Thefts In Floods: వరదల్లో చోరీలు, తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దోపిడీలు.. లబోదిబోమంటున్న బాధితులు
08 September 2024, 9:20 IST
- Thefts In Floods: విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి వారం రోజులైంది. గత ఆదివారం తెల్లవారుజామున బుడమేరుకు గండి పడటంతో వరద నీరు విజయవాడను ముంచెత్తింది.ఈ క్రమంలో ఎక్కడివారక్కడ ఇళ్లకు తాళాలు వేసి కట్టుబట్టలతో వరద నుంచి బయటపడ్డారు.నగరంలోని చాలా ప్రాంతాలు ముంపులో ఉండటంతో కొందరు వాటిని దోచుకోవడం మొదలెట్టారు.
కట్టుబట్టలతో వరద ముంపు నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్న మహిళలు
Thefts In Floods: బుడమేరు వరదల నేపథ్యంలో విజయవాడలో బుడమేరు ముంపు ప్రాంతాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని న్యూ రాజరాజేశ్వరి పేట, ఓల్ ఆర్ఆర్‌పేట, సింగ్‌నగర్, ప్రకాష్ నగర్, ఉడాకాలనీ, కండ్రిక, పాతపాడు, అంబాపురం, వైఎస్సార్ కాలనీ, నందమూరి నగర్, ఆంధ్రప్రభ కాలనీ పాయకాపురం, న్యూ అజిత్ సింగ్ నగర్ ప్రాంతాలు ఎనిమిది రోజులుగా వరద ముంపులోనే ఉన్నాయి. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారు.
ఓ వైపు వరద ముంపు నుంచి ప్రాణాలు కాపాడుకోడానికి కట్టుబట్టలతో ఇళ్లను వదిలి బయటకు వచ్చిన ప్రజల్ని దోపిడీల భయం పట్టుకుంది. నిన్న మొన్నటి వరకు వరద ముంపు నుంచి బయటకు తీసుకురావడానికి పడవలు, సహాయ బృందాలు అందిన కాడికి దోచుకుంటే వరద ముంపులో ఉన్న ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీలు చేసే ముఠాలు చెలరేగిపోతున్నారు. వరద ముంపు తగ్గిన ప్రాంతాల్లో ఇళ్ల తాళాలు పగులగొట్టి సామాన్లు పట్టుకుపోయిన ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి.
వరద ముంపుకు గురైన పలు ప్రాంతాల్లో యదేచ్చగా ఇళ్ల దోపిడీలు జరుగుతున్నాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్ళను చిల్లర దొంగలు దోచుకుంటున్నారు. వరద ముంచెత్తడంతో విలువైన సామాన్లు కూడా బయటకు తీసుకువెళ్లే పరిస్థితులు లేకపోవడంతో చాలామంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు.
ఇళ్లలో ఎవరు లేకపోవడంతో తాళాలు పగలగొట్టి అందిన కాడికి సామాన్లు పట్టుకు పోతున్నారు. వారం రోజులుగా విజయవాడలోని పలు ప్రాంతాలు వరద ముంపులో ఉన్నాయి. ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రాణాలు చేతిలో పెట్టుకొని ఇళ్ళ నుంచి బయటకు వచ్చి కొందరు ఇంకా రోడ్లపైనే ఉంటున్నారు.
మరి కొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లు , మరికొందరు బంధువులు ఇళ్ళకి వెళ్ళిపోయారు. ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం నగరానికి వచ్చిన వారు వరద నుంచి బయట పడి సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కొందరు తాళాలు వేసి ఉన్న ఇళ్లను పగలగొట్టి సామాన్లు పట్టుకు పోతున్నారు. చాలా ప్రాంతాల్లో జన సంచారం లేకపోవటంతో దొంగలు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు.
నగరంలోని సింగ్ నగర్, న్యూ రాజరాజేశ్వరి పేట, ఓల్డ్ రాజరాజేశ్వరి పేట, వాంబే కాలని ప్రాంతాల్లో ఈ తరహా ఘటన చోటు చేసుకుంటున్నాయి. వరద తగ్గకపోయినా ట్యూబుల సాయంతో పడవలు తయారు చేసుకొని తాళం వేసి ఉన్న ఇళ్ళను గుర్తించి దోపిడీలు చేస్తున్నారు .
అసలే వరద ముంపుతో తీవ్ర నష్టానికి గురై కట్టుబట్టలతో మిగిలిన వారికి మరింత నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహాయ చర్యలో నిమగ్నమై ఉండటంతో ఇళ్లను పర్యవేక్షించే పరిస్థితులు లేవు. గత వారం రోజులుగా విజయవాడలోని పలు ప్రాంతాలు నీటిమొంపులో ఉన్నాయి . ఇ ప్పటికీ చాలా ప్రాంతాల్లో రెండు అడుగుల లోతులో వరద నీరు ఉంది . వారం రోజులుగా నగరంలోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా లేదు.
వరుసగా రెండుసార్లు బుడమేరు ముంపు రావడంతో వేల సంఖ్యలో కుటుంబాలు నగరాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాయి. మరోవైపు ప్రధానంగా రోడ్లపై ఉంటున్న వారికి మాత్రమే ప్రభుత్వ సహాయం అందుతుంది కాలనీలో లోపలి భాగాలు ఇరుకు సందుల్లో ఉంటున్న వారికి ఎలాంటి సాయం అందటం లేదు. కనీసం తాగడానికి నీరు కూడా ఉండటం లేదని జనం వాపోతున్నారు.