట్లు ప్రతిపాదిత జీఎస్టీ సవరణను పార్లమెంటు (PARLIAMENT) లో ప్రవేశపెట్టలేమని ఆమె అన్నారు. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై 18 శాతం జీఎస్టీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ భవనం గేటు వద్ద ఆందోళన చేశారు. ఈ ప్రీమియంలపై జీఎస్టీని తొలగించాలని కేంద్ర ఉపరితల రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాయడం గమనార్హం.