Tirumala Laddu Row SIT : తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ ఏర్పాటు, చీఫ్ గా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నియామకం
Tirumala Laddu Row SIT : తిరుమల లడ్డూ కల్తీ ఘటనపై విచారణకు ఏపీ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్ చీఫ్ గా నియమించింది. సిట్‌లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజు ఉన్నారు.
Tirumala Laddu Row SIT : తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఈ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ వివాదంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని నియమించింది. సిట్‌లో విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజుతోపాటు మరికొందరు డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు ఉన్నారు.
తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు పదార్థాలు ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిందన్నారు. ఈ ఘటనపై సిట్ తో విచారణ జరిపిస్తామని తెలిపారు. తాజాగా సిట్ ను నియమించారు.
గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు ఎన్‌డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో శ్రీవారి భక్తులు, హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన నిజనిజాలు నిగ్గుతేల్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. తిరుమల సంప్రోక్షణకు టీటీడీ సోమవారం శాంతి హోమం నిర్వహించింది. ఆనంద నిలయంతో పాటు మాడ వీధుల్లో తిరుమల పూజారులు సంప్రోక్షణ చేశారు.
ఏఆర్ డెయిరీకి కేంద్రం నోటీసులు
తిరుపతి లడ్డూ కల్తీ ఆరోపణల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నాసిరకం నెయ్యిని సరఫరా చేసిన తమిళనాడుకు చెందిన ఓ సంస్థకు ఎఫ్ఎస్ఎస్ఏఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఫుడ్ ప్రొడక్ట్స్ స్టాండర్డ్స్ అండ్ ఫుడ్ అడిటివ్స్) రెగ్యులేషన్, 2011 నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కలిగి ఉన్న సెంట్రల్ లైసెన్స్ ఎందుకు సస్పెండ్ చేయకూడదని ఫుడ్ రెగ్యులేటర్ ఆ నోటీసులో ప్రశ్నించింది.
గత నాలుగేళ్లుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్న వారిలో దిండిగల్ లోని ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒకటని మంగళగిరి (ఆంధ్రప్రదేశ్) లోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ నుంచి తమకు సమాచారం అందిందని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. టీటీడీకి సరఫరా చేసిన శాంపిళ్లను పరీక్షల నిమిత్తం గుజరాత్ రాష్ట్రం ఆనంద్‌లోని ఎన్డీడీబీ ల్యాబ్‌కు పంపింది.
సంబంధిత కథనం