Sunil Kanugolu to AP: ఏపీలో సునీల్ కనుగోలు ఎంట్రీ..! షర్మిల తరపున వ్యూహరచన?
22 January 2024, 13:18 IST
- Sunil Kanugolu to AP: ఏపీ కాంగ్రెస్ పగ్గాలను షర్మిల చేపట్టిన తర్వాత ఆ పార్టీ దూకుడు ప్రదర్శించాలని భావిస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం సైతం ఏపీలో కాంగ్రెస్ ఉనికిని చాటాలని నిర్ణయించుకోవడంతో షర్మిల తరపున సునీల్ కనుగోలు ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
షర్మిల తరపున వ్యూహరచన చేయనున్న సునీల్ కనుగోలు
Sunil Kanugolu to AP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిల దూకుడు ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో ఏ అవకాశాన్ని వదులుకోడానికి ఆమె సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు కల్పించాలని భావిస్తోంది. ఏపీలో కూడా పొలిటికల్ కన్సల్టెంట్ల సేవలు వాడుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో పునరుజ్జీవాన్ని కల్పించేందుకు సునీల్ కనుగోలు సేవల్ని ఏపీలో వినియోగించు కోనున్నట్టు తెలుస్తోంది.
ప్రతి వారం ఏపీ కాంగ్రెస్ కార్యక్రమాలు, ప్రచారం, తెర వెనుక ప్రచారం వంటి కార్యక్రమాలను ఇప్పటికే సిద్ధం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో షర్మిల పర్యటనలు ప్రారంభించారు.జనవరి 23 నుంచి 31వ తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు ప్రణాళిక ఖరారు చేశారు. రోజుకు మూడు జిల్లాల్లో సమీక్షా సమావేశాలను నిర్వహించేందుకు షర్మిల సిద్ధమయ్యారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఒకే రోజు పర్యటించనున్నారు.
ఇకపై ప్రతివారం కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ కన్సల్టెంట్లతో కలిసి రాష్ట్రంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలను రూపొందిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును వీలైనంత ఎక్కువగా పెంచుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. 2019లో కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక్క శాతం ఓట్లు మాత్రమే దక్కాయి. ఈ సారి కనీసం ఐదారు శాతం ఓట్లైనా దక్కించుకోవాలని ఆ పార్టీ టార్గెట్‌గా పెట్టుకుంది.
ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ విజయావకాశాలను మెరుగు పరిచిన అంశాలు తమకు కూడా పనికొస్తాయేమోనని ప్రయత్నాలు ప్రారంభించింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపులో కీలకంగా వ్యవహరించిన సునీల్ కనుగోలుకు చెందిన మైండ్ షేర్ అనలిటిక్స్, ఇన్‌క్లూజివ్ మైండ్స్ వంటి కన్సల్టెంట్ల సంస్థల సాయాన్ని పొందాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం సునీల్ టీమ్ రూపొందించిన ప్రకటనలు, మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి వంటి జింగిల్స్ బాగా హిట్ అయ్యాయి.ఈ నేపథ్యంలో ఏపీలో కూడా ప్రజల్లో బలంగా వెళ్లే ప్రకటనల్ని రూపొందించడానికి మైండ్ షేర్ అనలటిక్స్ సేవల్ని వాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.దీంతో పాటు సోషల్ మీడియా కాంపెయినింగ్‌లో కూడా దూకుడు పెంచేందుకు రెడీ అవుతున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.