TTD Budget : టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.5122 కోట్లు, అర్చకుల జీతాలు పెంపు-బోర్డు కీలక నిర్ణయాలివే!-tirumala news in telugu ttd board key decisions approved annual budget estimation ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Budget : టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.5122 కోట్లు, అర్చకుల జీతాలు పెంపు-బోర్డు కీలక నిర్ణయాలివే!

TTD Budget : టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.5122 కోట్లు, అర్చకుల జీతాలు పెంపు-బోర్డు కీలక నిర్ణయాలివే!

Bandaru Satyaprasad HT Telugu
Jan 29, 2024 04:05 PM IST

TTD Budget : టీటీడీ వార్షిక బడ్జెట్ అంచనాలకు పాలకమండలి ఆమోదం తెలిపింది. అర్చకుల జీతాలు, వేద పండితుల పింఛన్లు పెంపు వంటి కీలక నిర్ణయాలకు పాలకమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

టీటీడీ
టీటీడీ

TTD Budget : టీటీడీ వార్షిక బడ్జెట్ (2024-25) కు పాలక మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ పాలకమండలి నిర్ణయాలను ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం వెల్లడించారు. టీటీడీ వార్షిక బడ్జెట్ ను రూ.5,141.74 కోట్ల అంచనాలతో ప్రవేశపెట్టగా, రూ.5,122.80 కోట్ల బడ్జెట్‌ను పాలకమండలి ఆమోదించిందన్నారు. ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీవారి పాదాల వద్ద ఉంచిన మంగళ సూత్రాలను(బంగారు డాల్లర్లు) భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. పోటు విభాగంలోని 70 మంది ఉద్యోగులను స్కిల్డ్ లేబర్ గా గుర్తించి జీతం రూ.15 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దేవస్థానంలో ఆధ్వర్యంలోని ఆరు వేద పాఠశాలలో పనిచేస్తున్న 51 మంది ఉపాధ్యాయుల జీతాలు రూ.35 వేల నుంచి రూ.54 వేలకు పెంచుతున్నట్లు పాలకమండలి ప్రకటించింది.

వేదపండితుల పింఛన్ పెంపు

టీటీడీ ఆలయాలలో విధులు నిర్వర్తిస్తున్న అర్చకుల జీతాలు పెంచుతున్నట్లు పాలకమండలి పేర్కొంది. దీంతో పాటు 56 వేదపారాయణదారుల పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. వేదపండితుల పింఛన్ రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతున్నట్లు టీటీడీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి తెలిపారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు సహకరించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ పాలకమండలి తీర్మానం చేసింది. వచ్చే 3 నుంచి 5వ తేదీ వరకు తిరుమలలో ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. ఈ సదస్సుకు 57 మంది మఠాధిపతులు, పిఠాధిపతులు హాజరుకానున్నారని తెలిపారు.

టీటీడీ బడ్జెట్ కేటాయింపులు

టీటీడీ పాలకమండలి బడ్జెట్ లో ఇంజినీరింగ్ విభాగానికి రూ.350 కోట్లు కేటాయించింది. హిందూ ధర్మప్రచార, అనుబంధ ప్రాజెక్టులకు రూ.108.50 కోట్లు, టీటీడీ విద్యాసంస్థలు, వివిధ వర్సిటీలకు గ్రాంట్స్ రూ.173.31 కోట్లు కేటాయించింది. వివిధ సంస్థలకు గ్రాంట్స్ రూపంలో రూ.113.50 కోట్లు, పారిశుద్ధ్య విభాగానికి రూ.261.07 కోట్లు, నిఘా, భద్రతా విభాగానికి రూ.149.99 కోట్లు, వైద్య విభాగానికి రూ.241.07 కోట్లు కేటాయించింది.

స్విమ్స్ అస్పత్రిలో 300 పడకల నుంచి 1200 పడకల పెంపునకు రూ.148 కోట్లతో టెండర్ ప్రకటనకు టీటీడీ ఆమోదం తెలిపింది. రూ.2.5 కోట్లతో సప్తగిరి సత్రాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఎస్ఎంసీతో పాటు పలు కాటేజీల ఆధునీకరణకు రూ.10 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. టీటీడీలో ఒరాకిల్ ఫ్యూషన్ క్లౌడ్ సాఫ్ట్‌వేర్ వినియోగానికి పాలక మండలి ఆమోదం తెలిపింది. అన్నమయ్య భవన్ ఆధునీకరణకు రూ.1.47 కోట్లు కేటాయించింది.

టీటీడీ ఆదాయ అంచనాలు

అయితే శ్రీవారి హుండీ కానుకల ద్వారా రూ. 1,611 కోట్లు వస్తాయని టీటీడీ అంచనా వేసింది. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ రూ.1,167 కోట్లు, ప్రసాదం విక్రయాల ద్వారా రూ.600 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేసింది. కల్యాణకట్ట రసీదుల ద్వారా రూ.151.50 కోట్లు, గదులు, కల్యాణమండపం ద్వారా రూ.147 కోట్లు, శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవ టికెట్ల విక్రయాల ద్వారా రూ.448 కోట్లు ఆదాయం వస్తుందని పాలకమండలి అంచనా వేసింది. పుస్తకాల విక్రయాల ద్వారా రూ.35.25 కోట్లు,అగర్బత్తి, టోల్ గేట్, విద్య కళాశాల ద్వారా రూ.74.50 కోట్లు ఆదాయం వస్తుందని బోర్డు భావిస్తోంది.

Whats_app_banner