తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Political Analysis: పగటి కలలు.. అధికార పార్టీ నెత్తిన పాలు

Political Analysis: పగటి కలలు.. అధికార పార్టీ నెత్తిన పాలు

HT Telugu Desk HT Telugu

27 March 2023, 12:08 IST

google News
  • ‘‘కొంతమంది టీడీపీ నేతలు పగటి కలలు కంటున్నారు. ఇంకొందరు ఓ అడుగు ముందుకేసి ‘వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే గెలుస్తాం. మాకు ఎవరి అవసరం లేదు’ అని ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. వీరి మాటలు నమ్మి టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే, మరోసారి వైఎస్సార్సీపీ నెత్తిలో పాలుపోసినట్టే!’’- పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ ఐ.వి.మురళీ కృష్ణ శర్మ విశ్లేషణ

చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)
చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో) (HT_PRINT)

చంద్రబాబు నివాసంలో పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

Political Analysis: ‘కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి!’ అని మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అన్నారు. ఆ మాటలను అందిపుచ్చుకుందేమో 2024లో అధికారంలోకి రావాలని టీడీపీ కూడా కలలు కంటోంది గానీ, వాటిని సాకారం చేసుకోవడానికి మాత్రం పూర్తిస్థాయిలో కష్టపడటం లేదు. యుద్ధం ముంచుకొస్తున్నది. వైఎస్సార్సీపీని ఎదుర్కోవడానికి అవసరమైన బలం, బలగం తమకు ఉందా? అధికార పక్షాన్ని కూల్చగల క్షేత్రస్థాయి వ్యుహాలు, ఢీ కొట్టగొల సారథులు తమవైపు ఉన్నారా? అని టీడీపీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయమిది.

ఇవేమీ పట్టించుకోకుండా తాజాగా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు గెలవడంతోనే యద్ధం గెలిచేశామని, అధికారంలోకి వచ్చేశామని కొంతమంది తెలుగుదేశం నాయకులు పగటి కలలు కంటున్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి ‘వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే గెలుస్తాం. మాకు ఎవరి అవసరం లేదు’ అని ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. వీరి మాటలు నమ్మి టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే, మరోసారి వైఎస్సార్సీపీ నెత్తిలో పాలుపోసినట్టే!

2014 ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీకి రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ కంటే కేవలం 6 లక్షల ఓట్లే అధికంగా వచ్చాయి. వాటితోనే 117 సీట్లలో విజయం సాధించి అధికార పీఠం ఎక్కింది. అదే 2019 ఎన్నికల్లో గెలిచిన వైఎస్సార్సీపీకి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఓట్లలో టీడీపీ కంటే 33 లక్షల 83 వేల ఓట్లు అధికంగా వచ్చాయి. దాంతో ఆ పార్టీ 151 స్థానాలను కైవసం చేసుకుంది. 175 నియోజకవర్గాల్లో సగటున లెక్కిస్తే వైఎస్సార్సీపీకి వచ్చిన ఓట్లను సమం చేయడానికే 19 వేలకు పైచిలుకు ఓట్లను టీడీపీ పూడ్చుకోవాల్సి ఉంటుంది.

జనసేన ఖాతాలో నాటి కంటే రెట్టింపు ఓట్లు

పైగా, ఒంటరిగా పోటి చేసిన జనసేన ఖాతాలో 17 లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి. ఈసారి అవి రెట్టింపు అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. మరోవైపు, 2019లో 20 శాతానికి పైగా ఓట్లతో మెజారిటీ సాధించిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు 27 మంది, 10 శాతం కంటే ఎక్కువ ఓట్లతో మెజారిటీ సాధించిన అభ్యర్థులు 39 మంది ఉన్నారు. ఇక 5 ఎస్టీ, 11 ఎస్సీ రిజర్వ్‌ డ్‌ అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 2009 నుంచీ గెలవడం లేదు. క్షేత్రస్థాయి పరిస్థితులు ఇలా ఉంటే, టీడీపీ చంకలు గుద్దుకుంటూ విలువైన కాలాన్ని కరగదీస్తోంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి వచ్చింది ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత తాలూకు నెగిటివ్‌ ఓటింగేగానీ, ఆ పార్టీ మీద అభిమానంతో వచ్చిన పాజిటివ్‌ ఓటింగ్‌ కాదు. పీపుల్స్‌ పల్స్‌ సంస్థ క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు ‘బాబు వస్తే మా జీవితాలు మారుతాయి’ అని ఎక్కడా చెప్పడం లేదు. కేవలం అధికార వైఎస్సార్సీపీ మీద ఉన్న వ్యతిరేకత వల్ల, మరో ప్రత్యామ్నాయం లేకనే ప్రజలు టీడీపీ వైపు చూస్తున్నారు. కేవలం నెగిటివ్‌ ఓటింగ్‌తో అధికారం సొంతం చేసుకోవడం కష్టం. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు తన ఇమేజ్‌ పెంచుకోవడం అత్యవసరం. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తారని, మేనేజ్‌మెంట్‌ రాజకీయాలు చేస్తారనే అప్రతిష్టను ఆయన తక్షణమే తొలగించుకోవాలి.

‘అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తాం’ అనే మాట చంద్రబాబు నాయుడి ఇటీవలీ ప్రసంగాల్లో ఎక్కువగా వినపడుతోంది. అంటే దీని అర్థం, వైఎస్సార్సీపీ విధ్వసంకర పాలనను వ్యతిరేకిస్తూ రేపు పొద్దున అధికారంలోకి వస్తే అంతకన్న విధ్వంసం చేస్తామనా? కక్ష సాధింపులు ఉండవనీ, అభివృద్ధి చేస్తామని హామీ ఇవ్వాల్సిందిపోయి చంద్రబాబు తనను తాను దిగజార్చుకుంటున్నారు. ఇమేజ్‌ బిల్డింగ్‌ విషయంలో బ్లూ మీడియాను నమ్ముకొని జగన్‌ ఎలా మునిగిపోతున్నారో, పచ్చ మీడియాను నమ్ముకొని చంద్రబాబు కూడా అలాగే మోసపోతున్నారు.

పీడీఎఫ్ ఓట్లు అటు బదిలీ

మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం మూడు పట్టభద్రుల స్థానాలకు కలిపి 7 లక్షల 16 వేల 664 ఓట్లు పోలయ్యాయి. వాటిలో చెల్లిన ఓట్లు 6 లక్షల 63 వేల 782. ఇందులో టీడీపీకి 2 లక్షల 89 వేల 630 ఓట్లు రాగా, అధికార వైఎస్సార్సీపీకి 2 లక్షల 36 వేల 972 ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీల మధ్య వ్యత్యాసం 52 వేలు. టీడీపీకి వచ్చిన మెజారిటీ 54 వేల ఓట్లు. వైఎస్సార్సీపీ, టీడీపీల నుంచి వచ్చిన రకరకాల ప్రలోభాలను తిరస్కరించి ఇంచుమించు లక్ష మంది పట్టభద్రులు పీడీఎఫ్‌ అభ్యర్థులకు ఓటు వేశారంటే, వామపక్షం పలుకుబడిని, ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీడీఎఫ్‌ ఓటర్లు రెండో ప్రాధాన్యతగా టీడీపీకి ఓటు వేయడం వల్లే మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. క్షేత్రస్థాయిలో వామపక్షాలు, జనసేన, టీడీపీ కలిసి పనిచేయడంతో టీడీపీ లాభపడిరది. రెండో ప్రాధాన్యతతో దక్కిన ఈ విజయాలు టీడీపీకి రెండో పార్టీ అవసరమని నొక్కి చెప్తున్నాయి. ఇది పట్టించుకోకుండా ఒంటరిగా పోటి చేసినా గెలుస్తామని కొంతమంది ప్రబుద్ధులు గాలిమేడలు కట్టడం హాస్యాస్పదం.

పొత్తు కుదిరితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ పోషించిన పాత్ర శాసన సభ ఎన్నికల్లో జనసేన పోషిస్తుంది. 2019లో 17.3 లక్షల ఓట్లు తన ఖాతాలో వేసుకున్న జనసేన ప్రభావం ఈ నాలుగేళ్లలో రెట్టింపయింది. ఈ సారి జనసేన ప్రభావం తమపై ఎలా ఉండబోతుందో వైఎస్సార్సీపీకి బాగా తెలుసు. మచిలీపట్నంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభలో జనసేన అధినేత పవణ్‌ కళ్యాణ్‌ చేసిన బల ప్రదర్శనతో అధికార వైఎస్సార్సీపీకి ఆ సంకేతాలు స్పష్టంగా అందాయి. జనసేన, టీడీపీ కలయికతో వైఎస్సార్సీపీ పునాదులు కదలటం ఖాయమని తేలిపోయింది. కాబట్టే, ‘దమ్ముంటే 175 స్థానాల్లో పోటి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సహా వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు పవణ్‌ కళ్యాణ్‌కి సవాల్‌ విసురుతున్నారు. దీన్ని అర్థం చేసుకొని వీలైనంత తొందరగా జనసేనతో కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తేనే, టీడీపీ విజయావకాశాలు మెరుగవుతాయి. లేదంటే, 2019లో లగడపాటి సర్వే, శ్రీనివాసులు నాయుడు సర్వే, పచ్చ మీడియా సర్వేలు ఎలాగైతే విజయం టీడీపీదే అని చెప్పి నిలువునా ముంచేశాయో, అలాగే ఈ సారి కూడా అలాంటివారిని మాటలు నమ్మితే పార్టీని ఏకంగా బంగాళఖాతంలో ముంచేయడం ఖాయం.

బీజేపీని పట్టించుకున్నదెవరు?

ఇదే ఎమ్మెల్సీ ఎన్నికలు జనసేన ప్రభావం అధికంగా ఉన్న ఉభయ గోదావరి, అమరావతి, గుంటూరు పరిధిలో జరిగితే అధికార వైఎస్సార్సీపీ మీద ఉన్న వ్యతిరేకత పెద్ద ఎత్తున బయటపడేది. మరోవైపు బీజేపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఆంధ్రాలో బీజేపీని పట్టించుకుంటున్నది ఎవరు అంటే... టీడీపీ, జనసేన, వైఎస్సార్సీపీ పార్టీలూ పట్టించుకుంటున్నాయి తప్పా, ప్రజలు మాత్రం బీజేపీని పట్టించుకోవడం లేదు. రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చడంలో బీజేపీ విఫలమయ్యిందనే ఆక్రోశం రాష్ట్ర ప్రజల్లో ఉంది. బీజేపీ, వైఎస్సార్సీపీ ఒక అవగాహనతో దూరంగా ఉన్నట్టు నటిస్తూ కలిసి పని చేస్తున్నాయి. జగన్‌ బీజేపీకి, బీజేపీకి జగన్‌ వ్యతిరేకం కాదనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాగే, బీజేపీ కూడా జగన్‌ ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. టీడీపీ కూడా బీజేపీ కరుణా కటాక్షాల కోసం పడిగాపులు కాస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీని పక్కనపెట్టడానికి కూడా వెనకాడబోనని పవణ్‌ కళ్యాణ్‌ మాత్రమే హెచ్చరికల్లాంటి సంకేతాలు పంపించారు. ఇదే సమయంలో కొందరు టీడీపీ నేతలు బీజేపీతో అంటకాగడానికి వెంపర్లాడడం ఆశ్చర్యంగా ఉంది. వైఎస్సార్సీపీని ఓడించడానికి కనీస బలం లేని బీజేపీ స్నేహ హస్తం కంటే, జనసేన, వామపక్షాల అవసరమే ఎక్కువగా ఉందని టీడీపీ గ్రహించాలి. బీజేపీతో పొత్తు లాభం కంటే నష్టమే ఎక్కువ అని టీడీపీ గ్రహించాలి.

ఆకట్టుకున్న జనసేన కార్యాచరణ

‘బాదుడే బాదుడు’, ‘ఇదేం కర్మ రాష్ట్రానికి’ లాంటి కార్యాక్రమాలు చేయడం వల్లే ప్రజలు తమవైపు నిలబడ్డారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇటీవల వాఖ్యానించారు. కానీ, ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కూడగట్టడంలో టీడీపీ కంటే జనసేన పాత్రే ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో అధ్వాన్నంగా మారిన రోడ్ల గురించి జనసేన చేపట్టిన ‘గుడ్మార్నింగ్‌ సీఎం’ కార్యక్రమం రాష్ట్ర ప్రజల మననసు గెలుచుకుంది. ప్రభుత్వానికి సమాంతరంగా ప్రజాసమస్యల్ని స్వీకరించి, పరిష్కరించడానికి చేపట్టిన ‘జనవాణి’ కి విస్తృత స్పందన లభించింది. అక్రమ ఇసుక దందాపై, జగనన్న డొల్ల ఇళ్లపై, రుషికొండ ఆక్రమణపై, ఉత్తరాంధ్ర సమస్యలపై జనసేన క్షేత్రస్థాయిలో పోరాడుతోంది. మరోవైపు ప్రభుత్వం చేస్తున్న తప్పులు సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా ఆకర్షనీయమైన కార్టున్లను కూడా జనసేన సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద నాయకులుగా వెలుగొందినవారు సైతం ఎలాంటి ప్రజా ఉద్యమాలు చేయకుండా, ప్రజల్లో లేకుండా చీకటి గుహల్లో దాచుకున్నారు. క్షేత్రస్థాయిలో లేకున్నా మీడియా ముందు కాలరెగరేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. దీనికి విరుద్ధంగా సామాన్య జనసేన కార్యకర్తలు మాత్రం వైఎస్సార్సీపీపై జనక్షేత్రంలో పోరాడుతూ జనసేనను ప్రధాన ప్రతిపక్ష స్థానంలో నిలబెట్టారు. ఇవన్నీ టీడీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసొచ్చాయి.

నాలుగేళ్లు గెలుపు రుచి చూడకుండా నిరాశలో ఉన్న ప్రతిపక్షాలకు నాలుగు ఎమ్మెల్సీలు గెలవడంతో వారి ఆశ సజీవంగా మారింది. వారు నూతన ఉత్తేజంతో పని చేయడానికి అవసరమైన ఈ విజయం రూపంలో ఒక ఉత్ప్రేరకం దొరికింది. కానీ, కేవలం ఈ నలుగురి గెలుపుతోనే అధికారం నడిచిరాదు. కేవలం ఈ నలుగురి గెలుపుతోనే రాజకీయ సమీకరణాలు మారిపోవు. ఇంకా చాలామంది ప్రజలు ఎటు అడుగెయ్యాలో తెలియక, తమ ఆశా దీపం కోసం గోడ మీదే నిలబడి చూస్తున్నారు. శాసనసభ ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయం ఉంది. అంటే, జగన్‌ తన తప్పులు సరిదిద్దుకోవడానికి కావాల్సినంత సమయం ఇంకా మిగిలే ఉంది. పైగా వైఎస్సార్సీపీ రాజకీయ పునాది గట్టిగా ఉంది. దళితులు, మైనార్టీలు, రెడ్లు వారి వైపే నిలబడ్డారు. తెలుగుదేశం పుంజుకోవాలంటే బీసీలను, కాపులను తన వైపు తిప్పకోవాలి. కేవలం కమ్మ సామాజిక వర్గాన్నే ముందుకు తీసుకొచ్చి, వారికే పదవులు కట్టబెడితే ప్రజలు ఆమోదించరని గత ఎన్నికల గుణపాఠాన్ని గుర్తుంచుకుని నడుచుకుంటే టీడీపీకే మంచిది. ఈ సంవత్సరకాలంలో అనేక విషయాల్లో మార్పులు రావొచ్చు. కాబట్టి, ఒక్కొక్క నియోజకవర్గంలో సగటున 20 వేల ఓట్లను ఎలా రికవరీ చేసుకుంటారు? అనే విషయంపై టీడీపీ దృష్టి పెట్టాలి. దానికోసం ముందుగా టీడీపీ నేల మీద నడవాలి.

పీపుల్స్ ‘పల్స్’ ఇదీ

పీపుల్స్‌ పల్స్‌ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నాడీని పరిశీలిస్తున్నప్పుడు తేటతెల్లం అయిన ఒక ఉమ్మడి విషయం ఏంటంటే... ‘కేవలం డబ్బులు పంచే పథకాల వల్ల ఏమీ ఒరగదు, అభివృద్ధి పట్టాలు తప్పిన రాష్ట్రాన్ని వెంటనే కాపాడాలి’ అనే ధోరణిలో ప్రజలు మాట్లాడతున్నారు. కాబట్టి, ప్రతిపక్షాలు దానికి తగ్గట్టుగా ప్రత్యామ్నాయ ప్రణాళికలు రచించాలి. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరిస్తూ ప్రజల నమ్మకాన్ని సొంతం చేసుకోవాలి. ప్రజా ఉద్యమాలు నిర్మించి, పాజిటివ్‌ ఎజెండాతో ఈ సంవత్సరం మొత్తం ప్రజల్లోనే ఉండాలి. ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా జనసేన, వామపక్షాలతో కలిసి నడవాలి. అయితే, ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వనని జనసేన అధ్యక్షుడు పవణ్‌ కళ్యాణ్‌ పదే పదే చెప్తున్నారు కానీ, రేపు పొద్దున అధికారంలోకి రావాలని కలలు కంటున్న చంద్రబాబు నాయుడు మాత్రం చెప్పడం లేదు. ఈ బాధ్యత తీసుకోవాల్సింది ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీది. ఆ పార్టీ ఆ బాధ్యతలు తీసుకుంటున్నట్టు ఎక్కడా కనపడటం లేదు. ఇలాంటి ఆలోచన ధోరణితో ఒకవేళ జనసేన, వామపక్షాల అవసరం లేదని టీడీపీకి కలలో అనిపించినా, 2024లో వారి కల చెదరడం తథ్యం!

- ఐ.వి.మురళీ కృష్ణ శర్మ

పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ

పొలిటికల్ అనలిస్ట్ ఐవీ మురళీకృష్ణ శర్మ, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ

(గమనిక: ఈ ఆర్టికల్‌లో తెలియపరిచిన అభిప్రాయాలు, విశ్లేషణ రచయిత వ్యక్తిగతం లేదా వారు ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థకు సంబంధించినవి. హెచ్‌టీ తెలుగుకు వీటితో సంబంధం లేదు)

తదుపరి వ్యాసం