తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mudra Loan : కేంద్రం గుడ్‌న్యూస్‌.. ముద్ర లోన్ ప‌రిమితి రూ.20 ల‌క్ష‌ల‌కు పెంపు.. ఇలా అప్లై చేయండి

Mudra Loan : కేంద్రం గుడ్‌న్యూస్‌.. ముద్ర లోన్ ప‌రిమితి రూ.20 ల‌క్ష‌ల‌కు పెంపు.. ఇలా అప్లై చేయండి

HT Telugu Desk HT Telugu

26 October 2024, 17:21 IST

google News
    • Mudra Loan : కేంద్ర ప్ర‌భుత్వం వ్యాపార ఆలోచ‌న ఉన్న‌వారికి గుడ్‌న్యూస్ చెప్పింది. ముద్ర లోన్ ప‌రిమితిని రూ.10 ల‌క్ష‌ల నుంచి రూ.20 ల‌క్ష‌ల‌కు పెంచింది. దీంతో వ్యాపారం చేయాల‌నుకునే వారికి కాస్తా ఊర‌ట ల‌భించింది. https://www.mudra.org.in/ లింక్ ద్వారా ముద్ర లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
ముద్ర లోన్
ముద్ర లోన్

ముద్ర లోన్

2024-25 కేంద్ర బ‌డ్జెట్‌లోనే ముద్ర లోన్ ప‌రిమితి పెంచుతామ‌ని.. ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ గతంలో స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ముద్ర లోన్ ప‌రిమితిని రెండు రెట్లు పెంచారు. బ‌డ్జెట్‌లో ఇచ్చిన హామీ మేర‌కు.. తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్ర‌వారం ఆమోదం తెలిపింది. దీంతో ముద్ర ప‌థ‌కం కింద లోన్ పొందే మొత్తాన్ని రూ.10 ల‌క్ష‌ల నుంచి రూ.20 ల‌క్ష‌ల‌కు పెంచారు. రుణాల అంద‌జేత ప్ర‌క్రియ త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇలా అప్లై చేసుకోండి..

ముద్ర లోన్ కోసం ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అలాగే ఏదైనా వాణిజ్య బ్యాంకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థ‌లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సయ‌ల్ కంపెనీల‌ను సంప్ర‌దించి.. ఆఫ్‌లైన్‌లో కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆయా సంస్థ‌ల విలింగ్‌ను బ‌ట్టే రుణం మంజూరు అవుతుంది. అధికారిక వెబ్‌సైట్ https://www.mudra.org.in/ ద్వారా కూడా ముద్ర లోన్ అప్లై చేసుకునేందుకు వీలు ఉంటుంది.

స్టార్ట‌ప్‌ల‌కు రుణాలు..

సూక్ష్మ‌, చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల కోసం రుణాలు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా కేంద్ర ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చింది. చిన్న వ్యాపారాలు, స్టార్టప్‌లు అభివృద్ధి చెంద‌డానికి, వాటి ఉత్ప‌త్తి, పంపిణీ సామర్థ్యాల‌ను పెంచ‌డంలో స‌హాయ‌ప‌డ‌టానికి వ‌డ్డీ ర‌హిత‌, అతి త‌క్కువ వ‌డ్డీ రుణాల ద్వారా ఆర్థిక స‌హాయం అందిస్తారు.

మూడు ర‌కాలు..

ముద్ర రుణాలు మూడు ర‌కాలుగా ఉంటాయి. శిశు రుణాల కింద రూ.50 వేల వ‌ర‌కు లోన్ పొంద‌వ‌చ్చు. కిశోర రుణాల కింద రూ.50 వేల నుంచి రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణం పొంద‌వ‌చ్చు. త‌రుణ్ రుణాల కింద రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.10 ల‌క్షల‌ వ‌ర‌కు రుణాలు పొందవ‌చ్చు. త‌రుణ్ రుణాల‌కు తాజాగా మ‌రోకొత్త రుణాన్ని జ‌త చేశారు. త‌రుణ్‌ ప్ల‌స్ పేరిట కొత్త కేట‌గిరీని తీసుకొచ్చారు. దీని కింద రూ.10 ల‌క్ష‌ల నుంచి రూ.20 ల‌క్ష‌ల రుణ స‌దుపాయాన్ని క‌ల్పిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

వడ్డీ రేట్లు ఇలా..

ఈ ప‌థ‌కం కింద పొందే లోన్‌తో డైరీ, తేనెటీగ‌ల పెంప‌కం, పౌల్ట్రీ త‌దిత‌ర వ్య‌వ‌సాయ అనుబంధ బిజినెస్‌లు, ప‌లు ర‌కాల సూక్ష్మ‌, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసుకోవ‌చ్చు. ఉన్న ఊర్లోనే ఉపాధి పొంది.. నలుగురికి ఉపాధి క‌ల్పించేందుకు ఈ రుణాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ముద్ర లోన్ వ‌డ్డీ రేట్లు ప్ర‌భుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో వేర్వేరుగా ఉంటాయి. ప్ర‌భుత్వ బ్యాంకుల్లో 9.15-12.80 శాతం వ‌ర‌కు, ప్రైవేట్ బ్యాంకుల్లో 6.96 నుంచి 28 శాతం వ‌ర‌కు వ‌డ్డీ రేట్లు ఉంటాయి. రుణ గ్ర‌హీత రిస్క్ ప్రొఫైల్‌, రుణ కాల వ్య‌వ‌ధి, ఎంత లోన్ తీసుకున్నారనే దానిని బ‌ట్టి వ‌డ్డీ రేట్లు మారుతాయి.

కార్పొరేట్, వ్య‌వ‌సాయేత‌ర చిన్న‌, సూక్ష్మ ప‌రిశ్ర‌మ‌ల‌కు రుణాలు అందించ‌డం కోసం ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై) ప‌థ‌కాన్ని 2015 ఏప్రిల్ 8న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ రుణాల‌ను పీఎంఎంవై కింద ముద్ర రుణాలుగా వ‌ర్గీక‌రించారు. వీటిని మెంబ‌ర్ లెండింగ్ ఇన్‌స్టిట్యూష‌న్‌లు అందిస్తాయి. అంటే బ్యాంకులు, నాన్‌-బ్యాంకింగ్ పైనాన్షియ‌ల్ కంపెనీలు, మైక్రో-ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూష‌న్‌లు రుణాలు ఇస్తుంటాయి.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

తదుపరి వ్యాసం