CBN Arrest : వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయి - ములాఖత్ తర్వాత పవన్ కీలక ప్రకటన-pawan key statement after mulaqat with chandrababu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cbn Arrest : వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయి - ములాఖత్ తర్వాత పవన్ కీలక ప్రకటన

CBN Arrest : వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయి - ములాఖత్ తర్వాత పవన్ కీలక ప్రకటన

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 14, 2023 01:31 PM IST

Chandrababu Arrest Updates:చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్‌ ములాఖత్‌ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మీడియాతో పవన్, లోకేశ్, బాలకృష్ణ
మీడియాతో పవన్, లోకేశ్, బాలకృష్ణ

Chandrababu Arrest: రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, బాలకృష్ణ, నారా లోకేశ్‌ ములాఖత్‌ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కీలక ప్రకటన చేశారు. వైసీపీపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్నామని… వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు.

యుద్ధం కావాలంటే యుద్ధానికి సిద్ధమేనని అన్నారు పవన్. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ దుస్థితిపై ప్రధాని మోదీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. వైసీపీ అరాచకాలను అడ్డుకునేందుకు వచ్చే ఎన్నిక్లలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. సైబరాబాద్ ను నిర్మించిన వ్యక్తిని జైల్లో పెట్టడం దారుణమన్నారు. వైసీపీ నేతలు తమపై రాళ్లు వేసేటప్పుడు ఆలోచించుకోవాలని... తాము అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కర్ని వదలమని హెచ్చరించారు. డీజీపీ, సీఎస్ సహా ఎవరిపైనా సరే కేసులు తిరగదోడే అవకాశం ఉంటుందన్నారు.

రాష్ట్ర భవిష్యత్తు కోసమే….

“గత నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన చూస్తున్నాం . అరాచక పాలనలో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టారు. చంద్రబాబుకు సంఘీభావం తెలిపేందుకే వచ్చా. సగటు మనిషి వేదన జనసేన ఆవిర్భావ సభలోనే మాట్లాడా. నేను తీసుకున్న నిర్ణయాలు కొందరికి ఇబ్బందిగా ఉంటాయి. దక్షిణాది నుంచి మోదీకి మద్దతు తెలిపిన వ్యక్తి నేను. దేశానికి బలమైన నాయకుడు కావాలని అనుకున్నా. మోదీకి మద్దతు తెలిపిన సమయంలో నన్ను అందరూ తిట్టారు. నేను ఒక నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గను. ఏ రోజు వెళ్లినా కూడా మోదీ పిలిస్తేనే వెళ్లాను . ఆ స్థాయి నాయకుల సమయం వృథా చేయను. 2014లో బీజేపీ, టీడీపీ కు మద్దతిచ్చేందుకు కూడా ముఖ్యకారణం ఉంది. విడిపోయిన ఏపీకి అనుభవం ఉన్న నాయకుడు కావాలని అనుకున్నా. చంద్రబాబు పాలన, విధానపరమైన అభిప్రాయ బేధాలు ఉండొచ్చు. చంద్రబాబు అనుభవం, అసమర్థతపై సంపూర్ణ విశ్వాసం ఉంది. సైబరాబాద్ నిర్మించిన వ్యక్తిపై తప్పుడు కేసులా? రూ.317 కోట్లు స్కామ్ అని చెబుతున్నారు. ఉదాహరణకు ఎవరో చేసిన తప్పును బ్యాంకు ఛైర్మన్ కు అంటగడతామా? ఇవాళ ములాఖత్ ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది. వచ్చే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం కలిసే వెళ్తాయి. ఇది మా ఇద్దరి భవిష్యత్తు కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్తు కోసమే” అని పవన్ స్పష్టం చేశారు.

వైసీపీని సమిష్టిగా ఎదుర్కొనే సమయం ఆసన్నమైందన్నారు పవన్ కల్యాణ్. చంద్రబాబు రాజకీయనేత... జగన్ ఆర్థిక నేరస్థుడని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. సైబరాబాద్ నిర్మించిన, హైటెక్ సిటీ సృష్టించిన వ్యక్తిని జైల్లో పెట్టడం బాధాకరమన్నారు. “ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బాగుండాలనే నా ఆకాంక్ష - వైసీపీ నేతలు మాపై రాళ్లు వేసే ముందు ఆలోచించుకోవాలి. రాళ్లు వేసిన ఎవరినీ వదిలిపెట్టము. వైసీపీ పాలనతో మునిగిపోయాం. అధికారులు జగన్ ను నమ్ముకుంటే.. కుక్కతోకను పట్టుకుని గోదారి ఈదినట్లే. డీజీపీ, సీఎస్ తో సహా ఎవరిపైనైనా పాత కేసులు తిరగదోడే అవకాశం ఉంటుంది. చట్టాలను అధిగమించి చేసే అధికారులు ఆలోచించుకోవాలి. పోలీసు వ్యవస్థ ఇంత బానిసత్వంగా ఉంటే ఎవరే చేయలేరు. మీకు సమయం ఆరు నెలలు మాత్రమే ఉంది. యుద్ధమే కావాలంటే యుద్దానికి సిద్ధమే. తప్పులను సరిదిద్దుకోవడానికి మీకు 6 నెలలు సమయముంది. అక్రమంగా ఇసుక, మైనింగ్, బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న ఎవరినీ వదిలిపెట్టం. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం-జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయి . బీజేపీ కూడా మాతో కలిసి వస్తుందని ఆశిస్తున్నాం” అని పవన్ కల్యాణ్ కామెంట్స్ చేశారు.

IPL_Entry_Point