Sachivalaya Staff Biometric : మూడుసార్లు బయోమెట్రిక్ వేయాల్సిందే, లేకపోతే వేతనం కట్- ఆందోళనలో సచివాలయ ఉద్యోగులు
02 December 2024, 19:53 IST
Sachivalaya Staff Biometric : సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగులంతా రోజుకు మూడు సార్లు బయోమెట్రిక్ వేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
మూడుసార్లు బయోమెట్రిక్ వేయాల్సిందే, లేకపోతే వేతనం కట్- ఆందోళనలో సచివాలయ ఉద్యోగులు
సచివాలయ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. సచివాలయ ఉద్యోగులంతా రోజుకు మూడు సార్లు బయోమెట్రిక్ వేయాల్సిందేనని స్పష్టం చేసింది. ఉదయం సచివాలయానికి వచ్చినప్పుడు, మళ్లీ సాయంత్రం సచివాలయం నుంచి వెళ్లినప్పుడు తప్పనిసరిగా బయోమెట్రిక్ వేయాలి. కనీసం రెండు సార్లు వేయకపోతే ఆ రోజు వేతనం కట్ అవుతుంది. ఈ విధానాన్ని సచివాలయ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏపీ రాష్ట్ర సచివాలయ శాఖ ఉన్నతాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక రోజు ఉదయం నిర్ణీత సమయంలోనూ, సాయంత్రం ఉద్యోగ పనులు ముగించుకుని వెళ్లే సమయంలో బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఉదయం వేసి, సాయంత్రం బయో మెట్రిక్ వేయడం మరిచిపోతే ఆ రోజు మొత్తం వేతనం కట్ చేస్తారు. మధ్యాహ్నం కూడా బయోమెట్రిక్ వేయాలని సచివాలయశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ రకమైన విధానంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
ఎందుకంటే సాయంత్రం ఇంటికి వెళ్లిన సమయంలో బయోమెట్రిక్ పని చేయకపోతే ఉద్యోగులు బయోమెట్రిక్ వేయలేరు. అలాగే మధ్యాహ్నం సర్వేయర్, టెక్నికల్ అసిస్టెంట్ ఇతర ఉద్యోగులు ఫీల్డ్‌కు వెళ్లి రాత్రి అవుతుందని అటునుంచి అటే ఇంటికి వెళ్లలేరు. తప్పనిసరిగా సచివాలయానికి వచ్చి బయోమెట్రిక్ వేసే ఇంటికి వెళ్లాలి. కొంత మంది మరిచిపోవచ్చు. ఇలా చాలా సమస్యలు ఉన్నాయని ఉద్యోగులు చెబుతున్నారు. ఇలాంటి విధానం రాష్ట్రంలోని ఇతర ఉద్యోగులకు ఎందుకు లేదు? కేవలం సచివాలయ ఉద్యోగులపైనే ఎందుకు ఈ కక్ష అంటున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల అందరినీ ప్రభుత్వం సమాన దృష్టితో చూడాలని పేర్కొంటున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగులకు మాత్రమే ఇలా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నారు. మిగతా ప్రభుత్వ ఉద్యోగుల వలె ఎఫ్ఆర్ఎస్ యాప్ ద్వారా హాజరు నమోదు చేసే అవకాశం కల్పించాలని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు.
మరోవైపు సచివాలయ ఉద్యోగుల హాజరు సైకిల్ కూడా నెలలో 1 నుంచి ఆఖరు వరకు మార్చారు. ఈ విధానం నవంబర్ 1 నుంచి అమలులో తీసుకొచ్చారు. 2021 ఫిబ్రవరి 4 విడుదల చేసిన జీవోఎంఎస్ నెంబర్ 1 ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో నెలలో 23 తేదీ నుంచి నుంచి వచ్చే 22 వ తేదీ వరకు ఉండేది. రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో 1,30,694 మంది ఉద్యోగులు ఉన్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు