తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Budameru Flood: ఇంతకీ బుడమేరుకు వచ్చిన వరద ఎంత, ఏ మండలంలో ఎంత వర్షం కురిసింది? స్పష్టతనివ్వని ప్రభుత్వం..

Budameru Flood: ఇంతకీ బుడమేరుకు వచ్చిన వరద ఎంత, ఏ మండలంలో ఎంత వర్షం కురిసింది? స్పష్టతనివ్వని ప్రభుత్వం..

07 September 2024, 13:59 IST

google News
    • Budameru Flood: విజయవాడ నగరాన్ని బుడమేరు వరద ముంచెత్తి వారం రోజులవుతోంది. ఆగస్టు 30,31 తేదీల్లో బంగాళాఖాతంలో మొదలైన వర్షంతో మొదలైన అలజడి ఉప్పెనగా మారి విజయవాడను ముంచెత్తింది.వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నా విజయవాడను ఆకస్మిక వరదలు ముంచెత్తాయని అధికారులు చెబుతున్నారు. ఇంతకు విజయవాడలో కురిసిన వర్షం ఎంత..?
బెజవాడను ముంచెత్తిన బుడమేరు గండ్లను ఆర్మీ సాయంతో శనివారం మధ్యాహ్నం పూడ్చగలిగారు.
బెజవాడను ముంచెత్తిన బుడమేరు గండ్లను ఆర్మీ సాయంతో శనివారం మధ్యాహ్నం పూడ్చగలిగారు.

బెజవాడను ముంచెత్తిన బుడమేరు గండ్లను ఆర్మీ సాయంతో శనివారం మధ్యాహ్నం పూడ్చగలిగారు.

Budameru Flood: బెజవాడ నగరం బుడమేట్లో కలిసి వారం రోజులవుతోంది. ఆగస్టు 30వ తేదీ శుక్రవారం రాత్రి మొదలైన వర్షం తెల్లార్లు కురుస్తూనే ఉంది. విజయవాడలో ఆగస్టు 30వ తేదీ శుక్రవారం సాయంత్రం నుంచి చిన్నగా వర్షం మొదలైంది.

30వ తేదీ రాత్రి పది గంటలకు అదికాస్త భారీ వర్షంగా మారింది. 30వ తేదీ రాత్రి కురిసిన వర్షానికి రాత్రి 11గంటలకు విజయవాడ చనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్‌ నుంచి పాముల కాల్వ వరకు ఉన్న మార్గం జలమయం అయ్యింది. 31వ తేదీ ఉదయానికి రోడ్లపై నీటి ప్రవాహం సాధారణ స్థితికి వచ్చిందని పాముల కాల్వ సమీపంలో వ్యాపారాలు చేసే వారు గుర్తు చేసుకున్నారు. 

బుడమేరు వరద ముంచెత్తిన వారం తర్వాత కూడా జి.కొండూరు, విజయవాడ, విజయవాడ రూరల్ మండలాల్లో ఎంత వర్షపాతం నమోదైందో అధికారిక సమాచారం లేదు.  చాలా ప్రాంతాల్లో రెయిన్ గేజ్‌లు అందుబాటులో లేకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. 

విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి గ్రామ పంచాయితీ నుంచి పాముల కాలువ మధ్యలో తరచూ వర్షపు నీరు రోడ్లను ముంచెత్తడం కాసేపటికి దిగువకు వెళ్ళిపోవడం సాధారణంగా జరిగేదే. జక్కంపూడికి ఎగువున వెలగలేరులో బుడమేరు డైవర్షన్ ఛానల్ ఉందనే విషయం విజయవాడ రూరల్ మండల ప్రజలకు తెలుసు. 20ఏళ్లుగా దానికి వరద రాకపోవడంతో పాటు నగర శివార్లలో పెద్ద ఎత్తున నివాసాలు విస్తరించాయి.

కొండపల్లి- ఇబ్రహీం పట్నం మధ్య జికొండూరు మండలం నుంచి సాగే చెన్నై-న్యూఢిల్లీ గ్రాండ్ ట్రంక్‌ రైల్వే లైన్‌కు సమీపంలోనే బుడమేరు ప్రవాహం మెలికలు తిరుగుతూ విజయవాడ వైపు సాగుతుంది. పైడూరు పాడు షాబాద్‌ - జక్కంపూడి వైపుగా ఈ ప్రవాహం సాగుతుంది. వెలగలేరు దిగువున బుడమేరు ప్రవాహం విటిపిఎస్‌ వృధా జలాలతో కలిసి కృష్ణానదిలోకి మళ్లుతుంది.బుడమేరు డైవర్షన్ ఛానల్‌ రెగ్యులేటర్ దిగువ నుంచి మరో పాయ దిగువకు విజయవాడ వైపు వెళుతుంది.

కొండపల్లి-శాంతినగర్‌- పైడూరుపాడు మీదుగా విజయవాడలోకి ఇది ప్రవేశిస్తుంది. మధ్యలో పంట పొలాలకు నీరందించడంతో పాటు అగ్రికల్చర్ డ్రెయన్లను కూడా తనలో కలుపుకుంటుంది.ఆ నీరంతా దిగువకు ప్రవహిస్తుంది. మరోవైపు విజయవాడలో గత 20ఏళ్లలో పెరిగిన పట్టణీకరణతో బుడమేరును పూర్తిగా జనం మర్చిపోయారు. సాధారణ సమయంలో విజయవాడ పాతబస్తీ నుంచి వర్షపు నీరు, మురుగు నీటిని దిగువకు తీసుకెళ్లే కాలువగానే ఉంటుంది. ఒకప్పుడు ఏడాది పొడవున మంచినీటితో ప్రవహించిన బుడమేరును పాలకుల నిర్లక్ష్యంతో ఇప్పుడు మురుగునీటి ఔట్‌ఫాల్‌గా మార్చేశారు.

ఎంత వరద వచ్చిందో ఎవరికి తెలీదు....

గత వారం రోజులుగా విజయవాడ నగరాన్ని వరద ముంపులో ఉంచిన బుడమేరులో ఆగస్టు 31 - సెప్టెంబర్ 1వ తేదీ మధ్య ఎంత వరద వచ్చిందనే అధికారిక లెక్కలు ఇప్పటికీ విడుదల కాలేదు. 30-31 తేదీల్లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో 26 సెంటిమీటర్ల వర్షం కురిసిందని అధికారులు ప్రకటించారు. ఐఎండి లెక్కల్లో విజయవాడ పరిసర ప్రాంతాల్లో 31 వ తేదీ 29సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది.

బుడమేరు డైవర్షన్ స్కీమ్ విజయవాడ నగరంలో ఉండదు. విజయవాడకు ఎగువున ఉన్న ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాలతో పాటు ఖమ్మం జిల్లా సరిహద్దుల నుంచి కురిసే కోతుల వాగు, పులివాగు నుంచి ఎంత వరద ప్రవాహం దిగువకు వచ్చిందనే లెక్క ఇప్పటికీ లేదు. ప్రతి మండలంలో రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో వర్షపాతాన్ని నమోదు చేయాల్సి ఉన్నా ఈ లెక్కలు బయటకు రాలేదు. పలు ప్రాంతాల్లో వర్షపాతాన్ని నమోదు చేసి పరికరాలు పనిచేయకపోవడం వల్ల సరైన వివరాలు అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. 

అప్పటి లెక్కలే ఇప్పుడు కూడా…

వెలగలేరుకు 2005లో 70వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. హిందుస్తాన్ టైమ్స్‌లో కథనాల్లో పేర్కొన్న 20ఏళ్ల కిందటి లెక్కలనే ఇప్పుడు కూడా అధికారులు, నాయకులు వల్లె వేస్తున్నారు. 2005 వరదకు 2024లో వచ్చిన వరదకు చాలా తేడా ఉంది. ముంపు తీవ్రత 2005కంటే మూడు రెట్లు అధికంగా ఉంది. అప్పట్లో మూడు నాలుగు రోజుల్లోనే నగరం ముంపు నుంచి బయటపడింది. నాటి వరదలకు నేటి పరిస్థితికి ఏమాత్రం పొంతన లేదు. బుడమేరు నుంచి కృష్ణా నదిలోకి వెళ్లే ప్రవాహంలో 14చోట్ల గండ్లు పడ్డాయి. వీటిలో విజయవాడ నగరం వైపు ఉన్న గట్టుకు 3 చోట్ల భారీగా గండ్లు పడ్డాయి. ఏడు రోజులు తీవ్రంగా శ్రమిస్తే తప్ప వాటిని పూడ్చలేకపోయారు.

ఇంకా ఉగ్రరూపంలోనే ప్రవాహం...

2005లో వచ్చిన బుడమేరు వరదలతో బుడమేరు వరద ప్రవాహంతో కలిపి గరిష్టంగా 37,500 క్యూసెక్కులసామర్థ్యంతో పోలవరం కుడికాల్వను డిజైన్ చేశారు. విటిపిఎస్‌ వద్ద అప్పటికే ఉన్న కూలింగ్ కెనాల్ సామర్థ్యాన్ని పెంచే అవకాశం లేకపోవడంతో ఆ పనులు 20ఏళ్లుగా ముందుకు సాగలేదు. 31వ తేదీ రాత్రి ఆకస్మాత్తుగా పెరిగిన వరద ప్రవాహంతో బుడమేరుకు గండ్లు పడ్డాయి. ఆ సమయంలో రెగ్యులేటర్ ద్వారా గేట్లను తెరవకపోతే అది కొట్టుకుపోయి ఉండేదని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బుడమేరులో 10వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.

ఈ స్థాయిలో బుడమేరుకు వరద వచ్చినా ఎంత ప్రవాహం వచ్చిందనే లెక్క మాత్రం అధికారికంగా లేదు. బుడమేరు డైవర్షన్ ఛానల్ నుంచి గరిష్టంగా 11,500 క్యూసెక్కులు మాత్రమే డిశ్చార్జి చేయగలరు. దాని సామర్థ్యాన్ని తట్టుకోలేనంత వరద ప్రవాహం తక్కువ సమయంలో రావడంతోనే కట్టలకు గండ్లుపడ్డాయి. పోలవరం కుడికాల్వ సామర్థ్యం 37,500 క్యూసెక్కులు ఉన్నా వెలగలేరు నుంచి కృష్ణా నదిలోకి వెళ్లే కాలువకు అంత సామర్థ్యం లేదు.

బుడమేరు రెగ్యులేటర్ ఉన్న ప్రాంతం శాటిలైట్ చిత్రం

నిర్లక్ష్యమే నిలువునా ముంచింది...

రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నా బుడమేరు ముంపుకు అసలు కారణం కృష్ణా జిల్లా,పశ్చిమ గోదావరి జిల్లాల రాజకీయాలే కారణంగా కనిపిస్తాయి. విజయవాడకు పొంచి ఉన్న ముప్పును నివారించడంలో అన్ని పార్టీలకు, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ప్రజాప్రతినిధులందరికి భాగం ఉంది. వరదల్లో రాజకీయాలు తప్ప సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే ప్రయత్నాలు గత 20ఏళ్లలో నిజాయితీగా చేయకపోవడమే నగరం పాలిట శాపంగా మారింది. బుడమేరు ప్రవాహం విజయవాడ శివార్లలో రైవస్‌ కాల్వను దాటుకుని ప్రవహిస్తుంది. భారీ తూముల ద్వారా బుడమేరు ప్రవాహం ఏలూరు కాల్వను దాటుతుంది. కనీసం దానిని విస్తరించకపోవడం ప్రస్తుత పరిస్థితికి కారణమైంది.

తదుపరి వ్యాసం