Tirupati District : నోట్‌బుక్ తీసుకురాలేదని విద్యార్థిని చితకబాదిన టీచర్ - వీపుపై వాతలు
21 September 2024, 8:35 IST
- నోట్‌బుక్ తీసుకురాలేదన్న కారణంతో ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు చితకబాదాడు. దీంతో సదరు విద్యార్థి అక్కడకక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు.
విద్యార్థి వీపుపై వాతలు
తిరుపతి జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. నోట్‌బుక్ తీసుకురాలేదని ఉపాధ్యాయుడు చితకబాదాడు. దీంతో ఆ విద్యార్థికి ఒంటిపై వాతలు తేలాయి. భరించలేక ఆ విద్యార్థి అక్కడకక్కడే సొమ్మసిల్లి పడిపోయాడు. విచక్షణరహితంగా కొట్టిన ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, సోషల్ జస్టిస్ లీగల్ రైట్స్ ఫోరం డిమాండ్ చేస్తోంది.
ఈ ఘటన తిరుపతి జిల్లా యర్రవారిపాలెం మండలంలోని చితగుంట గ్రామంలో జరిగింది. గ్రామంలోని జడ్పీ హైస్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్న బి.సాత్విక్ (8)ను ఉపాధ్యాయుడు భాస్కర్ నాయుడు కర్రతో విపరీతంగా చావబాదాడు. ఇంటి వద్ద హోం వర్క్ చేయకపోవడంతో శుక్రవారం పాఠశాలకు విద్యార్థి నోట్‌బుక్ తీసుకురాకురాలేదు.
దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయుడు అతి క్రూరంగా శరీరమంతా వాతలు పడేలా చితకబాదాడని విద్యార్థి తల్లిదండ్రులు హరిబాబు, రేవతి పేర్కొన్నారు. విచక్షణరహితంగా కర్రతో వీపుపై కొట్టడంతో బాలుడు పాఠశాలలో అక్కడికక్కడే సొమ్మసిల్లి పిడిపోయాడు.
చర్యలకు డిమాండ్…
విషయం బయటకు పొక్కడంతో మండల విద్యాధికారిపై ఒత్తిడి పెరిగింది. ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు హరిబాబు, రేవతి డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుడిపై ఎంఈఓ, డీఈఓ తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఉద్యమిస్తామని సోషల్ జస్టిస్ లీగల్ రైట్స్ ఫోరం ప్రెసిడెంట్ రెడ్డి చర్ల నరేష్ బాబు మీడియాకు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ఎంఈఓ బాలసుబ్రహ్మణ్యం విచారించి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.
లైంగిక వేధింపుల కేసు… ముగ్గురు అరెస్ట్:
ఏలూరు జిల్లా కేంద్రంలోని శ్రీస్వామి దయానంద సరస్వతి ఆశ్రమంలో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వార్డెన్ భర్త శశికుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన భార్య శశి, మేనకోడలు లావణ్యని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
ఏలూరులోని గ్రీన్‌సిటీ ప్రాంతానికి చెందిన బమ్మిరెడ్డిపల్లి శశికుమార్ మనీ డిజిటల్ ఫొటో స్టూడియో నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య శశి శ్రీస్వామి దయానంద సరస్వతి ఆశ్రమం బాలికల వసతి గృహంలో వార్డెన్‌గా విధులు నిర్వర్తిస్తుంది. ఆమె మేనకోడలు బయ్యారపు లావణ్య అదే వసతి గృహంలో కేర్ టేకర్‌గా పని చేస్తుంది.
వీరిద్దరి ద్వారా శశికుమార్ విద్యార్థినీలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. ఈనెల 15న ఆశ్రమంలో ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికను కేర్ టేకర్ లావణ్య సాయంతో బలవంతంగా తన కారులో ఎక్కించికుని బాపట్లలోని ఇదే ఆశ్రమానికి చెందిన మరో బ్రాంచ్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్కడ నుంచి బాలికను తీసుకొచ్చి ఆశ్రమంలో విడిచిపెట్టాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు.
అతేకాకుండా అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో సరిగ్గా చదవడం లేదని సాకుతో మిగిలిన బాలికలను చితబాదాడు. దీంతో బాలికంతా కలిసి ఈనెల 17న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ రమణ కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం పాత బస్‌స్టాండ్ సమీపంలో శశికుమార్, శశి, లావణ్యలను పోలీసులు అరెస్టు చేశారు.