తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Viveka Murder Case: నేటితో ముగియనున్న ఎర్ర గంగిరెడ్డి లొంగుబాటు గడువు..

Viveka Murder Case: నేటితో ముగియనున్న ఎర్ర గంగిరెడ్డి లొంగుబాటు గడువు..

HT Telugu Desk HT Telugu

05 May 2023, 9:17 IST

google News
    • Viveka Murder Case: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేయడంతో  శుక్రవారం సాయంత్రం లోపు సిబిఐ కోర్టులో లొంగిపోవాల్సి ఉంది. 
ఎర్ర గంగిరెడ్డి
ఎర్ర గంగిరెడ్డి

ఎర్ర గంగిరెడ్డి

Viveka Murder Case: వివేకా హత్య కేసులో పులివెందుల కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేయడంతో సీబీఐ కోర్టులో ఎప్పుడు లొంగి పోవాలనే విషయంలో న్యాయవాదితో చర్చిస్తున్నట్లు ప్రధాన నిందితుడు ఎర్ర గంగిరెడ్డి తెలిపారు. న్యాయవాది సలహా మేరకు కోర్టులో లొంగిపోతానని చెప్పారు. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను గత నెల 27న తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది.

గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. ఏప్రిల్‌ 27న బెయిల్‌ రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. మే 5లోపు సీబీఐ ఎదుట లొంగిపోవాలని ఎర్ర గంగిరెడ్డిని కోర్టు ఆదేశించింది.

కోర్టులో లొంగిపోకపోతే గంగిరెడ్డిని అదుపులోకి తీసుకోవాలని సీబీఐకి హైకోర్టు సూచించింది. జూన్ 30వ తేదీ వరకు దర్యాప్తునకు గడువు ఉన్నందున అప్పటివరకు మాత్రమే ఎర్ర గంగిరెడ్డిని రిమాండ్‌కు తరలించాలని తీర్పు వెల్లడించే సమయంలో హైకోర్టు షరతు విధించింది. జూన్ 30 తర్వాత ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు విధించిన గడువు ముగియడంతో ఎర్ర గంగిరెడ్డి తన న్యాయవాదితో సంప్రదిస్తున్నారు.

నాలుగేళ్లుగా బెయిల్‌పైనే ఎర్రగంగిరెడ్డి…

వివేకా హత్య కేసులో ఏ1గా ఉన్న గంగిరెడ్డి నాలుగేళ్లుగా బెయిల్‌పైనే ఉన్నాడు. వివేకా హత్య తర్వాత గంగిరెడ్డిని సిట్ దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. 90 రోజుల్లో సిట్ ఛార్జిషీటు దాఖలు చేయకపోవడంతో పులివెందుల కోర్టు ఎర్ర గంగిరెడ్డికి డిఫాల్టర్‌ బెయిల్ మంజూరు చేసింది. సిట్ దర్యాప్తులో హత్యకు ప్రధాన కుట్రధారుడు గంగిరెడ్డి అని ఆరోపించింది. సకాలంలో ఛార్జిషీటు దాఖలు చేయకపోవడంతో అతనికి బెయిల్ మంజూరైంది.

2019 జూన్ 27న గంగిరెడ్డికి పులివెందుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి గంగిరెడ్డి సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నాడని సిబిఐ ఆరోపిస్తోంది. వివేకా హత్య కేసును తొలినాళ్లలో విచారించిన సిట్ బృందంతో పాటు తర్వాత ఏర్పాటైన రెండో సిట్ కూడా గంగిరెడ్డి పాత్రను నిర్దారించాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో సిబిఐ విచారణ ప్రారంభమైన తర్వాత గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటికీ హత్యకేసులో ఛార్జిషీటు దాఖలు చేయకపోవడంతో మంజూరైన బెయిల్‌ను రద్దు చేయడానికి ఏపీ హైకోర్టు అనుమతించలేదు.

ఈ నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డి వ్యవహారంపై సిబిఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గతంలో ఏపీ హైకోర్టులో సానుకూల స్పందన లభించకపోవడాన్ని సిబిఐ వివరించింది. కేసు విచారణ పరిధిని తెలంగాణ హైకోర్టుకు మార్చడంతో గంగిరెడ్డి వ్యవహారంపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు సూచించింది. దీంతో గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని సిబిఐ తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు. గంగిరెడ్డి బయట ఉంటూ సాక్ష్యులను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసులో ఇప్పటి వరకు ఏడుగురు అరెస్ట్ అయ్యారు. వీరిలో ఏ1, ఏ4 దస్తగిరి బయట ఉండగా, మిగిలిన ఐదుగురు జైల్లోనే ఉన్నారు.

జూన్ 30లోగా కేసు దర్యాప్తు ముగించాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో లక్షన్నర ష్యూరిటీతో జులై 1న గంగిరెడ్డికి మళ్లీ డిఫాల్ట్‌ బెయిల్ ఇవ్వొచ్చని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 2019 జూన్ 27 నుంచి బెయిల్‌పై ఉన్న గంగిరెడ్డి తాజా ఆదేశాలతో మరోసారి సిబిఐకు లొంగిపోవాల్సి ఉంది.

 

తదుపరి వ్యాసం