AP Caste Census : ఏపీలో కులగణన ప్రక్రియ వాయిదా - కొత్త తేదీపై సర్కార్ ప్రకటన
AP Caste Census Updates : ఏపీలో సమగ్ర కుల గణన ప్రక్రియపై బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 9 నుంచి కులగణన ప్రక్రియ మొదలవుతుందని ప్రకటించారు.
AP Caste Census Updates : డిసెంబర్ 9 నుంచి ఏపీలో కులగణన ప్రక్రియ మొదలవుతుందన్నారు మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ. సమగ్ర కులగణన చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని… సమగ్ర కులగణన పేదవాడి జీవితానికి భద్రత కల్పిస్తామని చెప్పారు. ప్రజల జీవన స్థితి మారడానికి కులగణన అవసరమన్న ఆయన… స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జనగణన తప్ప కులగణన జరగలేదన్నారు.
సామాజిక సాధికారిత కు చిరునామా..ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు మంత్రి వేణుగోపాలకృష్ణ. కులగణన కోసం కుల సంఘాల నాయకుల అభిప్రాయాలు సేకరిస్తున్నామని… ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి ఆయా వర్గాల అభిప్రాయాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో జరిగే కులగణన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని చెప్పుకొచ్చారు. సమగ్ర కులగణన సామాజిక కోణంలో జరుగుతుందని… ప్రతిపక్షాలకు కులగణన అంటే వెన్నులో వణుకు పుడుతోందని కామెంట్స్ చేశారు.
నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 27వ తేదీ నుండి కుల గణన ప్రక్రియ మొదలుపెట్టాలని నిర్ణయించింది. కానీ ఆ తేదీని మార్చుతూ మంత్రి ప్రకటన చేశారు. దీంతో డిసెంబర్ 9వ తేదీ నుంచి కుల గణన ప్రక్రియ షురూ కాబోతుంది.
కులగణన ప్రక్రియలో భాగంగా….. సర్వేలో వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 20కి పైగా అంశాలపై సమాచారం సేకరించనున్నారు. సర్వే కోసం వాలంటీర్లు ఇళ్లకు వచ్చిన సమయంలో ఇంటికి తాళం వేసి ఉన్నా.. కుటుంబ సభ్యులు ఇళ్ల దగ్గర లేకపోయినా వారి వివరాల నమోదు కోసం సర్వే పూర్తయిన వివరాల నమోదుకు తరువాత మరో వారం గడువు ఇవ్వనున్నారు. ఆ సమయంలో సంబంధిత కుటుంబసభ్యులే సచివాలయాలకు వెళ్లి వివరాలు అందించాలి.
కుల గణన సర్వే వివరాల నమోదుకు వాలంటీర్ల సెల్‌ఫోన్లలో ప్రత్యేక యాప్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు. సర్వే ప్రారంభం నుంచి ముగింపు వరకు వాలంటీర్లు ఒకే ఫోన్ వినియోగించాల్సి ఉంటుంది. సర్వేలో భాగంగా కుటుంబాల నుంచి వివరాలు సేకరించేటప్పుడు, సర్వే పూర్తి అయిన తరువాత స్క్రీన్ షాట్ తీయకుండా యాప్‌లో డిజైన్ చేశారు.
సమగ్ర కులగణన సర్వేలో భాగంగా ప్రతి ఒక్కరి వివరాలు సేకరిస్తారు. వ్యక్తిగత చిరునామా, కుటుంబ సభ్యుల సంఖ్య, వివాహం జరిగిందా, లేదా, 'కులం, ఉపకులం, మతం, రేషన్ కార్డు నంబరు, విద్యార్హత, ఇంటి రకం, నివాస స్థల విస్తీర్ణం, వ్యవసాయ భూమి విస్తీర్ణం, మరుగుదొడ్డి రకం, వంట గ్యాస్, తాగునీటి సదుపాయం ఉందా వంటి వివరాలను నమోదు చేస్తారు.ఇంట్లో ఉన్న పశువుల సంఖ్య తదితర వివ రాలను సేకరిస్తారు.
ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటినే శాశ్వత చిరునామాగా పరిగణిస్తారు. కుటుంబంలో ఎవరైనా వ్యక్తి చనిపోతే అదే కుటుంబంలోని మరొకరు దాన్ని ధ్రువీకరిస్తూ వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కులగణనకు సిద్ధంగా ఉండాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ అడిషనల్ డైరెక్టర్ ధ్యానచంద్ర అధికారులకు సూచించారు.
ఇప్పటికే శ్రీకాకుళం, డా. అంబేడ్కర్ కోనసీమ, ఎన్టీఆర్, పొట్టిశ్రీరాములు నెల్లూరు, వైయస్ఆర్ జిల్లాల్లో ఎంపిక చేసిన సచివాలయాల్లో జరుగుతున్న 'కులగణన ప్రయోగా త్మక సర్వే'ను సమీక్షించారు. ప్రాథమికంగా ఎదురైన సమస్యల పరిష్కారంపై అధికారులతో చర్చిం చారు. సర్వే కోసం రూపొందించిన యాప్‌లో కొన్ని మార్పులు, చేర్పులు చేయాలని సూచనలు చేశారు. ఈ-కేవైసీ నమోదులో ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారి గుర్తింపు కోసం ఫేషియల్, ఓటీపీ, వేలిముద్ర తదితర సౌకర్యాలు కల్పించారు.