తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?

Political Analysis: వై నాట్‌ టీడీపీ-జనసేన కూటమి?

HT Telugu Desk HT Telugu

29 September 2023, 16:30 IST

google News
    • ‘ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ‘వై నాట్‌ 175’ నినాదం ఎత్తుకున్నాకా ప్రతి విషయాన్ని ‘వై నాట్‌’ కోణంలోనే విశ్లేషించాల్సి వస్తోంది..’ - పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ ప్రతినిధి నాగరాజు క్షేత్రస్థాయి రాజకీయ విశ్లేషణ. 
చంద్రబాబు అరెస్టు అయిన తరువాత మీడియా ముందుకు పవన్, బాలకృష్ణ, లోకేష్
చంద్రబాబు అరెస్టు అయిన తరువాత మీడియా ముందుకు పవన్, బాలకృష్ణ, లోకేష్ (PTI)

చంద్రబాబు అరెస్టు అయిన తరువాత మీడియా ముందుకు పవన్, బాలకృష్ణ, లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి ‘వై నాట్‌ 175’ నినాదం ఎత్తుకున్నాకా ప్రతి విషయాన్ని ‘వై నాట్‌’ కోణంలోనే విశ్లేషించాల్సి వస్తోంది. కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచాకా ‘వై నాట్‌ కుప్పం?’ అని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మితిమీరిన అతివిశ్వాసంతో పిలుపునిస్తే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో ‘వై నాట్‌ పులివెందుల?’ అని టీడీపీ నేతలు ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. కుప్పంలో వైఎస్‌ఆర్‌సీపీ గెలుస్తుందనుకోవడం ఎంత అవివేకమో... పులివెందులలో టీడీపీ గెలుస్తుందనుకోవడం కూడా అంతే అవివేకం!!

‘‘సింహం సింగిల్‌గానే వస్తుంది. ఎన్ని పార్టీలు కలిసినా, ఎంతమంది కలిసి వచ్చినా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్‌ఆర్‌సీపీ సమర్థవంతంగా… ఎదుర్కొంటుంది..’’ అని ఎప్పుడూ గంభీరంగా పలికే ఆ పార్టీ నేతలు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళతామని రాజమహేంద్రవరంలో ప్రకటించడంతో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అగ్రనేతలు మొదలుకొని మంత్రులు వరకు ప్రతిపక్ష నేతల కలయికను చూసి కలవరపడుతున్నట్లు చెప్పడానికి వారి వ్యాఖ్యానాలే నిదర్శనం. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి నిత్యం జపించే ‘వై నాట్‌ 175’ నినాదం మేకపోతు గాంభీర్యమని ఆ విమర్శలు చెప్పకనే చెబుతున్నాయి.

జనసేన-టీడీపీ పొత్తు కుదిరితే వైఎస్‌ఆర్‌సీపీకి ఒక్క సీటు కూడా రాదని పందేలకు పేరు గాంచిన ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పందేలు కాస్తున్నారు. ఉత్తరాంధ్రాతో పాటు ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వరకూ ఈ పొత్తు ప్రభావం బలంగా ఉండే అవకాశాలున్నాయి. ఇందువలనే పొత్తు కుదరకూడదని కోరుకున్న వైఎస్‌ఆర్‌సీపీ పొత్తు కుదిరాకా జనసేన-టీడీపీ కూటమిని చూసి బెంబేలెత్తుతోంది.

దేశంలోని ప్రముఖ సంస్థలు ఏపీలో నిర్వహించిన సర్వేలను పరిశీలిస్తే గతంలో కంటే టీడీపీ-జనసేన ఓట్ల శాతం పెరిగిందనే అంశాన్ని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఇదే సమయంలో 2019 ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీకి మద్దతిచ్చిన వివిధ సామాజికవర్గాలు, సమూహాలు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఆ పార్టీకి దూరమయ్యాయన్న విషయాన్ని కూడా ఆ సర్వే సంస్థల ఫలితాలను బట్టి తేటతెల్లమవుతుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఈ విధంగా ఉంటే వైఎస్‌ఆర్‌సీపీ 175 సీట్లు గెలుచుకోవడం ఎలా సాధ్యం? ఈ సాధ్యాసాధ్యాలు పక్కనపెడితే, ప్రతిపక్షాలను సున్నా చేయడమే లక్ష్యంగా ఏ అధికార పార్టీ పనిచేసినా అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం! ప్రతిపక్షం లేకపోతే, ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటాయి.

సంక్షేమమే ఓట్లు రాబడుతుందా?

రాష్ట్రంలో ప్రతీ ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం ఖాయమని ఆ పార్టీ డాంభీకమైన ప్రకటనలు చేస్తున్నా, జనసేన-టీడీపీ కూటమిపై జగన్‌ బృందం చేస్తున్న విమర్శలను చూస్తే వారు ఎంత నిరాశ-నిస్పృహల్లో ఉన్నారో స్పష్టమౌతోంది. 175 స్థానాలు గెలుస్తామని చెబుతున్న వైఎస్‌ఆర్‌సీపీకి ఎంతో ఆత్మవిశ్వాసం ఉండాలి, అందుకు బదులు జనసేన-టీడీపీ కలయికపై వారు చేస్తున్న మాటల దాడులు చూస్తుంటే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఓట్లు రాబట్టలేవని వారికీ అర్థమైనట్టు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులకు, కార్యకర్తలకు గెలుపుపై విశ్వాసం సన్నగిల్లుతున్నట్టు అర్థమవుతోంది. జనసేన-టీడీపీ పొత్తుపై వారు చేస్తున్న విమర్శలను చూస్తే ఈ పొత్తుపై వైఎస్‌ఆర్‌సీపీ భయపడుతున్నట్లు ఉంది.

రాజకీయాల్లో పొత్తులన్నది ఓ ఎత్తుగడ మాత్రమే. రాజకీయాల్లో వివిధ పార్టీలు పొత్తులు పెట్టుకోవడమన్నది సర్వసాధారణం. అంతిమంగా ఎవరు గెలుస్తారు..? ఎవరు ఓడిపోయారన్నదే ఎన్నికల్లో ప్రధానం. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదు అనే లక్ష్యంతో జనసేన-టీడీపీ పొత్తుకు సిద్ధమైతే, అది నేరం అన్నట్లు గతంలో ఎవరూ పొత్తు పెట్టుకోనట్టు వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో వివిధ పార్టీలు పెట్టుకునే పొత్తులను ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడగానే చూడాలి.

2004లో టీడీపీని గద్దె దించడానికి వైఎస్‌ఆర్‌సీపీ ఆరాధ్యదైవం, దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ఎస్‌, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంది. 2014లో వైఎస్‌ఆర్‌సీపీ కూడా తెలంగాణలో సీపీఐ(ఎం)తో పొత్తు పెట్టుకుంది. కేంద్రంలో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌ ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేస్తే, మూడోసారి గెలవడానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ చిన్నచిన్న పార్టీలతో సైతం పొత్తులు కుదుర్చుకుంటున్నారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా పొత్తులు పెట్టుకున్న దివంగత నేత డా. వైఎస్‌ఆర్‌, నరేంద్ర మోదీ సింహాలు కాదా..? వారు పిల్లులా..? దీనికి వైఎస్‌ఆర్‌సీపీ నేతల వద్ద సమాధానం ఉందా?

శాస్త్రీయ విశ్లేషణ అవసరం

ఎన్నికలకు సంబంధించి శాస్త్రీయంగా విశ్లేషణ చేసే ముందు రెండు అంశాలు పరిగణలోకి తీసుకోవాలి. అందులో మొదటిది ప్రైమరీ డేటా, రెండవది సెకండరీ డేటా. క్షేత్రస్థాయిలో పరిస్థితులను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం ద్వారా వెల్లడయ్యే డేటా ప్రైమరీ డేటా. గత ఎన్నికల్లో వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లు, వివిధ సామాజికవర్గాలు ఏయే పార్టీలకు మద్దతు ఇచ్చాయి తదితర అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసిన సంస్థలు విడుదల చేసిన డేటా సెకండరీ డేటాగా పరిగణించాలి.

జనసేన - టీడీపీ పొత్తు ఖరారైన తరుణంలో ఆ కూటమి భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది అని విశ్లేషణ చేసేముందు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న రాజకీయ పరిస్థితులను ప్రైమరీ డేటా ద్వారా, 2009, 2014, 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వివిధ పార్టీలకు వచ్చిన ఓట్లు, వివిధ సామాజికవర్గాలు ఏ పార్టీలకు మద్దతు ఇచ్చారు తదితర అంశాలపై సెకండరీ డేటా ద్వారా అధ్యయనం చేయాలి.

జనసేన-టీడీపీ పొత్తు ఏ విధంగా ఉండబోతోందో అధ్యయనం చేయడానికి దేశంలోని ప్రఖ్యాతి గాంచిన సిఎస్‌డిఎస్‌ - లోక్‌నీతి సంస్థ వివిధ అధ్యయనాల ద్వారా వెల్లడిరచిన డేటాను పరిగణలోనికి తీసుకుంటున్నాం.

టీడీపీ-జనసేన పొత్తును ఎదుర్కోలేమనే భయం వైఎస్‌ఆర్‌సీపీ నేతల ప్రకటనలతో స్పష్టమవుతోంది. వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా ఉన్న విశ్లేషకులతో, స్వయం ప్రకటిత మేధావులతో ఈ పొత్తు ప్రభావాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. విశ్లేషకులు కూడా తాము పాల్గొనే మీడియా సంస్థలకు అనుగుణంగా అభిప్రాయాలను వెల్లడించడంతోపాటు తాము అభిమానించే పార్టీలకు అనుకూలంగా మాట్లాడుతున్నారే కానీ, అవి శాస్త్రీయంగా ఉండడం లేదు. వైఎస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా, దానికి వ్యతిరేకంగా విశ్లేషణ చేసేవారు శాస్త్రీయంగా విశ్లేషణ చేస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఇది కొరవడింది. ఎన్నికలు, పొత్తులు తదితర అంశాలపై శాస్త్రీయంగా విశ్లేషణ చేసేటప్పుడు రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషణ చేయాలి. అందులో మొదటిది క్షేత్రస్థాయిలోని ప్రైమరీ డేటా, రెండవ అంశం గతంలో ఆయా పార్టీలకు వచ్చిన ఓట్లు, సామాజికవర్గాల మద్దతు, విశ్వసనీయ సంస్థల సర్వే నివేదికలను సెకండరీ డేటాగా పరిగణిస్తూ అధ్యయనం చేయాలి. ఈ రెండు పాటించినప్పుడే ఆ విశ్లేషణకు విశ్వసనీయత ఉంటుంది.

2014 ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ ఒక కూటమిగా ఏర్పడి పోటీచేశాయి. ఈ ఎన్నికల్లో టీడీపీకి 44.5 శాతం, మిత్రపక్షం బీజేపీకి వచ్చిన 2.18 శాతం ఓట్లు కలిపి మొత్తం 46.63 శాతం ఓట్లు రాగా, వైఎస్‌ఆర్‌సీపీకి 44.12 శాతం ఓట్లు వచ్చాయి. కేవలం 0.4 శాతం తేడాతో టీడీపీ అధికారం చేపట్టింది.

2019లో వేర్వేరుగా పోటీ చేసిన టీడీపీకి 39.26 శాతం, జనసేనకు 5.15 శాతం ఓట్లు రాగా వైఎస్సార్సీపీ 49.95 శాతం ఓట్లు సాధించి, 151 సీట్లతో అధికార పగ్గాలు చేపట్టింది. 2019 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే టీడీపీ 24 సీట్లలో గెలిచింది. ఈ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన టీడీపీ-జనసేన పార్టీలు సాధించిన ఓట్లను కలిపితే వారికి మరో 34 స్థానాల్లో గెలిచే అవకాశాలుండేవి. అదేవిధంగా 1 నుండి 2 శాతం ఓట్లతో ఓడిపోయిన స్థానాలు 10 కాగా, 3 నుండి 5 శాతం ఓట్లతో ఓడిపోయిన స్థానాలు 11 ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే తక్కువ ఓట్ల శాతంతో ఓడిపోయిన ఈ 21 సీట్లలో అత్యధికంగా ఈ కూటమి కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. శాస్త్రీయ అధ్యయనంలో భాగంగా 2019 గణాంకాలతోపాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే టీడీపీ-జనసేన పైన పేర్కొన్న మొత్తం 79 స్థానాలకుగాను 70కిపైగా సాధించే అవకాశాలున్నాయి. ఈ విధంగా చూస్తే ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సాధారణ మెజార్టీని ఈ కూటమి సునాయాసంగా సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

2019లో పోస్టల్‌ బ్యాలెట్స్‌ ఓట్లలో వైసీపీకీ 45.55, టీడీపీకి 27.32 శాతం వచ్చాయి. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తే ఇది రివర్సయ్యింది. ఒపీనియన్‌ మేకర్స్‌గా పేరున్న ప్రభుత్వ ఉద్యోగులు వైసీపీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సీపీఎస్‌ రద్దు, సమయానికి జీతాలు రాకపోవడం, బెనిఫిట్స్‌ అందకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ అస్మదీయులే, తస్మదీయులు కాబోతున్నారు. ‘‘లెఫ్ట్‌ హ్యాండ్‌, రైట్‌ హ్యాండ్‌తో ఓట్లు వేసి వైసీపీని గెలిపించుకున్నాం, అయినా ఏం చేయలేదు’’ అని ఒక ఉద్యోగ సంఘం నాయకుడు బహిరంగంగా వాపోవడమే దీనికి చక్కటి నిదర్శనం.

వైఎస్‌ఆర్‌సీపీ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించకపోవడం, ఉద్యోగాలు ఇవ్వకపోవడం వంటి కారణాలతో విద్యావంతులైన నిరుద్యోగ యువత అధికార వైఎస్‌ఆర్‌సీపీకి దూరమయ్యారు. శాసనమండలి ఎన్నికల్లో (పట్టభద్రులు) మూడు సీట్లనూ టీడీపీ గెలుపొందింది. 2019లో టీడీపీకి వచ్చిన ఓట్లతో పోలిస్తే 2023 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఉత్తరాంధ్రాలో 4.27%, తూర్పు రాయలసీమలో 5.28%, పశ్చిమ రాయలసీమలో 3.78% ఓట్లను పెంచుకుంది. వైసీపీ ఉత్తరాంధ్రాలో 18.89%, తూర్పు రాయలసీమలో 19.10%, పశ్చిమ రాయలసీమలో 13.37% ఓట్లను కోల్పోయింది. అయితే, ఈ ఎన్నికల్లో ఓటమిని విశ్లేషించుకోకుండా, పట్టభద్రులు తమ ఓటర్లు కాదని వైసీపీ ప్రకటించుకోవడం అవివేకం! వాలంటీర్ల సాయంతో తిరిగి అధికారంలోకి రాగలమని ప్రభుత్వం భావిస్తుండగా ఎమ్మెల్సీ ఫలితాలను పరిశీలిస్తే వీరి ప్రభావం నామమాత్రమే అని చెప్పవచ్చు.

కులం చుట్టే రాజకీయాలు

రాష్ట్రంలో పథకాల నుంచి పార్టీ టికెట్ల వరకు ప్రతిదీ కులం చుట్టే తిరుగుతుంది. దీనికి ఏ పార్టీ మినహాయింపు కాదు. ఆంధ్రాలో ఎప్పటిలాగే ఈసారి కూడా ‘క్యాస్ట్‌ వార్‌’ ఉంటుంది కానీ, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెప్పే ‘క్లాస్‌ వార్‌’ మాత్రం కాదు. 2019కి ముందు ‘కమ్మా వర్సెస్‌ నాన్‌ కమ్మా’ ఫార్ములాను చాపకింద నీరులా ప్రచారం చేయడంతో కమ్మలను వ్యతిరేకించే కులాలన్నీ వైసీపీకి దగ్గరయ్యాయి.

సీఎస్డీఎస్‌-లోక్‌నీతి డేటా ప్రకారం 2014లో వైఎస్‌ఆర్‌సీపీకి 64 శాతం రెడ్లు ఓట్లు వేయగా, 2019లో అది 86 శాతానికి పెరిగింది. 2014లో వైఎస్‌ఆర్‌సీపీకి 57 శాతం వచ్చిన ఎస్సీ ఓట్లు 2019కి 76 శాతానికి, 2014లో 37 శాతం వచ్చిన బీసీ ఓట్లు 2019లో 39 శాతానికి పెరిగాయి.

టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలే ఆ పార్టీకి వెన్నెముకగా ఉంటున్నారు. బీసీల్లో మార్పు వచ్చినప్పుడల్లా టీడీపీ ఓడిపోతూ వస్తున్నది. 1989, 2004, 2009, 2019 ఎన్నికల్లో ఇదే ప్రతిబింబించింది. 2014లో టీడీపీకి 54 శాతం బీసీ ఓట్లు రాగా, 2019లో 46 శాతం మాత్రమే వచ్చాయి. బీసీల్లో 8 శాతం ఓట్లు కోల్పోవడం వల్ల, టీడీపీకి ప్రధాన మద్దతుదారులైన కమ్మ సామాజికవర్గం ఓట్లు కూడా 2014 తో పోలిస్తే 12 శాతం తగ్గడంతో ఆ పార్టీ ఘోర ఓటమిపాలయ్యింది. 2019లో 7 శాతం రెడ్లే టీడీపీకి మద్దతిచ్చారు. టీడీపీ ఆవిర్భావం నుండి రెడ్డి సామాజికవర్గం ఇంత తక్కువ మద్దతిచ్చిన పరిస్థితి ఎప్పుడూ లేదు.

2019 ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన జనసేనకు వచ్చిన మొత్తం ఓట్లలో 26 శాతం కాపులవే! టీడీపీ-జనసేన కలిసి పోటీచేస్తే కొన్ని బీసీ కులాలు ఈ కూటమికి ఓటు వేయరని వైఎస్‌ఆర్‌సీపీ ప్రచారం చేస్తోంది. కానీ, 2014లో జనసేన టీడీపీకి మద్దతిచ్చినప్పుడు బీసీ కులాల ఓట్లు 54 శాతం టీడీపీకి పొందడాన్ని ఇక్కడ గమనించాలి. జనసేన-టీడీపీ పొత్తుతో కుల సమీకరణాలు తిరిగి 2014లాగా మారి, కూటమికి సానుకూలంగా మారే అవకాశాలున్నాయి.

బీజేపీపై అసంతృప్తి

విభజన హామీలు నెరవేర్చని బీజేపీ పట్ల ఏపీ ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. 2019లో ఆ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు వేసి, తమ కోపాన్ని ప్రదర్శించారు. ఈ పరిస్థితుల్లో టీడీపీ-జనసేన కూటమి బీజేపీతో కలిస్తే లాభం కన్నా, నష్టమే ఎక్కువ జరుగుతుందనడంలో సందేహం లేదు. పైగా బీజేపీతో పొత్తుపెట్టుకున్నప్పుడల్లా టీడీపీకి ముస్లిం ఓట్లు తగ్గుతున్నాయి. 2014లో బీజేపీతో కలిసి పోటీ చేస్తే టీడీపీకి 33 శాతమే ముస్లిం ఓట్లు రాగా, 2019లో బీజేపీకి ఎదురు తిరగడంతో అవి 46 శాతానికి పెరిగాయి.

2019 ఎన్నికల్లోలాగా ఏకపక్షంగా రెడ్డి సామాజికవర్గం వైసీపీ వైపు వచ్చే ఎన్నికల్లో నిలబడేందుకు ఇప్పుడు సిద్ధంగా లేరు. వాలంటీర్లను తీసుకొచ్చి, స్థానికంగా తమ నాయకత్వాన్ని దెబ్బ తీశారని వైఎస్‌ఆర్‌సీపీ నాయకత్వంపై వారు ఆగ్రహంగా ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజికవర్గాల వారీగా ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ప్రతి సామాజికవర్గంలో, సమూహాల్లో వైసీపీకి 2019లో వచ్చిన ఓట్ల శాతంలో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తుంది.

రాష్ట్రంలో ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టీడీపీ-జనసేన పార్టీల నేతలు మొదలుకొని కార్యకర్తల వరకూ క్షేత్రస్థాయిలో పొత్తుపై మానసికంగా సిద్దపడడం ఈ రెండు పార్టీలకు కలిసి వచ్చే అంశం. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలలో పవన్‌పై ఉన్న అభిమానం, వ్యక్తిగత ఆరాధన ఆ కూటమికి కలిసి రావచ్చు. ఈ రెండు జిల్లాల్లో జనసేనకు 15-25 శాతం వరకూ ఓట్లుంటాయి. కొన్ని స్థానాల్లో 30 శాతం వరకూ ఉన్నాయి. కొన్ని ఇతర జిల్లాల్లో కూడా 10-15 శాతం వరకూ ఆ పార్టీకి ఓట్లుండడం కూటమి విజయానికి సోపానం అవుతాయి. రాయలసీమలో జనసేనకు కనీసం 5 శాతం వరకు నిర్ణయాత్మక ఓట్లున్నాయి. రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండడంతో పాటు జనసేన ఓటు బ్యాంకు కూడా తోడైతే టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా మరింత బలోపేతం అవుతుంది. ఈ కలయికల వల్ల జనసేన-టీడీపీ కూటమి విజయఢంకా మోగించడం ఖాయం.

కింగ్ మేకర్

ఆంధ్రప్రదేశ్‌లో 2014 ఎన్నికల్లో కింగ్‌ మేకర్‌గా ఉన్న జనసేన రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కింగ్‌మేకర్‌ పాత్రను పోషించనున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. జనసేన-టీడీపీ కూటమి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా మారనుందనే విషయం అధికార వైఎస్‌ఆర్‌సీపీ నేతలకు బోధపడి వారి ‘వై నాట్‌ 175’ నినాదానికి భంగపాటు తప్పదని ఆందోళన చెందుతున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి అకౌంట్లల్లో డబ్బులు వేయడం, సంక్షేమ పథకాలే వైఎస్‌ఆర్‌సీపీని వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తాయనుకుంటే... అది అత్యాశే అవుతుంది. దివంగత ఎన్టీఆర్‌ తాను హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ 1983-89 వరకు అమలు చేసినా, 1989లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతోపాటు ఆయన కూడా కల్వకుర్తి నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. 2004-2009 మధ్య దివంగత నేత డా.వైఎస్‌.రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ పథకాలు చేపట్టినా 2009 ఎన్నికల్లో బొటాబొటి మెజార్టీతో అధికారంలోకి మరోసారి వచ్చారు. ఆ ఎన్నికల ఫలితాల తరువాత మీడియా సమావేశంలో, శాసనసభ సాక్షిగా కూడా కేవలం పాస్‌మార్కులు మాత్రమే తమకు వచ్చాయని వైఎస్‌ఆర్‌ నొక్కివక్కాణించారు.

దివంగత నేత వైఎస్‌ఆర్‌ చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని 2014 వరకు కాంగ్రెస్‌ కొనసాగించినా.. ఆ తర్వాతి ఎన్నికల్లో కాంగ్రె స్‌పార్టీ ఘోరంగా ఓడిపోయింది. తమిళనాడులోనూ జయలలిత మరణానంతరం ఆమె చేపట్టిన ప్రతి సంక్షేమ పథకం అమలు పరిచినా అన్నాడీఎంకే ఓడిరది. చరిత్రలో ఇటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి.

బటన్ నొక్కితే సరిపోదు

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి బటను నొక్కి డబ్బులు అకౌంట్లల్లో వేసినా, సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేస్తున్నా పెరుగుతున్న నిత్యావసర ధరలు, అధిక విద్యుత్తు ఛార్జీలు, బస్‌చార్జీలు, వివిధ పన్నుల రూపేణ వసూలు చేస్తున్న వాటితో పోలిస్తే ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో లాగేసుకుంటున్నట్లు ఉందని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంపై విమర్శలున్నాయి. సంక్షేమం పేరిట అభివృద్ధిని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందనే అభిప్రాయం అధికశాతం మంది వ్యక్తం చేస్తున్నారు. కొత్త కంపెనీలు రావడం లేదని, ఉద్యోగ అవకాశాలు విద్యావంతులైన యువతకు లేకపోవడంతో వారు నిరాశ-నిస్పృహలతో ఉన్నారు. రోడ్ల దుస్థితిపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. కాబట్టి, జనసేన-టీడీపీ కూటమి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వైఎస్‌ఆర్‌సీపీ చేస్తున్న ప్రచార ప్రభావం ఉండకపోవచ్చు. ఎందుకంటే, ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. సంక్షేమ పథకాలు పెరుగుతాయనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది!

వైసీపీ అంచనాలు నిజమయ్యేనా?

చంద్రబాబు అరెస్టుతో టీడీపీ క్యాడర్‌ నిరాశలోకి కూరుకుపోయి, పార్టీ బలహీన పడుతుందని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు భావిస్తున్నారు. కానీ జగన్‌ 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు ప్రజల్లో ఆయన మీద సానుభూతితో, ఆయన అరెస్టు తరువాత 17 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో 14 స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధించింది. 6 నెలల ముందు జైలు నుండి విడుదలయిన జగన్‌ ఆ తరువాత 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైఎస్‌ఆర్‌సీపీ 67 స్థానాల్లో విజయం సాధించింది.

‘‘చంద్రబాబు అరెస్టు కక్ష సాధింపు, ఇది వైఎస్‌ఆర్‌సీపీ చేసిన పెద్ద తప్పు’’ అని కేవలం టీడీపీ, తటస్థులే కాకుండా వైసీపీ శ్రేణుల్లోనూ సానుభూతి వ్యక్తం అవుతున్నట్లు తాజా ‘సీ- ఓటర్‌’ సర్వేలో తేలడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవంటారు. దీనికి తార్కాణం ఆరు నెలల ఎన్నికల ముందు చంద్రబాబును అరెస్టు చేయడం. ‘ఒక్క చాన్స్‌ ఇస్తే, రాజన్న పాలన తీసుకొస్తా’ అన్నందుకు 2019లో వైఎస్‌ఆర్‌సీపీని గెలిపించారు. వైఎస్‌ఆర్‌సీపీ గెలుపుకు, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అవ్వడానికి ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలా అండగా నిలబడటంతోపాటు, విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు వారూ దూరమయ్యారు.

2019లో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపుకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలలో ఇప్పుడు అలాంటి కసి, పట్టుదల కనిపించడం లేదు. కేవలం ఈ ఐదేళ్లలో సీఎంగా ఆయన పాలనే ఈ ఎన్నికల్లో గీటురాయిగా మారుతుంది కాబట్టి, ఈసారి దివంగతనేత డా.వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి సానుభూతి, ‘‘రాజన్న కార్డూ’’ పనిచేయదు. 2019లో వైఎస్‌ఆర్‌సీపీ మద్దతిచ్చిన సామాజికవర్గాలు దూరమయ్యాయి. టీడీపీకి 2019 దూరమైన సమూహాలు, ముఖ్యంగా బీసీలు, రైతులు తిరిగి దగ్గరవుతున్నారు. దీంతో పాటు జనసేన-టీడీపీ కూటమిగా ఏర్పడటంతో దీనిబలం మరింత పెరిగింది.

టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ను జైల్లో బంధించడం వల్ల నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. వారి ప్రచారంతో సానుభూతి కూడా జనసేన-టీడీపీ కూటమికి కలిసి వచ్చే అంశం. గతంలో జగన్‌ గెలుపుకు ఆయన తల్లి, చెల్లి కృషి చేయడం, ఇప్పుడు భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశాలను చూస్తే ‘దివాన్‌’ హిందీ సినిమాలో అమితాబచ్చన్‌ చెప్పిన ‘మేరా పాస్‌ మా హై’ అనే డైలాగ్‌ ఏపీ రాజకీయాలకు సరిగ్గా సరిపోతుంది. జనసేన-టీడీపీ పొత్తులో పోటీచేస్తే 2019లో వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ స్థానాల్లో కూటమి సునాయాసంగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని సానుకూలతల మధ్య ‘సంక్షేమం-అభివృద్ధి’ సమపాళ్లల్లో తమ ఎజెండాలో జనసేన-టీడీపీత చేర్చుకుని ముందుకెళ్తే నిస్సందేహంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ‘వై నాట్‌ టీడీపీ-జనసేన..?’.

-ఎ. నాగరాజు,

రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ

ఎ. నాగరాజు, రీసెర్చర్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ
తదుపరి వ్యాసం