తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirumala Laddu Row : కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు.. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ

Tirumala Laddu Row : కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు.. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ

29 September 2024, 15:34 IST

google News
    • Tirumala Laddu Row : తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై.. సిట్‌ విచారణ కొనసాగుతోంది. తాజాగా.. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరు భేటీ అయ్యారు. అవసరమైతే మరిన్ని బృందాలు ఏర్పాటు చేస్తామని సిట్ చీఫ్ స్పష్టం చేశారు.
తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ దర్యాప్తు
తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ దర్యాప్తు

తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ దర్యాప్తు

టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ చీఫ్ త్రిపాఠి భేటీ అయ్యారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై వివరాలు తెలుసుకున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈవోతో భేటీ అయిన సిట్ చీఫ్.. కేసుతో సంబంధం ఉన్న అన్ని ప్రాంతాలకు వెళతామని స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి కేసులో ప్రతి అంశాన్ని విచారిస్తున్నామని.. విచారణకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రెడీ చేశామని చెప్పారు. అవసరమైతే మరిన్ని బృందాలు ఏర్పాటు చేస్తామని త్రిపాఠి స్పష్టం చేశారు.

'తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీపై లోతైన విచారణ చేస్తాం. తిరుపతి తూర్పు పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసు.. సిట్‌కు బదిలీ అయింది. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్‌ డెయిరీపై విచారణ చేస్తాం. సిట్‌ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తాం. నివేదిక సమర్పించడానికి కాలపరిమితి లేదు' అని సిట్ చీఫ్ త్రిపాఠి వివరించారు.

కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్‌ అధికారులు పలు ప్రాంతాలకు వెళ్లి విచారణ చేపట్టనున్నారు. దుండిగల్‌లో ఏఆర్‌ డెయిరీ ఫుడ్స్‌ సంస్థను పరిశీలించనున్నారు. తమిళనాడు రాష్ట్రానికి కూడా వెళ్లనున్నారు. తిరుమలలో లడ్డూ విక్రయ కేంద్రాలను కూడా పరిశీలించనున్నారని తెలుస్తోంది. లడ్డూ తయారీ ముడి సరుకులపైనా సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు పరిశీలించనున్నారు.

కోటి రూపాయల సేవా టికెట్..

కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి క్షణకాల దర్శనం కోసం భక్తులు వేల కిలో మీటర్లు ప్రయాణించి, గంటల పాటు క్యూలైన్లలో వేచిచూస్తారు. ఏడాదిలో ఒక్కసారైనా తిరుమలకు వెళ్లి ఆ స్వామిని దర్శించుకోవాలని లక్షల మంది భక్తులు పరితపిస్తుంటారు. అలాంటి శ్రీనివాసుడిని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో ఉండి సేవలను వీక్షిస్తూ.. ఏడు కొండల స్వామి నిజరూప దర్శనం చేసుకునే భాగ్యం లభిస్తే అంతకన్నా ఏంకావాలి.

దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు నిత్యం తిరుమల కొండకు వస్తుంటారు. వారి ఆర్థిక పరిస్థితులను బట్టి దర్శన టికెట్లు కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే.. శ్రీవారిని రోజంతా దర్శించుకునేందుకు ఓ ప్రత్యేకమైన టికెట్‌ను టీటీడీ అందుబాటులో ఉంచింది. ఈ టికెట్ ధర అక్షరాలా కోటి రూపాయలు కావడం గమనార్హం.

తదుపరి వ్యాసం