Srisailam Devotees Rush : శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు, 5 కి.మీ మేర ట్రాఫిక్ జామ్-రంగంలోకి పోలీసులు
24 November 2024, 21:26 IST
Srisailam Devotees Rush : శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు, రేపు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైలం మల్లన్న దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. దీంతో శ్రీశైలం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
శ్రీశైలం ఆలయానికి పోటెత్తిన భక్తులు, 5 కి.మీ మేర ట్రాఫిక్ జామ్-రంగంలోకి పోలీసులు
వరుసగా రెండు రోజుల సెలవులు, రేపు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలం భ్రమరాంబిక మల్లిఖార్జునస్వామి దర్శించుకోవడానికి ఏపీ, తెలంగాణ సహా పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భారీగా భక్తులు తరలిరావడంతో శ్రీశైలం మార్గంలో దాదాపు 5కి.మీల మేర ట్రాఫిక్ జామ్ అయింది. శ్రీశైలం టోల్ గేట్ నుంచి సాక్షి గణపతి, హటకేశ్వరం ముఖ ద్వారం వరకు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్
శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ నెలకొంది. దీంతో ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. భక్తుల రద్దీ పెరగటంతో శ్రీశైలం మార్గంలో కార్లు, బస్సులు ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. సుమారు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కార్తీక మాసంలో చివరి సోమవారం కావటంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ముఖద్వారం నుంచి శ్రీశైలం ఆలయానికి వెళ్లడానికి సుమారుగా రెండు గంటల సమయం పడుతుందని భక్తులు అంటున్నారు. రేపటి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పా్ట్లు చేశారు. శ్రీశైలంలో సామూహిక అభిషేకాలు, గర్భాలయం అభిషేకాలను పూర్తిగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
కార్తీక మాసంలో శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరుతున్నారు. పాతాళగంగలో స్నానమాచరించి.. స్వామి, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఆలయ పరిసరాల్లో కార్తీక దీపారాధన చేసేందుకు శ్రీశైలం దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్తర మాఢవీధి, దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద కార్తీక దీపాలు వెలిగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
డిసెంబర్ 2న పోలి పాడ్యమి
కార్తీకమాసం చివరిలో పోలి పాడ్యమి జరుపుకుంటారు. ఈ ఏడాది డిసెంబరు 1వ తేదీతో కార్తీకమాసం పూర్తి కానుంది. డిసెంబర్ 2న పోలి పాడ్యమి పూజ చేస్తారు. అనంతరం మార్గశిర మాసం మొదలవుతుంది. పోలి పాడ్యమి రోజున...తెల్లవారుజామున నదులు, చెరువుల్లో దీపాలని వదిలితే మంచిది అంటారు. కార్తీక మాసం చివరి రోజున శివాలయంలో పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహిస్తారు. పోలి పాడ్యమి నాడు 30 ఒత్తులు దీపాలను వెలిగించడం వలన మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. 30 ఒత్తులుని వెలిగిస్తే ఈ నెల అంతా దీపం పెట్టినంత పుణ్యం కలుగుతుందని పండితులు చెబుతారు. అలాగే దీపదానం చేస్తే మంచి ఫలితం వస్తుందంటారు.