Bonda Uma On Kesineni Nani : కేశినేని నాని బ్లాక్ మెయిలర్, బిల్డప్ బాబాయ్, బ్యాంక్ స్కామర్- బోండా ఉమా సంచలన ఆరోపణలు
13 February 2024, 19:40 IST
- Bonda Uma On Kesineni Nani : ఎంపీ కేశినేని నాని ఒక బిల్డప్ బాబాయ్ అంటూ టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు ఫైర్ అయ్యారు. కేశినేని నాని అతి పెద్ద బ్యాంకు స్కామర్ అని, కోట్లలో లోన్లు ఎగవేశారని ఆరోపించారు.
కేశినేని నానిపై బోండా ఉమా ఫైర్
Bonda Uma On Kesineni Nani : వైసీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని(Kesineni Nani)పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా(Bonda Uma) సంచలన ఆరోపణలు చేశారు. కేశినేని నాని ఆస్తులు, అప్పుల లెక్కలు మీడియాకు విడుదల చేశారు. 2014-19 మధ్య కాలంలో కేశినేని నాని ఆస్తులు పెంచుకుని, అప్పులు తగ్గించుకున్నారని ఆరోపించారు. కేసుల భయంతోనే కేశినేని నాని తన ట్రావెల్స్ సంస్థను మూసేశారన్నారు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం కేశినేని నానికి అలవాటు అని విమర్శించారు. కేశినేని నాని అతి పెద్ద బ్యాంక్ స్కామర్(Bank Scammer) అని విమర్శించారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో లోన్లు తీసుకుని ఎగవేస్తారని ఆరోపించారు. కేశినేని నాని పేరుతో ఉన్న హోటల్ సహా ఆయన ఆస్తులు ఎన్పీఏ స్టేజీలో ఉన్నాయన్నారు. కేశినేని నాని అప్పుల అప్పారావు అంటూ బోండా ఉమా విమర్శించారు.
బిల్డప్ బాబాయ్
"కేశినేని నాని బిల్డప్ బాబాయ్. ఆంధ్రా అంబానీ అని చెప్పుకుంటూ టీడీపీలో చేరారు. ఎంపీ టిక్కెట్ తీసుకున్నారు. ప్రజల కోసం పార్టీ కోసం పని చేస్తానంటే చంద్రబాబు కూడా కేశినేని నానిని నమ్మారు. టిక్కెట్ ఇప్పించడంలో సుజనా పాత్ర ఉంది. సుజనానే చంద్రబాబుకు నచ్చచెప్పి టిక్కెట్ ఇప్పించారు. 2014 ఎన్నికల్లో కేశినేని నాని పార్టీ కోసం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. కేశినేని నాని తరపున సుజనానే డబ్బు ఖర్చు పెట్టారు. చంద్రబాబు దయతో గెలిచారు. 2019లో చంద్రబాబును ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి కేశినేని నాని టిక్కెట్ తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో కేశినేని నానికి ఎంపీ టిక్కెట్(MP Ticket) రావడానికి కారణం లోకేశ్. రెండు సార్లు పోటీ చేసిన కేశినేని నాని(Kesineni Nani) పార్టీకి రెండు రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు. 2014 ఎన్నికల అఫిడవిట్లో చెప్పిన లెక్కల ప్రకారం కేశినేని నాని ఆస్తుల విలువ రూ. 37 కోట్లు.. అప్పులు రూ. 66 కోట్లు. 2019 ఎన్నికల అఫిడవిట్లో చెప్పిన లెక్కల ప్రకారం కేశినేని నాని ఆస్తుల విలువ రూ. 66 కోట్లు.. అప్పులు రూ. 51 కోట్లు. 2019 ఎన్నికల అఫిడవిట్ లెక్కల ప్రకారం 2014లోని ఆస్తులతో పోల్చుకుంటే కేశినేని నాని ఆస్తులు 100 శాతం మేర పెరిగాయి. 2014 కంటే 2019 అప్పులు తగ్గాయి"- బోండా ఉమా
కేసులకు భయపడి ట్రావెల్స్ మూసేశారు
2014-19 మధ్య కాలంలో కేశినేని నాని ఆస్తులు పెరిగాయి.. అప్పులు తగ్గాయని బోండా ఉమా అన్నారు. రూ. 2 వేల కోట్లు ఆస్తులను కేశినేని నాని ఎప్పుడు అమ్ముకున్నారని ప్రశ్నించారు. కేశినేని నాని సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టారన్నారు. మా దగ్గర ఫైనాన్స్ తీసుకుని బస్సులను అమ్మేశారని శ్రీరాం ఫైనాన్స్ సంస్థ కేశినేని నానిపై కేసులు పెట్టారన్నారు. ఓ బస్సుకు పర్మిట్ తీసుకుని కేశినేని నాని తన ట్రావెల్స్ కు చెందిన నాలుగు బస్సులను అక్రమంగా తిప్పేవారన్నారు. ఆనాటి ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ బాల సుబ్రమణ్యం ఇదే కేసును పట్టుకున్నారన్నారు. బాలసుబ్రమణ్యం విచారణ మొదలు పెట్టడంతో కేశినేని ట్రావెల్స్ వ్యాపారాన్ని మూసేశారన్నారు. తన పీకకు ఈ కేసు చుట్టుకుంటుందనే కేశినేని ట్రావెల్స్ సంస్థను మూసేశారని ఆరోపించారు. మాకు తెలియకుండానే కేశినేని నాని అనే స్కామర్ కు అండగా నిలిచామన్నారు. కేశినేని నాని చేసిన స్కాముకు మేం సారీ చెప్పాల్సి వచ్చిందన్నారు. కేశినేని నాని వల్ల పార్టీ కూడా విమర్శలు ఎదుర్కొందన్నారు.
జగన్ కు రివర్స్ అవ్వడం ఖాయం
వైసీపీ సభలకు జనాన్ని సప్లై చేసే స్థాయికి కేశినేని నాని దిగజారిపోయారని బోండా ఉమా ఎద్దేవా చేశారు. వైసీపీ(Ysrcp)లో కేశినేని నానికి ఎంపీ టిక్కెట్ లేదన్నారు. కేశినేని నాని ప్రైవేట్ హోటల్స్ లిమిటెడ్ పేరుతో అప్పులు తీసుకుని సంస్థ పేరును ఒరేటా ప్రైవేట్ లిమిటెడ్ అని మార్చి అప్పులు ఎగ్గొట్టే ప్రయత్నం చేశారన్నారు. రూ. 40 కోట్ల అప్పు ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రేంజ్ రోవర్ కారు కిస్తీలు కట్టడం లేదని, ఆ కారును దాచేశారన్నారు. అన్నం పెట్టిన ఇంటికి కేశినేని నాని సున్నం పూసే రకం అంటూ బోండా ఉమా విమర్శించారు. ఇవాళ చంద్రబాబును ఎంతలా విమర్శిస్తున్నారో.. జగన్ ను కూడా అదే స్థాయిలో విమర్శిస్తారన్నారు. ప్రస్తుతం జగన్ దొడ్డిలో మొరిగే కుక్కలా ఉన్న కేశినేని నాని.. పిచ్చి కుక్కలా మారి జగన్(Jagan) మీదకు వెళ్లడం ఖాయం అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
రూ.2 వేల కోట్లు ఆస్తులు ఎక్కడివి
"కేశినేని నానికి రూ. 2 వేల కోట్ల ఆస్తులు ఎక్కడివి? ఊళ్లో వాళ్ల ఆస్తులను కూడా తన ఖాతాలో వేసుకుని చెబుతున్నారా? చంద్రబాబును కేశినేని నాని విమర్శిస్తే తిరగనివ్వం. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. జగన్ ఇంట్లో బూట్లు తుడుస్తారో.. బాత్రూంలు కడుగుతారో మాకు అనవసరం. చంద్రబాబు(Chandrababu) గురించి మాట్లాడితే మేం ఊరుకోం. ప్రజలు పొరపాటున క్రాస్ ఓటింగ్ చేయడం వల్లే కేశినేని నాని గెలిచారు. మా దయ.. భిక్షతోనే 2019 గెలిచారు. నా మీద కేశినేని నాని నిలబడితే డిపాజిట్ కూడా రాదు."- బోండా ఉమా