తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Bureaucrats: ఏపీలో అంతే.. ఫేస్‌బుక్‌లో హీరోలు,విధుల్లో జీరోలు,పేలవమైన పనితీరు

AP Bureaucrats: ఏపీలో అంతే.. ఫేస్‌బుక్‌లో హీరోలు,విధుల్లో జీరోలు,పేలవమైన పనితీరు

Sarath chandra.B HT Telugu

20 May 2024, 12:04 IST

google News
    • AP Bureaucrats: ఏపీ క్యాడర్‌ అధికారుల పనితీరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల తర్వాత చెలరేగిన హింసా కాండతో ఏపీ పోలీస్ అధికారుల పేరు ప్రఖ్యాతలు దేశమంతటా పాకాయి. 
ఏపీ క్యాడర్‌ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు
ఏపీ క్యాడర్‌ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు

ఏపీ క్యాడర్‌ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు

AP Bureaucrats: ఏపీ క్యాడర్‌ అధికారుల తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వర్తించాల్సిన ఉద్యోగులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సాగిలపడటం కొన్నేళ్లుగా రివాజుగా మారింది. రాష్ట్ర విభజన తర్వాత ఈ ధోరణి మరింత పెరిగిపోయింది. ఒకప్పుడు ఏపీ క్యాడర్‌ అంటే ఓ గుర్తింపు, గౌరవం ఉండేవి. వ్యవస్థీకృత నేరాలైనా, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలను నియంత్రించడంలోనైనా దేశంలోనే ఎన్నో సంస్కరణలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మార్గదర్శకంగా నిలిచింది.

ఇప్పుడు ఏపీ క్యాడర్‌ అంటే అమ్మో అనుకునే పరిస్థితికి వచ్చేసింది. కేవలం పదేళ్లలో ఏపీ క్యాడర్‌ పరువు ప్రతిష్టలు పాతాళానికి చేరిపోయాయి. కులం, ప్రాంతం, పార్టీ, సిఫార్సులే ఇక్కడ కీలకంగా పనిచేస్తాయనేది దేశం మొత్తం పాకిపోయింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది అనధికారిక సాంప్రదాయంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఈ ధోరణి ఉన్నా ముఖ్య స్థానాల్లో ఉన్న నాయకులు కొంత జంకేవారు. తమ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామనే ముద్ర పడకుండా కొంత విచక్షణ పాటించేవారు. అయితే అప్పట్లో కూడా కులమే ఏపీలో అధికారుల ప్రాధాన్యతకు ప్రధాన పాత్ర పోషించేది.

రాష్ట్ర విభజన తర్వాత….

రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి ఏపీలో అధికారులు పూర్తిగా పాలక పార్టీలకు తలొగ్గి పనిచేయడం మొదలైంది. తాము కోరుకున్న పోస్టింగులు దక్కాలంటే రాజకీయ నాయకులకు పూర్తిగా లొంగిపోయి పని చేయాలనే వేగంగా అలవర్చుకున్నారు. అప్పుడే సర్వీసులో చేరిన అధికారులు మొదలు, 20ఏళ్లకు పైబడిన సర్వీసు ఉన్న అధికారుల వరకు ఇదే ధోరణికి వచ్చేశారు.

ఈ క్రమంలో సీనియర్లను కాదని కీలకమైన పోస్టింగులను దక్కించుకోవడం ఎలా అనే నేర్పరితనాన్ని చాలామంది ప్రదర్శించారు. ప్రభుత్వాలు మారిన వెంటనే నేతలు పార్టీలు మారినట్టే అధికారులు కూడా కొత్త వారు అధికారంలోకి రాకముందే వారి ప్రాపకం పొందే ప్రయత్నాలు చేసి సఫలీకృతం అయ్యారు.

2019 ఎన్నికల ఫలితాల్లో టీడీపీ పరాజయం పాలైన వెంటనే చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారులు, అధికార పార్టీని ప్రసన్నం చేసుకోడానికి ప్రాధాన్యత ఇచ్చారు. తాము ముఖ్యమంత్రి స్థానానికి విధేయులం తప్ప ముఖ్యమంత్రులకు కాదని కలర్ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంలో అన్నీ తామై వ్యవహరించిన నలుగురైదుగురు అధికారులు ఇలా ప్రభుత్వ ఆగ్రహానికి గురి కాకుండా తెలివిగా తప్పించుకన్నారు. అప్పట్లో సిఎంఓలో కీలకంగా వ్యవహరించిన అధికారులు ఆ తర్వాత తాము పూర్తిగా జగన్ మనుషులమని నమ్మకాన్ని దక్కించుకున్నారు.

పోస్టింగ్ దక్కాలంటే అలా చేయాల్సిందే….

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగం చేయాలంటే అధికార పార్టీలకు కొమ్ము కాయకపోతే కీలక పోస్టింగులు దక్కవని అధికారులు కూడా అంగీకరిస్తారు. ఇలా పోస్టింగులు దక్కించుకున్న అధికారులు అసలు విధులు గాలికొదిలేసి సోషల్ మీడియాలో పోస్టులకు పరిమితం అవుతారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఏపీ క్యాడర్‌కు చెందిన కొందరు ఐపీఎస్‌ అధికారుల ఖాతాలను చూస్తే సినిమా హీరోల మాదిరి ఎలివేషన్లు ఉంటాయి.

సోషల్ మీడియాలో ఉన్నంత యాక్టివ్‌గా విధి నిర్వహణలో ఉండరని తెలిసినా వారికి మాత్రం ఎప్పుడు ప్రాధాన్య పోస్టింగులు దక్కుతుండటం వెనుక రహస్యం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. వ్యవస్థీకృత నేరాలు, ఆర్ధిక నేరాలపై ఉండే శ్రద్ధ శాంతి భద్రతల నియంత్రణ మీద ఉండదనే ఆరోపణలు ఉన్నాయి.

విధి నిర్వహణలో నిక్కచ్చిగా ఉండే ఆలిండియా సర్వీస్ అధికారులు అతి తక్కువ కనిపిస్తారు. సర్వీసులో చేరిన మొదటి రోజు నుంచి శిక్షణలో చదువుకున్న విషయాలను గాలికొదిలేసి ఏ పోస్టింగ్ దక్కాలంటే ఎవరి పంచన చేరాలనే దానికి ప్రాధాన్యత ఇచ్చే తరం అధికారులే అధికంగా కనిపిస్తారు.

ప్రజలకు సేవ చేయడానికి సర్వీస్‌లోకి వచ్చామని మరిచిపోయి సంపాదన, హోదా ధ్యేయంగా బతికేస్తారు. కీలక పోస్టింగుల కోసం ఏ పని చెప్పినా చేయడానికి వెనకాడని వారికే కలెక్టర్లు మొదలుకుని, ఎస్పీల వరకు పోస్టింగులు ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నారు.

ఇలా పోస్టింగ్‌ దక్కించుకున్న వారు విధుల నిర్వహణపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. ఇక ఈ పోస్టింగులు, ప్రాధాన్యతల వెనుక ఏ పార్టీ అధికారంలో ఉన్నా కులం అనేది ప్రధానంగా పనిచేస్తుంటుంది. కలెక్టర్లు, ఎస్పీలు మొదలుకుని డీజీపీ, సిఎస్‌ వంటి నియామకాల్లో సీనియరిటీలతో సంబంధం లేకుండా తమ కులానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తుంటాయి. ఇందులో విమర్శలు, ఆరోపణలు వచ్చినా ప్రభుత్వాలు పెద్దగా ఖాతరు చేయవు.

బదిలీల్లో వివక్ష ఎందుకు….

ఎన్నికల్లో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలకు బాధ్యుల్ని చేస్తూ పలువురిపై వేటు పడింది. ఈ క్రమంలో ఈసీ ఆదేశాలతో సిఎస్‌ నియమించిన అధికారుల్లో ఒక్కొక్కరికి ఒక్కో రకంగా శిక్షిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

తదుపరి వ్యాసం