AP Caste Census: రేపటి నుంచి ఏపీలో కులగణన.. ఇంటింటి సమాచార సేకరణ
18 January 2024, 9:38 IST
- AP Caste Census: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి కులగణన ప్రారంభం కానుంది. రెండుసార్లు వాయిదా పడిన ఈ కార్యక్రమాన్ని జనవరి 19 నుంచి ప్రారంభించనున్నారు.
ఏపీలో రేపటి నుంచి కుల గణన
AP Caste Census: ఏపీలో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్త కులగణన జరుగనుంది. సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను పది రోజుల పాటు నిర్వహించనున్నారు. కులగణనలో మిగిలిపోయిన వారి కోసం మరో 5 రోజులు సచివాలయాల్లో సర్వే కోసం అవకాశం కల్పిస్తారు.
ఇప్పటికే ఏడు సచివాలయాల పరిధిలో ప్రయోగాత్మకంగా సర్వే పూర్తి చేశారు. గతంలో నిర్వహించిన సర్వేల ప్రకారం రాష్ట్రంలో 1.67 కోట్ల కుటుంబాలు.. 4.89 కోట్ల జనాభా ఉందని గణాంకాలు చెబుతున్నాయి.
తాజా కులగణన సర్వేతో అన్ని కులాలకు ఆర్థిక, సామాజిక సాధికారత దిశగా చేయూత అందించడానికి వీలువుతుందని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వ పథకాలు అందకుండా ఇంకా ఎవరైనా అర్హులు మిగిలిపోయినా దీని ద్వారా తెలుస్తుంది. తద్వారా వారికీ లబ్ధి చేకూర్చేందుకు వీలవుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
గ్రామ, వార్డు సచివాలయాల శాఖ గతంలో వలంటీర్ల ద్వారా సేకరించిన డేటా ప్రకారం రాష్ట్రంలో గ్రామాల్లో 1,23,40,422 కుటుంబాలకు చెందిన 3,56,62,251 మంది నివాసం ఉంటున్నారు. పట్టణ ప్రాంతాల్లో 44,44,887 కుటుంబాలలో 1,33,16,091 మంది నివసిస్తున్నారు. మొత్తం 1.67 కోట్ల కుటుంబాలకు సంబంధించి 4.89 కోట్ల మంది ఉన్నారు.
సచివాలయాల ఉద్యోగులు, వలంటీర్లు శుక్రవారం నుంచి ఉమ్మడిగా వారి పరిధిలోని ఇళ్లకు వెళ్లి పది రోజులు రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సంబంధించిన వివరాలను కులాల వారీగా ఈనెల 28వతేదీ వరకు పది రోజుల పాటు సేకరిస్తారు.
కులగణనలో వివిధ కారణాలతో నమోదు చేసుకోకుండా మిగిలిన వారి కోసం ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు సంబంధిత కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా ఒకరు వెళ్లి వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తారు.
రాష్ట్ర ప్రణాళిక శాఖ, బీసీ, సాంఘిక సంక్షేమ శాఖలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల శాఖలు ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కులగణన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. కులగణనకు సంబంధించి ఇప్పటికే వివిధ కుల సంఘాల ప్రతినిధులతో జిల్లాల వారీగా ప్రభుత్వం ప్రత్యేకంగా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించింది.
726 కులాలు.. ప్రత్యేక యాప్
కులగణన ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో పారదర్శకంగా నిర్వహించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్‌ను సిద్ధం చేసింది. దాదాపు 723 కులాల జాబితాలను ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీల వారీగా వర్గీకరించి మొబైల్ యాప్‌లో అనుసంధానించారు.
ఇంటింటికీ వెళ్లి వివరాల సేకరణ సమయంలో ఆయా కుటుంబం ఏ కేటగిరిలోకి వస్తుందో యాప్‌లో సెలెక్ట్ చేయగానే కులాల జాబితా కనిపిస్తుంది. వారు వెల్లడించే వివరాల ప్రకారం కులగణన సిబ్బంది దాన్ని నమోదు చేస్తారు.
ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ కేటగిరీలో పేర్కొన్న 723 కులాలతో పాటు మరో మూడు కులాలు బేడ జంగం లేదా బుడగ జంగం, పిరమలై కల్లర్ (తేవర్), యలవ కులాలకు సంబంధించిన వారి వివరాలను వేరుగా అదర్స్ కేటగిరిలో సేకరిస్తారు.
నో క్యాస్ట్ ఆప్షన్ కూడా….
కులం వివరాలు వెల్లడించడానికి ఆసక్తి చూపనివారికి, కుల పట్టింపులు లేని వారి కోసం నో- క్యాస్ట్ కేటగిరీని కూడ కులగణన ప్రక్రియలో చేర్చారు. కులగణన అయా కుటుంబాలు వెల్లడించే వివరాల ఆధారంగా డేటీ నమోదు చేసిన అనంతరం కుటుంబంలో ఎవరైనా ఒకరి నుంచి ఆధార్‌తో కూడిన ఈ -కేవైసీ తీసుకోనున్నారు. ఈ కేవైసీ కోసం బయోమెట్రిక్, ఐరిస్ తదితర విధానాలకు అవకాశం కల్పించారు.