Rajanagaram : బైక్‌ను ఢీకొట్టిన లారీ.. స్పాట్‌లోనే ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
07 September 2024, 12:25 IST
- Rajanagaram : తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. విద్యార్థుల కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.
ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థి
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు వద్ద.. 216వ నంబరు జాతీయ రహదారిపై శుక్రవారం ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారు కాగా, మరొకరు పల్నాడు జిల్లాకు చెందిన యువకుడు ఉన్నారు.
రాజానగరం సమీపంలోని గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో శ్రీకాకుళం జిల్లా ఉదయపురం గ్రామానికి చెందిన రోనంకి ప్రవీణ్ కుమార్ (20), పల్నాడు జిల్లా సవల్యాపురం గ్రామానికి చెందిన చింతా కార్తీక్ (19) బిటెక్ ద్వితీయ సవంత్సరం చదువుతున్నారు. వీరిద్దరూ మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్తారు.
ఈ ఇద్దరు శుక్రవారం కళాశాల నుంచి ద్విచక్ర వాహనంపై దివాన్ చెరువుకు బయలుదేరారు. సరిగ్గా మరికొద్ది నిమిషాల్లో గమ్యస్థానానికి చేరుకుంటారు. ఆనేలోపు దివాన్ చెరువు వద్ద లారీ అతి వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని లారీ కొద్దిదూరం ఈడ్చుకుపోయింది. విద్యార్థుల శరీర భాగాలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడి పోయాయి.
బమ్మూరు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. చేతికి అందివచ్చిన కొడుకులు మృతి చెందడంతో.. ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు )