AP BJP Politics: ఎటూ తేలని పొత్తు పంచాయితీ.. అంతు చిక్కని బీజేపీ అంతరంగం..ఏపీ నేతల్లో గందరగోళం
AP BJP Politics: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై బీజేపీ అధిష్టానం మదిలో ఏముందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పొత్తుల విషయంలో ఇతర పార్టీల నేతలు తప్ప బీజేపీ పెద్దలు మాత్రం పెదవి విప్పడం లేదు.
AP BJP Politics: ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో మునిగి తేలుతుంటే బీజేపీ మాత్రం నింపాదిగా వ్యవహరిస్తోంది. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమ గుప్పిట్లో ఉండాల్సిందేనన్న ధీమా ఆ పార్టీలో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన పూర్తై దాదాపు మూడు వారాలు గడుస్తున్నా పొత్తుల Allianceపంచాయితీ ఎటూ తేలలేదు.
అటు తెలంగాణలో బీజేపీ telangana Bjp అభ్యర్థుల జాబితాను కూడా ఖరారు చేస్తుంటే ఏపీలో మాత్రం ఎవరితో కలిసి ముందుకు సాగాలనే దగ్గరే ఆగిపోయారు.
ఎన్నికల్లో కలిసి పోటీ చేయడంపై బీజేపీని ఒప్పించేందుకు తీవ్రంగా శ్రమించానని కొద్ది రోజుల క్రితం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ Pawan Kalyan ప్రకటించారు. వైసీపీ ఓటమే ధ్యేయంగా విపక్షాలను కూడగడుతున్నట్లు పవన్ చెప్పుకొచ్చారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళతారని ప్రచారం జరిగింది. అయితే ఆయనకు ఇప్పటి వరకు ఢిల్లీ వెళ్లలేదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన వెంటనే ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. బీజేపీ పెద్దలతో సంప్రదింపులు జరిపారు.
చంద్రబాబు, జగన్ ఢిల్లీ పర్యటనల తర్వాత ఏపీ బీజేపీ మనసులో ఏముందనేది తెలీక అంతా తలలు పట్టుకుంటున్నారు. బీజేపీకి నమ్మకంగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డిని వదులుకుని చంద్రబాబుతో జట్టు కట్టాల్సిన అవసరం ఏముందని వైసీపీ నేతలు అంతర్గత సంభాషణల్లో ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుతో బీజేపీకి ఉన్న గతానుభవాల దృష్ట్యా ఆ పార్టీతో పొత్తులు అంత సులభం కాదనే వాదన కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఎన్డీఏ కూటమి ఆవిర్భావం నుంచి చంద్రబాబు పలుమార్లు కూటమిని విడి బయటకెళ్లిన సందర్భాలు ప్రస్తావిస్తున్నారు.
ఇటు ఏపీ బీజేపీలో కూడా రకరకాల అభిప్రాయాలు ఉండటంతో ఎన్నికల పొత్తులపై బీజేపీ అధిష్టానం ఓ నిర్ణయానికి రాలేకపోతోంది. మోదీ, అమిత్‌షాలు ఏపీలో బీజేపీని బలోపేతం చేయాలని గత పదేళ్లుగా రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దక్షిణాదిన తెలంగాణలో బీజేపీ పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉన్నా ఏపీలో మాత్రం ఎలాంటి పురోగతి లేకపోవడం ఆ పార్టీ నేతల్ని ఏ నిర్ణయానికి రానివ్వకుండా చేస్తోంది.
ఏపీలో బీజేపీ సొంతంగా ఎదగాలనే వర్గం ఒకటి, టీడీపీ అనుకూల వర్గం మరొకటి, వైసీపీ అనుకూల వర్గం ఇంకోటి ఉండటంతో బీజేపీ ఎటూ తేల్చుకోలేక పోతోంది. ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీలన్ని ఎన్నికల హడావుడిలో ఉంటే బీజేపీ మాత్రం ఇంకా పొత్తులపైనే తేల్చుకోలేకపోతోంది.
అధిష్టానానికే బాధ్యత…
ఏపీలో ఎన్నికల పొత్తులపై అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు. శని, ఆదివారాల్లో పార్టీ సమన్వయ సమావేశాలను నిర్వహించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ నేతృత్వంలో జరిగిన సమావేశాల్లో ప్రధానంగా ఎన్నికల పొత్తులపై కసరత్తు చేశారు.
రెండు రోజుల పాటు నాయకులంతా తమ అభిప్రాయాలను వివరించారు. బీజేపీ జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ జీ ఆధ్వర్యంలో పార్టీ పరిస్థితి పై 26 జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలు తో చర్చించినట్టు పురందేశ్వరి చెప్పారు.
రాష్ట్రంలో 50 వేలప్రజల అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నామని, సామాన్య ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటామని చెప్పారు. 175 అసెంబ్లీ, 25 ఎంపి సీట్ల లో అభ్యర్థుల పోటీ పై ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు చెప్పారు. ప్రజల అభిప్రాయాలను జాతీయ నాయకత్వానికి వివరిస్తామని, అధిష్టానం నిర్ణయం బట్టి మా అడుగులు ఉంటాయన్నారు.
బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థులు 2000 మంది వచ్చారని, ఒక్కో నియోజకవర్గం లో మూడు నుంచి ఐదుగురు అభ్యర్థులు ఉన్నారని, పార్లమెంటరీ కమిటీ సమీక్ష చేసి అభ్యర్థులను ఖరారు చేస్తారని చెప్పారు.
ఏపీలో ఎన్నికల పొత్తు ఉంటే… కేంద్ర పార్టీ పెద్దలే ప్రకటిస్తారని, 175 అసెంబ్లీ, 25 ఎంపి స్థానాల్లో పోటీకి అభ్యర్థులు జాబితా సిద్దం చేశామన్నారు. ఏ నియోజకవర్గం లో ఏ అభ్యర్థి బెటర్ అనే దాని పైనే చర్చ సాగిందని, జాబితా కేంద్రానికి రెండు రోజుల్లో పంపుతామన్నారు. జాతీయ నాయకత్వం నిర్ణయం బట్టి కార్యాచరణ ఉంటుందన్నారు.