Ratha Sapthami at Tirumala : తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు - ఈవో కీలక ఆదేశాలు-ttd arrangements for the convenience of devotees coming for ratha sapthami at tirumala on february 16 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ratha Sapthami At Tirumala : తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు - ఈవో కీలక ఆదేశాలు

Ratha Sapthami at Tirumala : తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు - ఈవో కీలక ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 03, 2024 08:52 AM IST

Ratha Sapthami at Tirumala 2024: రథసప్తమి వేడుకకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు.

రథసప్తమి వేడుకలపై ఈవో సమీక్ష
రథసప్తమి వేడుకలపై ఈవో సమీక్ష (TTD)

Ratha Sapthami at Tirumala 2024: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీ రథసప్తమి పర్వదినాన్ని నిర్వహించనుంది టీటీడీ(TTD). ఈ వేడుకకు విచ్చేసే వేలది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు స‌మ‌న్వ‌యంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ అధికారులు, పోలీస్ అధికారుల‌తో శుక్ర‌వారం ఈవో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ…. రథసప్తమికి సంబంధించిన ఏర్పాట్లపై అన్నప్రసాదం, ఆరోగ్యశాఖ, ఇంజనీరింగ్‌ విభాగం, ఆలయం, ఉద్యానవనశాఖ, శ్రీవారి సేవ, భద్రతా విభాగం, ఎస్వీబీసి, ధర్మప్రచారపరిషత్‌ తదితర విభాగాధిపతులకు పలు సూచనలు చేశారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు తిరుమల(Tirumala)లో ఏడు వాహనాలపై స్వామివారి ఉరేగింపును తిలకించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వివిధ విభాగాధిపతులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

రథసప్తమి(Ratha Sapthami 2024) సందర్భంగా తిరుమలకు విచ్చేసే భ‌క్తులు చ‌లికి, ఎండ‌కు ఇబ్బంది ప‌డ‌కుండా మాడ వీధుల్లో తాత్కాలిక‌ షెడ్లు ఏర్పాటు చేయ‌ల‌న్నారు. భ‌క్తుల సౌక‌ర్యార్థం 3.5 ల‌క్ష‌ల ల‌డ్డూలు బ‌ఫ‌ర్ స్టాక్ ఉంచుకోవాల‌ని పోటు అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న భ‌క్తులు తిల‌కించేందుకు వీలుగా ఎస్వీబీసీలో వాహ‌న‌సేవ‌ల‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తామ‌ని తెలిపారు. వాహ‌న‌సేవ‌ల ఎదుట ఆక‌ట్టుకునేలా సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేయాల‌న్నారు. టీటీడీ నిఘా, భ‌ద్ర‌తా విభాగం అధికారులు పోలీసుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని మెరుగైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

అన్నప్రసాదం అధికారులు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలలో వాహనాలను తిలకించడానికి వేచి ఉండే భక్తులకు తాగునీరు, మజ్జిగ, సాంబారు అన్నం, పెరుగు అన్నం, పులిహోర, పొంగలి వంటి అన్న ప్రసాదాలను నిరంతరాయంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. భక్తుల దాహార్తిని తీర్చడానికి శ్రీవారి సేవకుల సహకారంతో ఎప్పటికప్పుడు తాగునీరు అందించాలని ఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. మెరుగైన పారిశుద్ధ్య చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. అత్యవసర సేవలందించడానికి వీలుగా వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్సు వాహనాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని ఆయన వైద్యాధికారులకు సూచించారు. మాడవీధులలో భక్తులకు అందుతున్న సౌకర్యాలను సీనియర్‌ అధికారులు పర్యవేక్షిస్తారన్నారు. రథసప్తమి సందర్భంగా వివిధ రకాల ఫలపుష్పాలతో, పచ్చని తోరణాలతో, అందమైన అరటి చెట్లతో పందిళ్ళను ఏర్పాటు చేసి తిరుమాడ వీధులను అందంగా అలంకరించాలని ఉద్యానవన విభాగం అధికారులను ఈవో ఆదేశించారు.

ఆర్జిత సేవలు రద్దు….

రథసప్తమిని పురస్కరించుకొని ఆర్జిత సేవలను రద్దు చేసినట్టు తెలిపారు. ఆ రోజున ఎటువంటి ప్రత్యేక దర్శనాలు (విఐపి బ్రేక్‌, వయోవృద్ధులు, వికలాంగులు మరియు చంటిపిల్లల తల్లిదండ్రులకు) ఉండవని చెప్పారు. అదే విధంగా ఫిబ్ర‌వ‌రి 14వ తేదీ తెల్ల‌వారు జామున 12 గంట‌ల నుండి 16వ తేదీ అర్థ‌రాత్రి 12 గంట‌ల వ‌ర‌కు టిబి, ఎంబిసి – 34 కౌంట‌ర్ల‌ను మూసివేసి, సిఆర్‌వో, శ్రీ ప‌ద్మావ‌తి విశ్రాంతి భ‌వ‌నాల‌ స‌మూదాయంలో మాత్ర‌మే గ‌దులు కేటాయించాల‌న్నారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని టీటీడీ భద్రతా విభాగం మరియు పోలీసు అధికారులు స‌మ‌న్వ‌యంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఈవో ఆదేశించారు.

వాహనసేవల వివరాలు :

తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.40 గంట‌ల‌కు) – సూర్యప్రభ వాహనం.

ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం.

ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం.

మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం.

మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం.

సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం.

సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం.

రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం.

Whats_app_banner

సంబంధిత కథనం