తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Tickets : రోజుకు 1000 మాత్రమే..! శ్రీవాణి దర్శనం ఆఫ్ లైన్ టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం, తాజా నిర్ణయం ఇదే

Tirumala Tickets : రోజుకు 1000 మాత్రమే..! శ్రీవాణి దర్శనం ఆఫ్ లైన్ టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం, తాజా నిర్ణయం ఇదే

18 July 2024, 21:26 IST

google News
    • TTD SRIVANI Trust Tickets : శ్రీవాణి దర్శనం టికెట్లపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్ లైన్ లో టికెట్ల కోటాను రోజుకు 1000కి పరిమితం చేసింది. జూలై 22వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.
శ్రీవాణి టికెట్లుపై టీటీడీ కీలక నిర్ణయం
శ్రీవాణి టికెట్లుపై టీటీడీ కీలక నిర్ణయం

శ్రీవాణి టికెట్లుపై టీటీడీ కీలక నిర్ణయం

TTD SRIVANI Trust Tickets : తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 22వ తేదీ నుంచి ఆఫ్ లైన్ లో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను రోజుకు 1000కి పరిమితం చేసింది. ఈ మేరకు గురువారం వివరాలను వెల్లడించింది.

తిరుమల శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా, సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ వెల్లడించింది. జూలై 22వ తేదీ నుండి శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ రోజుకు 1,000కి పరిమితం చేస్తున్నట్లు పేర్కొంది.

ఇందులో భాగంగా ఆన్ లైన్ లో 500 (ఇదివరకు ఉన్నట్లే), ఆఫ్ లైన్ లో మరో 1,000 టికెట్లను మాత్రమే జారీ చేస్తారు. దీనిలో తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టికెట్లను మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికగా జారీ చేస్తారు.

మిగిలిన 100 టికెట్లను శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్‌లో అందుబాటులో ఉంచుతామని టీటీడీ తెలిపింది. బోర్డింగ్ పాస్‌ ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్ట్ కౌంటర్‌లో మాత్రమే ఈ ఆఫ్‌లైన్ టిక్కెట్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని కోరింది.

ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను ఇవాళ ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జూలై 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను జూలై 22వ తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

జూలై 22న వర్చువల్ సేవల కోటా విడుదల

వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జూలై 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

జూలై 23న‌ అంగప్రదక్షిణం టోకెన్లు….

అక్టోబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూలై 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది.

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా….

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల ఆన్ లైన్ కోటాను జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది.

వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా…

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా అక్టోబరు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను జూలై 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

జూలై 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

అక్టోబరు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది.

తిరుమ‌ల‌, తిరుప‌తిల‌లో గదుల కోటా విడుద‌ల‌…

తిరుమల, తిరుపతిల‌లో అక్టోబరు నెల గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.

జూలై 27న శ్రీవారి సేవ కోటా విడుదల

జూలై 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో సుప్రభాత సేవ మినహా, మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

తదుపరి వ్యాసం