SBI Server Down: ఎస్‍బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో సేవలకు అంతరాయం! యూజర్ల గగ్గోలు
SBI Server Down: దేశవ్యాప్తంగా వేలాది మంది యూజర్లకు ఎస్‍బీఐ ఆన్‍లైన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వాడుకోలేకున్నామని చాలా మంది కస్టమర్లు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు.

SBI Server Down: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India - SBI) సర్వర్లు నేడు (ఏప్రిల్ 3) దేశవ్యాప్తంగా డౌన్ అయ్యాయి. ఈ విషయంపై వేలాది మంది కస్టమర్లు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు చేస్తున్నారు. ఎస్‍బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ (SBI Internet Banking), యూపీఐ (UPI), యోనో యాప్ (Yono Mobile Banking App) సేవలకు అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ సర్వీసులు పని చేయడం లేదని చాలా మంది యూజర్లు ఫిర్యాదులతో ట్వీట్లు చేస్తున్నారు. ఎస్‍బీఐ అఫీషియల్ అకౌంట్‍కు ట్యాగ్ చేసి కంప్లైంట్లు చేస్తున్నారు.
SBI Server Down: ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎస్‍బీఐ సర్వర్లలో సమస్యలు తలెత్తాయి. పరిష్కరిస్తున్నట్టు ఎస్‍బీఐ చెప్పింది. అదే రోజు సాయంత్రం 4:45 గంటల తర్వాత అన్ని ఆన్‍లైన్ సేవలు సాధారణంగా పని చేస్తాయని వెల్లడించింది. అయితే నేడు (ఏప్రిల్ 3) వేలాది మందికి మరోసారి ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో బ్యాంక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఇంటర్నెట్ ఔటేజ్ ట్రాకర్ డౌన్ డిటెక్టర్ (Down Detector) కూడా ఎస్‍బీఐ సర్వర్ల డౌన్‍ను నేటి ఉదయం గుర్తించింది.
కస్టమర్లు ఫిర్యాదులు
SBI Server Down: ఎస్‍బీఐ ఆన్‍లైన్ బ్యాంకింగ్ యాప్ యోనో.. కొన్ని గంటల నుంచి పని చేయడం లేదంటూ ఓ యూజర్ ట్వీట్ చేశారు. ఎస్‍బీఐ ఆన్‍లైన్ సర్వీసులు నిన్నటి నుంచి పని చేయడం లేదని, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ సర్వీసులను వాడుకోలేకున్నానని మరో వినియోగదారుడు ఫిర్యాదు చేశారు. ఎస్‍బీఐ నెట్ బ్యాంకింగ్, యూపీఐ, యోనో సర్వర్లు లంచ్ బ్రేక్‍కు వెళ్లినట్టు ఉన్నాయంటూ మరో యూజర్ చమత్కరించారు. ఇలా చాలా మంది ఎస్‍బీఐ యూజర్లు.. ట్విట్టర్లో పోస్టులు చేస్తున్నారు.
“స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని ఆన్‍లైన్ సర్వీసులు మార్చి 31వ తేదీ నుంచి సరిగా పని చేయడం లేదు. యూపీఐ, యోనో, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లావాదేవీలు చేయలేకున్నా. వాళ్లు ఏం చేస్తున్నారు. నిత్యావసరాల కోసం కూడా నా శాలరీని ట్రాన్స్‌ఫర్ చేయలేకున్నా” అని ఓ యూజర్ ట్వీట్ చేశారు. ఇలా చాలా మంది ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కొందరు మీమ్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు.
అయితే, నేటి అంతరాయం పట్ల ఎస్‍బీఐ ఇంకా అధికారికంగా స్పందించలేదు. సాధారణ స్థితి ఎప్పుడు వస్తుందో పేర్కొనలేదు.