Tirumala Tickets: శ్రీవారి భక్తులకు అప్డేట్.. రేపు అంగప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల
10 February 2023, 17:39 IST
- Angapradakshinam Seva at Tirumala: తిరుమలలో అంగప్రదక్షిణం చేయాలనుకుంటున్న భక్తులకు అప్డేట్ ఇచ్చింది టీటీడీ. మార్చి నెలకు సంబంధించిన టికెట్లను ఫిబ్రవరి 11వ విడుదల చేయనుంది.
అంగప్రదక్షిణం టోకెన్లు
Tirumala Darshan Tickets: శ్రీవారి భక్తులకు అప్డేట్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ). నిత్యం వేలాది భక్తులు తిరుపతికి రావటమే కాదు... వేర్వురు సేవల్లో పాల్గొంటుంటారు. వీరికోసం ప్రత్యేకంగా టికెట్లను విడుదల చేస్తుంది టీటీడీ. తాజాగా అంగప్రదక్షిణ సేవకు సంబంధించిన టికెట్ల విడుదల వివరాలను వెల్లడించింది.
ఫిబ్రవరి 11వ తేదీన అంగప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల చేయనున్నారు. మార్చి నెలకు సంబంధించిన టోకెన్లు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు గత నెల 23 నుంచి 28వ తేదీ వరకు విడుదల చేయని కోటాను ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్‌లో టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
బుకింగ్ ప్రాసెస్
టికెట్లు బుక్ చేసుకునేందుకు ttdsevaonline.com లో రిజిస్టర్ చేసుకోవాలి. సైట్లో సైన్ అప్ ఆప్షన్ క్లిక్ చేయాలి. లింక్ క్లిక్ చేశాక.. అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత లాగిన్ పేజికి వెళ్తుంది. లాగిన్ తర్వాత తేదీలు అందుబాటులో ఉంటాయి. డ్యాష్ బోర్డును చూసి.. మీ తేదీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కావాల్సిన తేదీ స్లాట్ ను చెక్ చేసుకుంటే.. ఖాళీలు ఉంటే.. గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ఆ తర్వాత.. అక్కడ నొక్కితే.. టికెట్ మెుత్తానికి డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. మీకు టికెట్ బుక్ అవుతుంది. సాధారణంగా ఇతర వెబ్ సైట్లలో చేసిన విధానంగానే ఉంటుంది. ఒకవేళ మీకు ఎక్కువ లడ్డూలు కావాలంటే కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు.
మొబైల్ యాప్…
TTD Mobile Application తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం టిక్కెట్లతో పాటు వివిధ రకాల సేవా టిక్కెట్ల కొనుగోలులో భక్తులకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి టీటీడీ మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తిరుమలకు సంబంధించిన సమస్త సమాచారం ఈ యాప్‌లో ఉంటుంది. భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఉపయోగపడుతుంది. జియో సంస్థ సహకారంతో టిటిడి ఐటి విభాగం ఈ యాప్‌ను రూపొందించింది. సామాన్య భక్తులకు స్వామివారి సేవలు, దర్శనం, టికెట్లు, వసతి సులువుగా అందించేందుకు ఆన్లైన్ ద్వారా క్లౌడ్ టెక్నాలజిని వాడుతున్నారు. తద్వారా ప్రతినెలా దర్శనం, సేవలు, శ్రీవాణి టికెట్లతో పాటు తిరుమల, తిరుపతిలో వసతి కూడా ముందుగానే బుక్ చేసుకోవచ్చు.