Tirumala : ఫిబ్రవరి 16న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి - ఒకేరోజు శ్రీవారికి ఏడు వాహన సేవలు-megareligious event ratha saptami at tirumala on 16 february 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala : ఫిబ్రవరి 16న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి - ఒకేరోజు శ్రీవారికి ఏడు వాహన సేవలు

Tirumala : ఫిబ్రవరి 16న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి - ఒకేరోజు శ్రీవారికి ఏడు వాహన సేవలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Jan 31, 2024 11:03 AM IST

Radha Sapthami 2024 News: రథసప్తమి వేడుకలకు సంబంధించి టీటీడీ ప్రకటన విడుదల చేసింది. ఫిబ్రవరి 16వ తేదీన రథసప్తమి పర్వదినం నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ వేడుక వేళ 7 వాహనాలపై స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించనున్నారు.

తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి
తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి (TTD)

Ratha Saptami at Tirumala 2024: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్ర‌వరి 16వ తేదీన తిరుమ‌లలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వివరాలను వెల్లడించింది.

పవిత్రమైన మాఘ మాసంలో శుక్ల పక్ష సప్తమి తిథిని రథ సప్తమి లేదా మాఘ సప్తమి అని పిలుస్తారు. ఈ ప‌ర‌మ పవిత్రమైన రోజున శ్రీ సూర్యదేవుడు జ‌న్మించాడ‌ని, ప్రపంచం మొత్తానికి జ్ఞానం ప్ర‌సాదించాడ‌ని వేదాల ద్వారా తెలుస్తోంది. రథ‌సప్తమి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని భారీ సంఖ్యలో తిరుమ‌ల‌కు విచ్చేసే భక్తుల కోసం టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ర‌థ‌సప్తమిని మినీ బ్రహ్మోత్సవాలు అని కూడా అంటారు.

వాహనసేవల వివరాలు :

తెల్లవారుజామున‌ 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.40 గంట‌ల‌కు) – సూర్యప్రభ వాహనం

ఉదయం 9 నుంచి 10 గంటల వరకు – చిన్నశేష వాహనం

ఉదయం 11 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు – గరుడ వాహనం

మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు – హనుమంత వాహనం

మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు – చక్రస్నానం

సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు – కల్పవృక్ష వాహనం

సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు – సర్వభూపాల వాహనం

రాత్రి 8 నుంచి 9 గంటల వరకు – చంద్రప్రభ వాహనం

ఆర్జిత సేవలు రద్దు…

రథసప్తమని పర్వదినం కారణంగా ఫిబ్రవరి 16వ తేదీన ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది. కాగా, సుప్రబాతం, తోమాల, అర్చన ఏకాంతంలో నిర్వహిస్తారు.

విశేష ప‌ర్వ‌దినాలు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఫిబ్ర‌వ‌రి నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ప‌ర్వ‌దినాలను వెల్లడించింది టీటీడీ. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి…

– ఫిబ్ర‌వ‌రి 9న శ్రీ పురంద‌ర‌దాసుల ఆరాధ‌నోత్స‌వం.

– ఫిబ్ర‌వ‌రి 10న తిరుక‌చ్చినంబి ఉత్స‌వారంభం.

– ఫిబ్ర‌వ‌రి 14న వ‌సంత‌పంచ‌మి.

– ఫిబ్ర‌వ‌రి 16న ర‌థ‌స‌ప్త‌మి.

– ఫిబ్ర‌వ‌రి 19న తిరుక‌చ్చినంబి శాత్తుమొర‌.

– ఫిబ్ర‌వ‌రి 20న భీష్మ ఏకాద‌శి.

– ఫిబ్ర‌వ‌రి 21న శ్రీ కుల‌శేఖ‌రాళ్వార్ వ‌ర్ష తిరున‌క్ష‌త్రం.

– ఫిబ్ర‌వ‌రి 24న కుమార‌ధార తీర్థ‌ముక్కోటి, మాఘ పౌర్ణ‌మి గ‌రుడ‌సేవ‌.

తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో ఫిబ్రవరి నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఫిబ్రవరిలో 3, 10, 17, 24వ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6 గంటలకు శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్లకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఊంజల్‌సేవ, తిరువీధి ఉత్సవం, ఆస్థానం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 9న అమావాస్య సందర్భంగా ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం చేపడతారు. రాత్రి 7 గంటలకు హనుమంత వాహనసేవ జరుగనుంది. ఫిబ్రవరి 21వ తేదీ పునర్వసు నక్షత్రం సందర్భంగా ఉదయం 11 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణం జరుగనుంది. సాయంత్రం 5.30 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల గుండా శ్రీరామచంద్ర పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. సాయంత్రం 5.30 గంటలకు ఊంజల్‌సేవ, ఆస్థానం నిర్వహిస్తారు. ఫిబ్రవరి 25న పౌర్ణమి సందర్భంగా కూపుచంద్ర పేట ఉత్సవం నిర్వహించనున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం