TDP JSP BC Declaration: 50 ఏళ్లకే పెన్షన్.. బీసీ డిక్లరేషన్‌లో ప్రకటించిన టీడీపీ-జనసేన కూటమి
TDP JSP BC Declaration: టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే 50ఏళ్లు నిండిన బీసీలకు పెన్షన్లు ఇస్తామని, పెన్షన్ మొత్తాన్ని రూ.4వేలకు పెంచుతామని మంగళగిరిలో నిర్వహించిన బీసీ డిక్లరేషన్‌లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు.
TDP JSP BC Declaration: టీడీపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే... ప్రస్తుతం చెల్లిస్తున్న పెన్షన్లను రూ.4 వేలకు పెంచుతామని 50 ఏళ్లకే బీసీలకు పింఛన్ ఇస్తామని... బీసీ సబ్ ప్లాన్ అమల్లో భాగంగా ఏడాదికి రూ.30 వేల కోట్ల చొప్పున... ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు.
మంగళగిరిలో నిర్వహించిన 'జయహో బీసీ' సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించారు.'బీసీల డీఎన్‌ఏలోనే టీడీపీ ఉందని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేలా వెనకబడిన వర్గాలకు అవకాశాలు కల్పించామన్నారు.
టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి మరింత ప్రాధాన్యం ఇస్తామని, బీసీలంటే తమ పల్లకీ మోసే బోయీలని జగన్ అనుకుంటున్నారని, బీసీలు బ్యాక్‌వర్డ్ క్లాస్ కాదు, సమాజానికి వెన్నెముకలని నిరూపిస్తాం' అని ప్రకటించారు.
బీసీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛను అమలు చేస్తామని, పింఛను మొత్తాన్ని రూ.4 వేలకు పెంచుతామని తెలిపాయి. చంద్రన్న బీమా పునరుద్ధరిస్తామని, బీమా పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతామని డిక్లరేషన్‌లో హామీ ఇచ్చారు. పెళ్లి కానుక పునరుద్ధరించి రూ.లక్ష చొప్పున లబ్ది అందజేస్తామని పేర్కొన్నారు.
మొత్తం పది ప్రధాన అంశాలతో టీడీపీ, జనసేన సంయుక్తంగా ప్రత్యేక డిక్లరేషన్ ప్రకటించాయి. ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం చేస్తామని పది నెలల క్రితమే ప్రకటించిన టీడీపీ తాజా డిక్లరేషన్‌లోనూ చేర్చింది. జగన్ పాలనలో 300 మందికి పైగా బీసీలు దారుణ హత్యకు గురయ్యారని, దాడులు, దౌర్జన్యాల నుంచి బీసీలకు రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తెస్తామని తెలిపింది. సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి హక్కులు కాపాడతామని వెల్లడించింది.
బీసీ డిక్లరేషన్‌లోని మరిన్ని ముఖ్యాంశాలు..
బీసీ ఉప ప్రణాళిక ద్వారా వారి అభివృద్ధికి ఏటా రూ.30 వేల కోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.1.50 లక్షల కోట్ల వ్యయం చేస్తారు. తెదేపా-జనసేన ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీ సబ్‌ప్లాన్ నిధులను వారి కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు. వైసీపీ ప్రభుత్వం రూ.75 వేల కోట్ల సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించిందని ఆరోపించారు.
153 కులాలతో 56 సాధికార కమిటీలు ఏర్పాటు చేసి అభిప్రాయాలు సేకరించినట్టు పేర్కొన్నారు . ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. ఇప్పుడు రూ.3 వేలు ఉన్న పెన్షన్ ను రూ.4 వేలకు పెంచుతామని, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే సంపద సృష్టించే మార్గాన్ని చూపించాలన్న ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా రూ.1.50 కోట్లు ఐదేళ్లలో ఖర్చు చేసే బాధ్యత చేపడతామన్నారు.
దొంగ లెక్కలు చూపించి నిధులను దొడ్డి దారిన మళ్ళించి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైసీపీ అని చంద్రబాబు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 25 శాతం నుండి 34 శాతానికి పెంచామని కానీ జగన్ 34 శాతాన్ని 24 శాతానికి తగ్గించడంతో 16,800 పదవులు బీసీలు కోల్పోయారని ఆరోపించారు. వెనుక బడిన వర్గాలకు 33 శాతం రిజర్వేషన్లు పెట్టేంతవరకు పోరాడుతామన్నారు. ఎంతమంది పిల్లలు ఉన్నా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామన్నారు.
చట్టబద్ధంగా కులగణన
చట్టబద్దంగా కులగణన నిర్వహించాల్సి ఉందని, వెనుకడిన వర్గాల వారు ఎంతమంది ఉన్నారో, వారి ఆర్థిక పరిస్థతిని అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. అందరికీ సముచితమైన స్థానం రావాలని జనాభా దామాషా ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన వారికి ఎక్కువ ప్రాముఖ్యతినిచ్చి వారిని పైకి తీసుకురావాలనేదే మా ఆలోచన అని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం 300 మందిని పొట్టన బెట్టుకుందని, వేల మందిపై అక్రమ కేసులు పెట్టారని ఇది రాజకీయంగా ఎదుగుతున్న బీసీలను అణచివేసే ధోరణి అని ఆరోపించారు. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువస్తామన్నారు.
బీసీ డిక్లరేషన్ లో పేర్కొన్న అంశాలు
1. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తాం. పెన్షన్‌ను నెలకు రూ.4 వేలకు పెంచుతాం.
2. ప్రత్యేక రక్షణ చట్టం : జగన్ పాలనలో 300 మందికి పైగా బీసీలను క్రూరంగా హత్యకు గురయ్యారు. బీసీలపై దాడులు, దౌర్జన్యాల నుండి రక్షణ కోసం ‘ప్రత్యేక రక్షణ చట్టం’ తీసుకొస్తాం.
ఎ) సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి హక్కులు కాపాడుతాం.
3. బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం.
ఎ) వైసీపీ ప్రభుత్వం రూ.75 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించింది. అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ ప్లాన్ నిధులు బీసీల కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
4. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌ను వైసీపీ ప్రభుత్వం
34 శాతం నుండి 24 శాతానికి తగ్గించి, 16,800 పదవులు దూరం చేశారు. అధికారంలోకి వచ్చాక 34 శాతం రిజర్వేషన్లు పునరుద్దరిస్తాం.
ఎ) చట్ట సభల్లో బీసీలకు 33శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం.
బి) అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ అమలు.
సి) తక్కువ జనాభాతో, ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం.
5. ఆర్ధికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్దరిస్తాం
ఎ) జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం.
బి) దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం.
సి) స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం.
డి) జగన్‌రెడ్డి ‘ఆదరణ’ లాంటి 30 పథకాలు రద్దు చేశారు. రూ.5000 కోట్లతో ‘ఆదరణ’ పరికరాలిస్తాం.
ఈ) మండల/నియోజకవర్గ కేంద్రాల్లో కామన్ వర్క్ షెడ్స్, ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం.
ఎఫ్) జగన్ రెడ్డి రద్దు చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు పునరుద్దరిస్తాం.
6. చట్టబద్దంగా కుల గణన నిర్వహిస్తాం
7. చంద్రన్న బీమా రూ.10 లక్షలతో పునరుద్దరిస్తాం. పెళ్లి కానుకలు రూ.లక్షకు పెంపు
8. శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం.
9. విద్యా పథకాలు అన్నీ పునరుద్దరిస్తాం
ఎ) నియోజకవర్గాల్లోని రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తాం.
బి) షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తాం.
సి) పీజీ విద్యార్ధులకు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ పునరుద్దరిస్తాం.
డి) స్టడీ సర్కిల్, విద్యోన్నతి పథకాలు పున:ప్రారంబిస్తాం.
10. బీసీ భవనాలు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తాం.