TDP JSP BJP Alliance: పొత్తు పొడిచినట్టే...! తేలని సీట్ల లెక్క.. ఢిల్లీలోనే చంద్రబాబు, పవన్, నేడు మరో విడత చర్చలు!
08 March 2024, 5:48 IST
- TDP JSP BJP Alliance: ఎన్డీఏ NDA కూటమిలోకి టీడీపీ చేరిక లాంఛనం కానుంది. సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత తెలుగుదేశం పార్టీ బీజేపీతో జత కట్టేందుకు సిద్ధం అవుతోంది. సీట్ల సర్దుబాటే కొలిక్కి రావాల్సి ఉంది. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు అమిత్‌షాతో చంద్రబాబు, పవన్ చర్చలు జరిపారు.
ఢిల్లీలో అమిత్‌షాతో భేటీ అయిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు
TDP JSP BJP Alliance: ఏపీలో ఎన్నికల పొత్తు వికసిస్తోంది. రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీజేపీ జెండా ఎగరాలన్న లక్ష్యంతో టీడీపీ-జనసేన కూటమితో జట్టు కట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. గురువారం అర్థరాత్రి వరకు బీజేపీ అగ్రనేతలు అమిత్ షా Amith Shah, జేపీ నడ్డా JP Nadda లతో చంద్రబాబు Chandrababu, పవన్ కళ్యాణ్ Pawan Kalyan చర్చలు జరిపారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సీట్ల లెక్కలు తేలిన వెంటనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
బీజేపీ ఎక్కువ పార్లమెంటు సీట్లను అడుగుతుండటంతో గురువారం అర్థరాత్రి వరకు జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. బీజేపీ అడుతున్న స్థానాలు, టీడీపీ-జనసేన ప్రతిపాదిస్తున్న సీట్ల లెక్కలపై ఏపీ బీజేపీ నాయకత్వంతో చర్చించిన తర్వాత సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తుందని చెబుతున్నారు.
మార్చి 10వ తేదీన బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. ఈ నేపథ్యంలో ఈ లోపే పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2014లో బీజేపీ-టీడీపీ మాత్రమే పోటీలో ఉంది. జనసేన వారికి మద్ధతు ఇచ్చింది. ఆ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. దీంతో సీట్ల విషయంలో టీడీపీ రాజీ పడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు ఖచ్చితంగా గెలిచే స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. మూడు పార్టీలు కలిసే పోటీ చేయాలనే విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
ఏపీలో ఎన్నికల పొత్తులపై బీజేపీలో చాలామంది పొత్తును వ్యతిరేకిస్తున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం మాత్రం మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అన్ని రాష్ట్రాల నుంచి పోటీ చేయాలని భావిస్తోంది. ఏపీ నుంచి ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఉండాలని భావనతో సర్దుకుపోవాలని యోచిస్తోంది. హ్యాట్రిక్ విజయం కోసం కాస్త వెనక్కి తగ్గాలని యోచిస్తోంది. గెలుపే ఆధారంగా గెలిచే స్థానాల్లో మాత్రమే పోటీ చేయాలని యోచిస్తున్నారు.ఎవరికి ఎక్కడ బలం ఉంటుంది అనే విషయంలో మూడు రాజకీయ పార్టీలకు స్పష్టత ఉండటంతో సీట్ల విషయంలో పైచేయి సాధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో బీజేపీ ఇప్పటికే పెద్ద ఎత్తున కసరత్తు చేసింది, పొత్తు విషయంలో చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చాలామంది సొంతంగా ఎదగడంపై ప్రశ్నలు లేవనెత్తారు. లాభనష్టాలు, ప్రయోజనాలు బేరీజు వేసుకున్న తర్వాత పొత్తుకు ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. గురువారం నాటి చర్చల్లో 6 లోక్‌సభ స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరనట్టు తెలుస్తోంది.నర్సాపురం నుంచి పోటీ చేసే అభ్యర్ధి ఏ పార్టీ తరపున పోటీ చేయాలనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
పోటీ చేసే స్థానాలు ఇవే..
అమిత్ షా నివాసంలో గంటన్నర పాటు జరిగిన చర్చల్లో కాళహస్తి, జమ్ముల మడుగు, కైకలూరు, ధర్మవరం, విశాఖ(నార్త్), ఏలూరు, రాజమండ్రి, అరకు, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ స్థానాలను బీజేపీ కోరినట్టు తెలుస్తోంది. దీంతో పాటు బిజేపి 5 లోకసభ స్థానాలను అడుగుతోంది.
తిరుపతి, రాజంపేట, రాజమండ్రి, అరకు, నరసాపురం నుంచి బీజేపీ అభ్యర్థుల్ని పోటీ చేయించాలని భావిస్తోంది. జనసేన ఇప్పటికే మూడు లోకసభ స్థానాలలో పోటీకి పొత్తు కుదిరింది. మచిలీపట్నం, అనకాపల్లి, కాకినాడలో జనసేన పోటీ చేయనుంది. చర్చల వివరాలను ఏపి బిజేపి నేతలతో
పార్టీ అగ్రనాయకత్వం శుక్రవారం చర్చించనుంది. పొత్తులపై స్ఫష్టత కోరుతున్న నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం వరకు ఢిల్లీలోనే ఉండనున్నారు.
8-10 స్థానాలు కోరిన బీజేపీ...
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు కూడా జరుగనున్న నేపథ్యంలో తమకు వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలు కేటాయించాలని అమిత్ షా,జేపీ నడ్డాలు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఆ స్థానాలను గెలిపించుకునేందుకు మూడు పార్టీలు గట్టిగా కృషి చేద్దామని సూచించారు.అసెంబ్లీలో సాధ్యమైనన్ని సీట్లు గెలిచి అధికారంలోకి రావాలని తమకు తెలుసని, లోక్‌సభలో సొంతంగా కనీసం 370 స్థానాలు నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు బీజేపీ పెద్దలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు వివరించారు.
అందుకే ప్రతి మిత్రపక్షం నుంచి సాధ్యమైనన్ని ఎక్కువగా అడుగుతున్నట్టు వివరించినట్టు తెలుస్తోంది. బీజేపీ ఆశిస్తున్నన్ని స్థానాలు కాకుండా 4 లోక్‌సభ, 6 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తే బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయని చంద్రబాబు వివరించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. గెలవలేని సీట్లలో పోటీ చేయడం వల్ల అక్కడ వైసీపీకి ప్రయోజనం కలుగుతుందని చంద్రబాబు వివరించే ప్రయత్నం చేసినట్టు సమాచారం.