Tirumala : ఆగస్టు 15 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు - 3 రోజులపాటు ఈ సేవలు రద్దు
11 August 2024, 6:40 IST
- Tirumala Pavitrotsavams 2024 : తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 17వ తేదీతో ఈ వేడుకలు ముగియనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటనలో ప్రకటించింది.
ఆగస్టు 15 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుంచి పవిత్రత్సోవాలు వైభవంగా జరగనున్నాయి. ఆగస్టు 17వ తేదీతో ముగుస్తాయి. ఆగస్టు 14న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు.
సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఆగస్టు 15న పవిత్రాల ప్రతిష్ట, ఆగస్టు 16న పవిత్ర సమర్పణ, ఆగస్టు 17న పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆర్జితసేవలు రద్దు
పవిత్రోత్సవాల్లో ఆగస్టు 14న అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్ధు చేసింది. అదేవిధంగా, ఆగస్టు 15న తిరుప్పావడతోపాటు ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయి.
టీటీడీ నుంచి మరోసారి అలర్ట్….
మరోవైపు ఆన్‌లైన్‌లో దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు మధ్య వర్తులను సంప్రదించవద్దని టీటీడీ భక్తులకు మరోసారి విజ్ఞప్తి చేసింది. ఇటీవలి వెరిఫికేషన్‌లో 545 మంది యూజర్ల ద్వారా దాదాపు 14,449 అనుమానిత శ్రీవాణి లావాదేవీలు జరిగినట్లు గుర్తించబడింది.
అటువంటి వాటినీ బ్లాక్ చేసి వారికి మెసేజ్ ఫార్వార్డ్ చేసింది. కొంతమంది వినియోగదారులు 225 శ్రీవాణి టికెట్లను బుక్ చేసుకున్నారు. ఈ అనుమానిత వ్యక్తులు దర్శనానికి వచ్చినప్పుడల్లా టీటీడీ విజిలెన్స్ తనిఖీలు చేస్తోంది.
దర్శనం, సేవలు, వసతి బుకింగ్‌లలో నకిలీ ఐడీలతో దర్శనానికి వచ్చే యాత్రికులను కూడా టీటీడీ విజిలెన్స్ గుర్తిస్తోంది. అందువల్ల యాత్రికులు మధ్యవర్తుల వద్దకు వెళ్లవద్దని, ఆన్‌లైన్ లేదా కరెంట్ బుకింగ్ ద్వారా దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. అవకతవకలకు పాల్పడే వారిపై టీటీడీ క్రిమినల్ చర్యలు తీసుకుంటుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని ఓ ప్రకటనలో కోరింది.
తిరుచానూరులో ప్రత్యేక కార్యక్రమాలు….
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగష్టు 16వ తేదీ శుక్రవారం వరలక్ష్ష్మీ వ్రతం వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు.
ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోని ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరుగనుంది. వ్రతం నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వ్రతంలో పాల్గొన్న గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వ్రతం కారణంగా అమ్మవారి ఆలయంలో ఆర్జితసేవలైన అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.