IPR Ex Commissioner: ప్రభుత్వ ప్రకటనలపై అసెంబ్లీలో రగడ, మాజీ కమిషనర్‌పై ఆరోపణలు, హౌస్ కమిటీ కోసం డిమాండ్
26 July 2024, 10:24 IST
- IPR Ex Commissioner: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనలపై అసెంబ్లీలో దుమారం రేగింది. సభను తప్పుదోవ పట్టించేలా మంత్రి సమాధానం ఇచ్చారంటూ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. పొంతన లేని సమాధానాలు ఇవ్వడాన్ని తప్పు పట్టారు.
ప్రభుత్వ ప్రకటనలపై ఏపీ అసెంబ్లీలో దుమారం
IPR Ex Commissioner: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనల్లో అక్రమాలపై సమాచార శాఖ మంత్రిని శాసనసభ్యులు నిలదీశారు. గత ఐదేళ్లలో ప్రకటనల జారీలో పక్షపాతం చూపలేదంటూ మంత్రి పార్థసారధి సమాధానం ఇవ్వడాన్ని సభ్యులు తప్పు పట్టారు. సమాచార శాఖలో ఐదేళ్లలో అక్రమాలు జరిగాయని, ప్రభుత్వ గణంకాలకు, మంత్రి సమాధానానికి పొంతన లేదని శాసనసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను తప్పుదోవ పట్టిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రకటనల వ్యవహారం అసెంబ్లీలో శుక్రవారం దుమారం రేపింది. గత ఐదేళ్లలో ప్రభుత్వ ప్రకటనల జారీలో పక్షపాత వైఖరి చూపారా అని సభ్యులు ప్రశ్నించగా అలాంటిందేమి లేదని మంత్రి సారథి సమాధానం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభ్యులు మంత్రి సమాధానాన్ని తప్పు పట్టారు.
సమాచార పౌరసంబంధాల శాఖ సరైన సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఆరోపించారు. పత్రికల ప్రకటనలు, ఆడిట్ బ్యూరో సర్క్యూలేషన్ ధృవీకరణలను సభ ముందు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రకటనల జారీలో ఏబీసీ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. అధికారులు సభను తప్పుదోవ పట్టించడంపై అభ్యంతరం తెలిపారు.
గత ఐదేళ్లలో ఈనాడుకు రూ.190కోట్లు, సాక్షికి రూ. 293కోట్లు ప్రకటనలు ఇచ్చారని ఆంధ్రజ్యోతికి రూ.21లక్షలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన తెలుగు పత్రికలకు కోట్లలో ప్రకటనలు ఇచ్చారని తెలిపారు.
సర్క్యూలేషన్ పెంచుకోడానికి అడ్డదారులు తొక్కారని, వాలంటీర్లు, సచివాలయాల్లో రెండేసి పేపర్లు కొనాలని సర్క్యూలర్ ఇచ్చారని ఆరోపించారు. దీని ద్వారా అదనంగా మరో రూ.9కోట్లు అదనంగా లబ్ది పొందారని ఆరోపించారు. కొన్ని చోట్ల ఉచితంగా పత్రికలు పంపిణీ చేశారని, 2019కు ముందు ఉన్న సర్క్యూలేషన్ ఎంతో గణంకాలు బయటపెట్టాలని, ఐదేళ్ల పాటు ఏ ప్రాతిపదికన చెల్లింపులు జరిపారో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.
ఓ పేపర్ కు ఇచ్చిన ప్రకటనలు చివరకు ఎవరికి చేరాయని,ముఖ్యమంత్రి సొంత పత్రికకు ప్రకటనలు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. ఈ కుంభకోణానికి కారకులు ఎవరో తేల్చాలన్నారు. ఐ అండ్ పీఆర్ కమిషనర్ విజయ్‌కుమార్ రెడ్డి బదిలీ అయిపోయారని, అతనికి పోస్టింగ్ కూడా ఇచ్చేశారని అతనితో పాటు మరో అధికారి కూడా ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నట్టు పత్రికల్లో కథనాలు వచ్చాయని సభ్యులు ఆరోపించారు.
హౌస్ కమిటీ పూర్తయ్యే వరకు మాజీ కమిషనర్ విజయ్‌కుమార్ రెడ్డిని రిలీవ్ చేయడానికి వీల్లేదని, ప్రకటనల కుంభకోణానికి అతనే సూత్రధారిగా ఉన్నారని సభ్యులు ఆరోపించారు. అవినీతి అధికారులపై భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతి 15రోజులకోసారి ప్రకటనలు వచ్చేలా చర్యలు తీసుకున్నారని, పథకాలకు పేరు మార్చి వాటికి ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు.
ప్రభుత్వ ప్రకటనల మధ్య పక్షపాతం ఉందా అని ప్రశ్నిస్తే లేదని సమాధానం ఇవ్వడాన్ని పొన్నూరు ఎమ్మెల్మే ధూళిపాళ నరేంద్ర తప్పు పట్టారు. ముఖ్యమంత్రి సతీమణికి చెందిన పత్రికకు చేసిన చెల్లింపుల్లో పక్షపాత ధోరణి కనిపిస్తుంటే పక్షపాతం లేదని సమాధానం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. సమాచార శాఖ మంత్రి పక్షపాతం లేదని సమాధానం ఎలా ఇచ్చారని సభలో నిలదీశారు. సర్క్యులేషన్ ఆధారంగా ప్రకటనలు ఇవ్వలేదని గణాంకాల్లో తెలుస్తున్నా అలా చేయలేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. సభను తప్పు దోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రకటనల వ్యవహారంపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
సభ్యుల ఆగ్రహం నేపథ్యంలో ప్రకటనల వ్యవహారంపై హౌస్ కమిటీపై స్పష్టత ఇవ్వాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు మంత్రికి సూచించారు.
ఐపీఆర్ డిస్‌ప్లే, క్లాసిఫైడ్స్ రూపంలో ప్రకటనలు ఇస్తుందని జీవో నంబర్ 431 ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రకటనలను సమాచార శాఖ జారీ చేసిందని మంత్రి సారథి చెప్పారు. పత్రికా ప్రకటనల్ని దాచి పెట్టడానికి తాము ప్రయత్నించలేదన్నారు.
ఐదేళ్లలో సాక్షి పేపర్‌కు రూ. 371కోట్లు చెల్లిస్తే , అన్ని పత్రికలకు కలిపి 481 కోట్లు చెల్లించారని మంత్రి చెప్పారు. సమాచార శాఖ అధికారులు పక్షపాతంతో పనిచేశారని మంత్రి సభలో ప్రకటించారు. వేరే డిపార్ట్‌మెంట్‌ల నుంచి రూ.32.70కోట్లు సాక్షికి చెల్లించారన్నారు. అన్ని పత్రికలు,నేషనల్ మీడియాకు కలిపి ఐదేళ్లలో రూ.485కోట్లు చెల్లించారని ఖచ్చితంగా పక్షపాత వైఖరితో చెల్లింపులు జరిపాయన్నారు. కొన్ని పత్రికలు ప్రభుత్వ చెల్లింపులు లేకపోవడంతో ప్రకటనలు తీసుకోలేదని సమాచార శాఖ మంత్రి చెప్పారు.
సాక్షిపేపర్ కొనుగోలు చేయాలనే నిర్ణయం తమ శాఖకు సంబంధించిన నిర్ణయం కాదని, డిజిటల్ కార్పొరేషన్ తమకు సంబంధం లేదన్నారు. సిఎం, సీఎస్‌తో మాట్లాడి అధికారుల్ని రిలీవ్ చేయకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.