ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... అక్కడికక్కడే నలుగురు మృతి
08 July 2024, 9:25 IST
- ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న కంటైనర్ లారీని బలంగా కారు ఢీకొనడం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది.
రోడ్డు ప్రమాద దృశ్యం
ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లక్ష్మీనగర్ దగ్గర ఆగి ఉన్న కంటైనర్ లారీని విజయవాడ నుంచి రాజమండ్రి వైపు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బలంగా ఢీకొంది. ఈ కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. అయితే ఈ ప్రమాదంలో ఒక బాలుడు పరిస్థితి విషమంగా ఉంది. ఆ బాలుడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు.
మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు, ఒక పురుషుడు ఉన్నారు. కారు డ్రైవర్, మరో బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. కారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి పరిధిలోని రాజవోలు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మృతులు హైదరాబాద్ వాసులుగా, డ్రైవర్ కోనసీమ జిల్లా వాడపల్లికి చెందిన దుర్గావంశీగా గుర్తించారు.
డైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమనిస్తున్నారు. సమాచారం రావడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పరిశీలించారు.
విజయనగరం జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఈ ఘటన విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. గంట్యాడ మండలానికి చెందిన డీ.హారీష్ (27), కె. మణికంఠ ద్విచక్ర వాహనంపై కొర్లాం బయలుదేరారు. గంట్యాడలోని టోల్ ప్లాజా వద్దకు వచ్చేసరికి ఎదురుగా వచ్చిన వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీ.హారీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మణికంఠ, ఎదురుగా వచ్చి ఢీకొట్టిన వాహనంలోని ఒక యువకుడు, వృద్దుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయాల పాలైన ముగ్గురిని విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు, వృద్ధుడు మరణించారు. మణికంఠ పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరు అయ్యారు.
- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు