No visible policing: కనిపించని నాలుగో సింహం..చలాన్లు, డ్రంకెన్ డ్రైవ్‌లతో సరిపెట్టుకుంటున్న పోలీసులు
19 June 2024, 12:01 IST
- No visible policing: అయితే బందోబస్తు డ్యూటీలు లేదంటే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు తప్పా లా అండ్ ఆర్డర్ మీద ఏపీ పోలీసులకు పట్టుండటం లేదు. కనిపించని నాలుగో సింహమే పోలీస్ అనుకుంటే.. ఆ పోలీసులు నిజంగానే కనిపించడం లేదు.
ఏపీ పోలీసులు పూర్వ వైభవాన్ని దక్కించుకుంటారా?
No visible policing: పోలీస్ విధుల్లో ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన ఏపీ పోలీసులు కొన్నేళ్లుగా రాజకీయ గుప్పెట్లో చిక్కుకుని ప్రాభవాన్ని కోల్పోతున్నారు. అయితే వివిఐపి బందబస్తు డ్యూటీలు లేదంటే డ్రంకెన్ డ్రైవ్‌లలో పట్టుబడిన వారికి జరిమానాలు విధించి జబ్బలు చరుచుకుంటున్నారు. కనిపించని నాలుగో సింహమే పోలీస్ అనుకుంటే అసలు విధుల్లో నిజంగానే కనబడటం లేదు.
ఒకప్పుడు లా అండ్ ఆర్డర్ నిర్వహణలో, అసాంఘిక శక్తుల్ని గడగడలాడించడంలో ఏపీ పోలీసులు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఉమ్మడి రాష్ట్రంలో మావోయిస్టు ప్రాబల్యాన్ని గణనీయంగా తగ్గించడంలో, వామపక్ష ఉగ్రవాదాన్ని కట్టడి చేయడంలో కీలకమైన గ్రే హౌండ్స్ వ్యవస్థల రూపకల్పనలో ఏపీ పోలీసుల కృషికి దేశ వ్యాప్తంగా గుర్తింపు లభించింది.
ఆర్ధిక నేరాల కట్టడి నుంచి వ్యవస్థీకృత నేర ముఠాలను నియంత్రించడం వరకు ఏపీ పోలీసులకు మంచి గుర్తింపు ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత క్రమంగా ఏపీ పోలీసుల ప్రతిష్ట క్రమంగా మసకబారుతూ వచ్చింది. గత ఐదేళ్లలో అది మరింత పలుచనైంది.
ఐపీఎస్‌లు మొదలుకుని ఎస్సైల వరకు ప్రాధాన్యత ఉన్న పోస్టింగుల కోసం ప్రాధాన్యమివ్వడం తప్ప పోలీస్ విధుల మీద పెద్దగా శ్రద్ద వహించడం లేదు. సీనియారిటీ, సమర్థత కంటే కులం ప్రధాన అంశంగా మారిపోయింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ కులానికి ప్రాధాన్యమిచ్చే అవాంఛనీయ ధోరణి పెరిగిపోయింది. గతంలో హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ఈ తరహా జాఢ్యం ఉండేదని ఏపీలో కొన్నేళ్లుగా అది ముదిరిపోయిందని పోలీస్ అధికారులే చెబుతున్నారు.
నిజాయితీ, విధి నిర్వహణలో ఖచ్చితత్వం, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపే వారిని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. దీంతో లా అండ్ ఆర్డర్ అంటే ట్రాఫిక్ నియంత్రణ, విఐపి భద్రత, చలాన్లు విధించడం మాత్రమే అనుకునే స్థితికి పోలీసులు చేరిపోయారు.
రాష్ట్రంలో అక్కడా ఇక్కడ అనే తేడా లేకుండా ఏ ప్రాంతంలోనైనా విచ్చలవిడితనం పెరిగిపోయింది. వ్యవస్థీకృత నేర ముఠాలు, ఆర్ధిక నేరగాళ్లు, గంజాయి, మత్తు పదార్ధాల రవాణా ముఠాలు పెరిగిపోయాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో అయితే అల్లరి మూకలు పట్టపగలు యథేచ్ఛగా తిరుగుతున్నా వాటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు జరగడం లేదు,
గ్యాంగ్ వార్‌లు, ఆధిపత్యం కోసం ఘర్షణలు, దాడులు, నంబర్ ప్లేట్లు లేని వాహనాలపై స్వైర విహారం చేయడం, గంజాయి మత్తులో రోడ్లపై రేసింగులు చేయడం, ట్రాఫిక్‌లో కూడా ర్యాష్ డ్రైవింగ్ చేయడం, అడ్డొచ్చిన వారిని, అడ్డుకున్న వారిపై దాడులు చేయడం పెరిగిపోయాయి.
విఐపి బందోబస్తు డ్యూటీలకే సిబ్బంది చాలడం లేదంటూ లా అండ్ ఆర్డర్ నియంత్రణను పోలీసులు పూర్తిగా గాలికొదిలేశారు. మురికివాడలు, శివారు ప్రాంతాలు, రైల్వే యార్డుల్లో గంజాయి ముఠాలు యథేచ్ఛగా సంచరిస్తున్న వాటికి అడ్డుకట్ట పడటం లేదు. ఆదివారం రాత్రి విజయవాడలో దుర్గగుడిలో అమ్మవారిని దర్శించుకోడానికి వరంగల్ నుంచి వచ్చిన పోలీస్ కానిస్టేబుల్‌ను గంజాయి ముఠా దోచుకుంది. బస్టాండ్ నుంచి దుర్గగుడి వెళ్లేందుకు నిలబడిన పోలీస్ కానిస్టేబుల్‌ను లిఫ్ట్ ఇస్తామంటూ కృష్ణానదిలోకి తీసుకెళ్లి చితకబాది దోచుకున్నారు.
ఇక సాధారణ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల్ని కూడా తీసుకోడానికి స్టేషన్లలో నిరాకరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కేసులో భూముల్ని మాజీ మంత్రి కబ్జా చేయడంపై ఫిర్యాదు చేసినా విజయవాడలో కేసు నమోదు కాలేదు.
కొద్ది రోజుల క్రితం విజయవాడ బస్టాండ్‌లో తిష్ట వేసి గంజాయి ముఠాలను బయటకు పంపేందుకు ప్రయత్నించిన పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై నేరుగా దాడులకు దిగారు. గతంలో పోలీస్ కమిషనరేట్‌లు ఉన్న నగరాల్లో నేరాల నియంత్రణ కోసం ప్రత్యేకంగా యాంటీ గుండా స్క్వాాడ్‌లు పనిచేసేవి. పటిష్టమైన నిఘా వ్యవస్థతో ఎక్కడికక్కడ కట్టడి చేసేవారు. ఆ తర్వాత వాటిని సీసీఎస్ స్టేషన్లుగా మార్చారు.
గత కొన్నేళ్లుగా నేరాల నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ బ్రాంచ్, సీసీఎస్ వ్యవస్థలు నేరగాళ్లతో దోస్తీ కుదుర్చుకున్నాయి. ప్రాంతాల వారీగా మామూళ్లకు అలవాటు పడి అసలు పని వదిలేశాయి. సీజన్ల వారీగా బెట్టింగులు, పేకాట క్లబ్బులు, మసాజ్ సెంటర్లతో ఒప్పందాలు చేసుకుని డబ్బులు వసూలు చేసుకోడానికి అయా విభాగాలు అలవాటు పడ్డాయి. ఇక కొందరు పోలీస్ అధికారులైతే తమను తాము సోషల్ మీడియాలో హారోలుగా ప్రచారం చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో హీరోలుగా ఉన్నా విధి నిర్వహణలో మాత్రం జీరోలుగానే మిగిలిపోతున్నారు. సొంత యూ ట్యూబ్ ఛానళ్లను ఏర్పాటు చేసుకుని జనాన్ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఈ తరహా సెల్ఫ్ డబ్బాలకు కూడా అడ్డుకట్ట వేయాల్సి ఉంది.
మరోవైపు సినిమాల్లో చూపించే పోకిరీల తరహాలో అల్లరి మూకలు ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసిన దర్శనమిస్తున్నాయి. గంజాయి, మత్తు పదార్ధాల మత్తుతో గుంపులుగా తిరుగుతూ దాడులకు పాల్పడే ఆకతాయిలు ఎక్కువైపోయారు. రాజకీయ నాయకులకు అనుచరులుగా కొనసాగుతూ అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో లా అండ్ ఆర్డర్ వ్యవస్థ మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల్లో ఉండటంతో పోలీస్ వ్యవస్థను గాడిన పెట్టాల్సిన బాధ్యత కూడా ఆయనపై ఉంది.