Tirumala : బ్రేక్ దర్శనం భక్తులకు 'SMS పే సిస్టమ్' - తిరుమలలో సరికొత్త సేవలు
10 February 2024, 8:17 IST
- Tirumala Latest News : బ్రేక్ దర్శనం టికెట్ల జారీలో కీలక మార్పులు చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.నూతనంగా ఎస్ఎంఎస్ పే సిస్టమ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది.
తిరుమల భక్తులకు అలర్ట్
Tirumala Tirupati Devasthanams News: తిరుమల శ్రీవారి దర్శనం కోసం విచక్షణ కోటాలో కేటాయించే బ్రేక్ దర్శనం టికెట్లు పొందే భక్తుల సౌకర్యార్థం టీటీడీ నూతనంగా ఎస్ఎంఎస్ పే సిస్టమ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి ఈ విధానాన్ని అమలుచేస్తోంది. ఇందుకు సంబంధించి ప్రకటన విడుదల చేసింది తిరుమల తిరుపతి దేవస్థానం.
నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యుపిఐ లేదా క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్ లో సొమ్ము చెల్లించి ఎంబీసీ-34 కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా బ్రేక్ దర్శన టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్పటికే ఆఫ్‌లైన్‌లో సిఆర్ఓలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవాటికెట్లు పొందుతున్న భక్తులకు ఈ విధానం అమలు చేస్తున్నారు.
సీల్డ్ టెండర్ల ఆహ్వానం
TTD Tenders: తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో నెయ్యి, నూనె, జీడిపప్పు ప్యాకింగ్‌కు వినియోగించిన ఖాళి టిన్‌లు రేటు కాంట్రాక్టు కింద సీల్డ్ టెండర్లను టీటీడీ ఆహ్వానిస్తోంది. టెండర్ పొందిన వారు డిసెంబరు – 2024 వరకు టీటీడీ వినియోగించిన ఖాళి టిన్‌లు సేకరించవచ్చు. తిరుపతిలోని హరేకృష్ణ రోడ్డులో గల మార్కెటింగ్ (వేలం) కార్యాలయంలో సీల్డ్ టెండర్లు ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు అందజేయవలెను. ఇతర వివరాలకు మార్కెటింగ్ (వేలం) కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో సంప్రదించాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
16న తిరుమలలో రథసప్తమి
Radha Sapthami in Tirumala: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీన తిరుమలలో రథసప్తమి(Radha Sapthami) పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ పరమ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జన్మించాడని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్రసాదించాడని వేదాల ద్వారా తెలుస్తోంది. రథ సప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ సంఖ్యలో తిరుమలకు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. రథసప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు.
వాహనసేవల వివరాలు :
తెల్లవారుజామున 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోదయం ఉదయం 6.40 గంటలకు) – సూర్యప్రభ వాహనం
ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం
ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం
మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం
ఈ పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం రద్దు చేసింది. కాగా… సుప్రబాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు.