Telugu Student Died in Kyrgyzstan : కిర్గిస్థాన్ లో గడ్డకట్టిన జలపాతంలో చిక్కుకుని, తెలుగు వైద్య విద్యార్థి మృతి
23 April 2024, 20:10 IST
- Telugu Student Died in Kyrgyzstan : కిర్గిస్థాన్ లో గడ్డకట్టిన జలపాతంలో చిక్కుకుని తెలుగు వైద్య విద్యార్థి దాసరి చందు మృతి చెందాడు. దాసరి చందు ఏపీలోని అనకాపల్లి జిల్లాకు చెందిన వాడు.
కిర్గిస్థాన్ లో తెలుగు వైద్య విద్యార్థి మృతి
Telugu Student Died in Kyrgyzstan : కిర్గిస్థాన్‌లో( Kyrgyzstan) గడ్డకట్టిన జలపాతం(Frozen Waterfall)లో చిక్కుకుని తెలుగు వైద్య విద్యార్థి మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి(Anakapalle) జిల్లాకు చెందిన దాసరి భీమరాజు రెండో కుమారుడు దాసరి చందు(20) కిర్గిస్థాన్ లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఆదివారం నాడు జరిగిన ప్రమాదంలో చందు మరణించాడు. భీమరాజు మాడుగులలో హల్వా మిఠాయి దుకాణం నడుపుతూ... పిల్లలను చదివిస్తున్నారు.
గడ్డకట్టిన జలపాతంలో చిక్కుకుని
దాసరి చందు యూనివర్సిటీ పరీక్షలు ముగియడంతో...ఆదివారం ఏపీకి చెందిన మరో నలుగురు విద్యార్థులతో కలిసి కిర్గిస్థాన్ లోని ఓ జలపాతానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు గడ్డకట్టిన జలపాతంలో కూరుకుపోయిన చందు మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న చందు తల్లిదండ్రులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పారు. చందు మృతదేహాన్ని అనకాపల్లికి తరలించడానికి ఏర్పాట్లు చేయాలని కిషన్ రెడ్డి కిర్గిస్థాన్(Kyrgyzstan)లోని ఎంబసీ అధికారులను సంప్రదించారు. మృత దేహాన్ని అనకాపల్లికి తరలించేందుకు ఏర్పాట్లు చేసున్నట్లు అనకాపల్లి ఎంపీ వెంకట సత్యవతి తెలిపారు.
స్కాట్లాండ్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
ట్రెక్కింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ జారి నీటిలో పడి ఇద్దరు తెలుగు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఇటీవల స్కాంట్లాండ్ లో జరిగింది. ఈ ఇద్దరు విద్యార్థులు కూడా బ్రిటన్ లోని ఓ యూనివర్శిటీలో చదువుకుంటున్నారు.వీరిలో ఒకరు హైదరాబాద్ కు చెందిన వారు ఉండగా… మరో విద్యార్థి ఏపీకి చెందిన విద్యార్థిగా గుర్తించారు.
స్కాట్లాండ్‌లోని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతున్న వీరిద్దరూ మరో ఇద్దరితో కలిసి….గత బుధవారం పెర్త్‌షైర్‌లోని(Perthshire) లిన్ ఆఫ్ తమ్మెల్‌కి వెళ్లారు. ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తుండగా… ప్రమాదవశాత్తుగా వీరిద్దరూ జారి నీటిలో పడి కొట్టుకుపోయారు. ఈ మేరకు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు…. వెంటనే గాలింపు చర్యలు చేపట్టి వారి మృతదేహాలను గుర్తించారు. వీరి మృతి విషయంలో ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు లేవని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో చనిపోయినవారిని జితేంద్రనాథ్ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22)గా గుర్తించారు.