AP Sand Policy 2024 : ఇసుకాసురులు మళ్లీ మేసేస్తున్నారు.. ట్రాక్టర్లతో దిగుమతి.. టిప్పర్లతో ఎగుమతి!
21 October 2024, 11:44 IST
- AP Sand Policy 2024 : ప్రజలు తమ అవసరాలకు సమీపంలోని వాగుల్లో ఇసుకను తీసుకెళ్లొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఎడ్లబండ్లు, ట్రాక్టర్ల ద్వారా కొద్ది మొత్తంలో ఇసుక తీసుకెళ్తున్నారు. ఇదే అదనుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ట్రాక్టర్ల ద్వారా దిగుమతి చేసుకొని.. టిప్పర్ల ద్వారా ఎగుమతి చేస్తున్నారు.
వాగులో ఇసుక తవ్వుతున్న దృశ్యం
ఆంధ్రప్రదేశ్ నూతన మద్యం పాలసీ ఇసుకాసురులకు కాసుల వర్షం కురిపిస్తోంది. విధానంలోని లోపాలను అసరాగా చేసుకున్న అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పేదలను అడ్డుపెట్టుకొని జేబులు నింపుకుంటున్నారు. వాగుల నుంచి ఇసుకను ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా గ్రామాల్లోకి తీసుకొచ్చి.. అక్కడి నుంచి టిప్పర్ల ద్వారా పట్టణాలు, నగరాలకు ఎగుమతి చేస్తున్నారు.
కృష్ణా జిల్లాలో ఉన్న బుడమేరు అక్రమార్కులకు వరంగా మారింది. ఇటీవల వరదలు రావడంతో బుడమేరులో ఇసుక మేటలు గట్టిగా ఉన్నాయి. బుడమేరుకు అటు, అటు ఉన్న గ్రామాల్లోని కొందరు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను తీసుకొస్తున్నారు. గ్రామాల్లోని ఒకచోట దిగుమతి చేస్తున్నారు. ఇసుకాసురులు టిప్పర్లతో అక్కడ వాలిపోతున్నారు. టిప్పర్ల ద్వారా ఎగుమతి చేస్తున్నారు.
మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలం చిన నందిగామ సమీపంలో నాణ్యమైన ఇసుక లభ్యమవుతోంది. అక్కడ కొంతమంది కుమ్మక్కై.. వాగులో ఇసుక తవ్వుతున్నారు. అక్కడినుంచి గణపవరానికి తరలిస్తున్నారు. గణపవరం గట్టు పక్కనున్న ప్రాంతంలో డింపింగ్ చేస్తున్నారు. ట్రాక్టర్లలో తీసుకొచ్చిన ఇసుకను.. గుట్టలు గుట్టలుగా పోశారు. దాదాపు కిలోమీటర్ మేర ఇసుకను నిల్వ చేశారు.
ఇక సాయంత్రం అవ్వగానే అక్కడికి టిప్పర్లు వస్తున్నాయి. యంత్రాల సాయంతో.. అక్కడ నిల్వ చేసిన ఇసుకను టిప్పర్లలో లోడ్ చేస్తున్నారు. 20 టన్నుల టిప్పర్లలో ఇసుకను నింపి.. అక్కడి నుంచి విజయవాడ, ఏలూరు, నూజివీడు, ఆగిరిపల్లి తరలిస్తున్నారు. ఒక్కో టిప్పర్ ఇసుకకు రూ.20 వేలు వసూలు చేస్తున్నారు. అన్ని ఖర్చులు పోనూ.. ఒక్కో టిప్పర్‌కు రూ.10 వేల వరకు లాభాన్ని జేబులో వేసుకుంటున్నారు.
ఈ దందాలో అధికార పార్టీ నాయకులు ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా సీఎం చంద్రబాబు చెప్పినా.. ఇసుకాసురులు లెక్కచేయడం లేదు. ఇటు ఇసుక స్మగ్లింగ్‌ను అరికట్టాల్సిన అధికారులు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. కేవలం ప్రజలు తమ అవసరాలకే ఇసుకను తెచ్చుకోవాలి. కానీ.. కొందరు గ్రామాల్లో డబ్బుల కోసం ఇలా ఇసుకను అమ్మేస్తున్నారు. ఇదే జీవనోపాధిగా ఎన్నో కుటుంబాలు ఇసుకపై ఆధారపడి జీవిస్తున్నాయి.