Ayodhya Free Darshan : తెలుగు రాష్ట్రాల నుంచి 5 లక్షల మందికి ఫ్రీగా అయోధ్య దర్శనాలు, ఎలాగంటే?
Ayodhya Free Darshan : హైదరాబాద్ లో అయోధ్య రామమందిరం విజయ దివస్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నుంచి 5 లక్షల మందికి అయోధ్య ఉచిత దర్శనాలు కల్పిస్తామని కృష్ణ ధర్మ పరిషత్ ధార్మిక సంస్థ ప్రకటించింది.
Ayodhya Free Darshan : రామభక్తుల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సోమవారం అయోధ్యలోని రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ 'ప్రాణప్రతిష్ఠ' జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠను దేశం మొత్తం పండుగలా జరుపుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అభిజీత్ లగ్నంలో అయోధ్య ఆలయంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని వాడవాడలా రామ భక్తులు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ నక్లెస్ రోడ్డులో కృష్ణ ధర్మ పరిషత్ వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య బాలక్ రామ్ ను దర్శించుకోవాలనుకునే భక్తుల గుడ్ న్యూస్ చెప్పింది. అయిదు లక్షల మందికి ఉచితంగా అయోధ్య రామమందిరం దర్శనం కల్పిస్తామని ప్రకటించింది.
5 లక్షల మందికి ఉచిత దర్శనాలు
అయోధ్యలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కన్నుల పండుగగా జరిగింది. రామమందిరం ప్రారంభోత్సవం వేళ కృష్ణ ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో విజయ్ దివస్ ఉత్సవాలు నిర్వహించారు. కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకుడు అభిషేక్ గౌడ్ అయోధ్య రామ మందిరం కల సాకారం కావటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శతాబ్దాల కాలంగా కోట్లాది హిందువులు ఈ మధుర క్షణాల కోసం వేచి చూశారన్నారు. భారత్ లో నేటి నుంచి కొత్త కాల చక్రం మొదలైందని, అన్ని మతాలవారు సామరస్యంగా జీవించాలని ఆకాంక్షించారు. మత సామరస్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అయితే కృష్ణ ధర్మ పరిషత్ తెలుగు రాష్ట్రాల నుంచి అయిదు లక్షల మందికి ఉచితంగా అయోధ్య రామమందిరం దర్శనం కల్పించాలని నిర్ణయించిందన్నారు. ఆసక్తి కలిగిన కృష్ణ ధర్మ పరిషత్ వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.
రాముడిని తిరస్కరించిన వారు రాజకీయంగా ముందుకెళ్లరు - ఎంపీ లక్ష్మణ్
హైదరాబాద్ లో కృష్ణ ధర్మ పరిషత్ నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ ఎంపీ కె.లక్షణ్ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో మల్కాజ్ గిరి లోక్ సభ సీటును బీజేపీకి అంకితమైన రామ్ యాదవ్ కు కేటాయించాలని ఇవ్వాలని కృష్ణ ధర్మ పరిషత్ వ్యవస్థాపకుడు అభిషేక్ గౌడ్ కోరారు. తెలంగాణలో బీజేపీకి అనుకూల వాతావరణం ఉందన్నారు. యువతకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మోదీ నాయకత్వం పట్ల అన్ని వర్గాల ప్రజల్లో ఆదరణ పెరుగుతుందన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లు గెలిచిందని, ప్రస్తుత వాతవరణం చూస్తేంటే బీజేపీకి సీట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ మాట్లాడుతూ.... కృష్ణ ధర్మ పరిషత్ కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. రాముడి కార్యాన్ని తిరస్కరించిన వారిని ప్రజలు తిరస్కరిస్తారన్నారు. రాముడిని తిరస్కరించిన వారు రాజకీయంగా ముందుకు వెళ్లలేరన్నారు. లౌకికవాదం ముసుగులో కొన్ని పార్టీలు హిందువులను అగౌరపరుస్తున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.