Tirumala Brahmotsavam 2024 : అక్టోబరు 4 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు - తేదీలు ప్రకటించిన టీటీడీ-srivari annual brahmotsavams at tirumala will be conducted from october 4 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Brahmotsavam 2024 : అక్టోబరు 4 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు - తేదీలు ప్రకటించిన టీటీడీ

Tirumala Brahmotsavam 2024 : అక్టోబరు 4 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు - తేదీలు ప్రకటించిన టీటీడీ

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 04, 2024 07:43 AM IST

Tirumala Brahmotsavam 2024: అక్టోబరు 4 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.

తిరుమల(ఫైల్ ఫొటో)
తిరుమల(ఫైల్ ఫొటో) (Image source From TTD)

Tirumala Brahmotsavam 2024: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముహుర్తం ఫిక్స్ చేసింది టీటీడీ. అక్టోబరు 4వ తేదీ నుంచి ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి… శనివారం అన్నమయ్య భవన్ లో అధికారులతో సమీక్షించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ రెండు నెలల సమయంలో చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ పనులు, లడ్డూల బఫర్‌ స్టాక్‌, ఉద్యానశాఖ, ట్రాన్స్‌పోర్ట్‌, కల్యాణ కట్ట, గోశాల, శ్రీవారి సేవకులు, అన్నప్రసాదం, దర్శనం, వసతి, కళా బృందాల కార్యక్రమాలు, విజిలెన్స్‌ విభాగం భద్రతా ఏర్పాట్లతో పాటు మరికొన్ని అంశాలపై చర్చించారు.

అక్టోబరు 4న ధ్వజారోహణం…

బ్రహ్మోత్సవాల షెడ్యూల్ చూస్తే…. అక్టోబరు 4న ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ధ్వజస్తంభంపైకి గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు. దర్భతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టిటిడి అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు వాహన సేవలు ఉంటాయి. అక్టోబరు 8వ తేదీన గరుడ సేవ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఇక అక్టోబరు 9వ తేదీన స్వర్ణరథం, 11వ తేదీన రథోత్సవం ఉంటాయి. ఇక 12వ తేదీన చక్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల వేళ పలు రకాల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేయనుంది.

ఆగస్టులో రెండు సార్లు గరుడవాహన సేవ

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఈ ఆగస్టు నెలలో రెండు సార్లు గరుడ వాహనసేవ జరుగనుంది. ఆగస్టు 9వ తేదీ గరుడ పంచమి, ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీమలయప్పస్వామివారు గరుడవాహనంపై నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.

ఆగస్టు 9వ తేదీ గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీ మలయప్పస్వామివారు రాత్రి 7 నుండి 9 గంటల వరకు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.

శ్రీవారి వాహనాల్లోను, సేవకుల్లోను అగ్రగణ్యుడు గరుత్మంతుడు. ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్ల పక్షమి ఐదవ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ”గరుడపంచమి” పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు పూజిస్తారని ప్రాశస్త్యం.

ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడసేవను ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమినాడు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీవారు గరుడునిపై ఆలయ నాలుగు వీధులలో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను వెల్లడించింది.